ఉల్లి... ఎందుకీ లొల్లి!

Sunday Special Story On Onion Price Increasing - Sakshi

గత మార్చి నుంచి ఇప్పటివరకు ఉల్లి ధరలు 400 శాతం పెరిగాయి. దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.150 నుంచి రూ.200 వరకు చేరుకుంది. ధరాఘాతం కేవలం ఉల్లికే పరిమితం కాలేదు. గత నాలుగు నెలల కాలంలో దాదాపు 20 నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, కూరగాయలు, నూనె, బెల్లం వంటి సరుకుల రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా ఉల్లి గురించే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. మిగిలిన వాటి ధరలు పెరిగినా పట్టించుకోని జనం.. ఉల్లి ధరపై ఎందుకింత తల్లడిల్లిపోతున్నారు? ఇదే సండే స్పెషల్‌..

ఇది మొఘల్స్‌ ఘాటు
ఇప్పుడంటే ఉల్లి కోసం అందరూ ఎగబడుతున్నారు కానీ ఒకప్పుడు ఉల్లికి మన సమాజంలో చోటే లేదు. మొఘలాయిలు మన దేశంలోకి అడుగుపెట్టక ముందు ఉల్లి, వెల్లుల్లికి బదులుగా భారతీయులు వంటల్లో అల్లం ఎక్కువగా వాడేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 2 వేల ఏళ్ల కింద ఆయుర్వేద వైద్యుడు చరకుడి చరక సంహితలో ఉల్లి గురించి చాలా గొప్పగా రాశారు. కూరల్లో ఉల్లిని వాడితే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయని, జీర్ణక్రియకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఉల్లి వాడకం బాగా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఆయుర్వేదంలో ఉల్లిని నిషేధించారు. ఉల్లిని తమోగుణాన్ని పెంచే వస్తువుగా చూసేవారు. ఉల్లి తింటే శారీరక వాంఛలు పెరుగుతాయని తేల్చారు. దీంతో ఉల్లి అనేది కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. వితంతువులు ఉల్లి తినకూడదని ఆంక్షలు విధించారు.

క్రీస్తుశకం 7వ శతాబ్దంలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్‌ పుస్తకాల్లో.. భారత్‌లో ఉల్లిపై నిషేధం ఉందని, దాన్ని వాడేవారిని ఊరి నుంచి వెలివేశారని రాశారు. క్రీ.శ.1526లో మొఘలాయిలు భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత ఉల్లి వాడకం ఇంటింటికీ పాకింది. వాళ్లు చేసే బిర్యానీ, ఇతర వంటకాల్లో మసాలాలు, ఉల్లి లేనిదే రంగు, రుచి వచ్చేది కాదు. అలా కాలక్రమంలో ఉల్లి లేనిదే వంటలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే జైనులు ఉల్లిపాయ, వెల్లుల్లికి ఎప్పుడూ దూరమే. ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా ఉల్లి వాడేవారు కాదు. కానీ రానురానూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సత్యాన్ని గ్రహించి ఉల్లి వాడకాన్ని మొదలు పెట్టారు.

ఉల్లి ఉల్లికో కథ
సామాన్యుల నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఉల్లి లేనిదే అసలు ముద్దే దిగదు. ఏ వంట చేయాలన్నా ఉల్లి తప్పనిసరి. సలాడ్స్‌ నుంచి మాంచి మసాలాలు దట్టించిన కుర్మాలు, చికెన్, మటన్‌ వరకు ఉల్లి లేకుండా వంటలకి రుచే రాదు. శాకాహారులు ఎక్కువగా తినే సాంబార్‌లో చిన్న ఉల్లిపాయలు వాడకుండా టేస్ట్‌ తేలేరు. నిరుపేదలకు గంజన్నం, ఉల్లిపాయ ఉంటే చాలు అదే పంచభక్ష పరమాన్నం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top