
ఇటలీ క్రిస్పిల్లే రైస్ రోల్స్
కావలసినవి: బియ్యం– 250 గ్రాములు (కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి), చిక్కటి పాలు– 400 మి.లీ., నీళ్లు– 100 మి.లీ., ఉప్పు– చిటికెడు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార పొడి– 70 గ్రాములుపైనే, మైదాపిండి– 135 గ్రాములు, తాజా యీస్ట్– 15 గ్రాములు, (2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలలో కలిపి క్రీమ్‌లా చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి– కొద్దిగా, నారింజ తొక్కల తురుము– కొద్దిగా (నిమ్మ తొక్కలు కూడా తీసుకోవచ్చు) తేనె లేదా పంచదార పాకం– కొద్దిగా, నూనె– సరిపడా
తయారీ: ముందుగా పాలు, నీళ్లు ఒక పాత్రలో వేసుకుని, చిన్న మంట మీద ఎసరు పెట్టినట్లుగా పెట్టుకోవాలి. పాలు పొంగుతున్న సమయంలో బియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం పలుకుగా ఉంటే ఇంకొన్ని పాలు పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం పూర్తి అయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక బౌల్‌లోకి తీసుకుని, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, 70 గ్రాముల పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యీస్ట్, మైదా పిండి, నారింజ తొక్క లేదా నిమ్మ తొక్క తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి.
ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా రోల్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఒక బౌల్‌లో వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తేనె లేదా పంచదార పాకం వేసుకుని పైన పంచదార పొడి జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. నారింజ ముక్కలతో వీటిని తింటే భలే రుచిగా ఉంటాయి.
ఛెన్నా గొజ్జా
కావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, నిమ్మరసం– 2 టేబుల్ స్పూన్లు (వెనిగర్ కూడా వాడుకోవచ్చు), కూలింగ్ వాటర్– సరిపడా, రవ్వ– ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి– ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి– అర టీస్పూన్, నెయ్యి– వేయించడానికి సరిపడా, పంచదార, నీళ్లు– ఒక కప్పు చొప్పున
తయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి, మధ్యస్థ మంటపై మరిగిస్తూ, పాలు పొంగకుండా చూసుకోవాలి. మరిగిన తర్వాత ఒక నిమిషం పాటు చల్లారనిచ్చి, ఇప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్‌ను కొద్దికొద్దిగా పోస్తూ, పాలు విరిగే వరకు నెమ్మదిగా కలపాలి.
పాలు పూర్తిగా విరిగిపోయాక, విరిగిన పనీర్‌ను ఒక బౌల్‌లోకి తీసుకుని చల్లటి నీటిలో వేసి దానిలో కాసేపు కడిగి, పలుచటి క్లాత్‌లోకి తీసుకోవాలి. నీరు మొత్తం పిండేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నీరు పిండేటప్పుడు కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి.అనంతరం ఆ పనీర్‌ని సుమారు 5 లేదా 7 నిమిషాలు చేత్తో పిసికి మరింత మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు అందులో రవ్వ, మైదా పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అది అప్పుడు చపాతీ పిండిలా మెత్తగా అవుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని, చిన్న మంట మీద, నేతిలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ మీద పంచదార, నీళ్లు పోసుకుని, ఏలకుల పొడి వేసుకుని, లేత పాకం రాగానే కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో నేతిలో వేగిన ముక్కలను వేయించి పాకంలో నానబెట్టాక సర్వ్ చేసుకోవచ్చు.
చాక్లెట్ పీనట్ బార్స్
కావలసినవి: ఓట్స్ పౌడర్– ఒక కప్పుపైనే (ఓట్స్‌ని దోరగా వేయించి పౌడర్‌లా చేసుకోవాలి), బాదం పౌడర్– ఒక కప్పు, పీనట్ బటర్– 2 కప్పులు, మేపుల్ సిరప్– 80 ఎమ్‌ఎల్, డార్క్ చాక్లెట్ ముక్కలు– ఒక కప్పు
తయారీ: ముందుగా ఓట్స్ పౌడర్‌లో బాదం పౌడర్, పీనట్ బటర్, మేపుల్ సిరప్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్ద కాగానే బేకింగ్ ట్రేలో నింపుకుని సమాంతరంగా ఒత్తుకోవాలి. ఈలోపు చాక్లెట్ ముక్కల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కరిగించుకుని, ఆ సిరప్‌ను బేకింగ్ ట్రేలో ఉన్న పీనట్ మిశ్రమంపై, సమానంగా పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది.