నేరస్థలంలో దొరికే ఆధారాలు నిందితులను పట్టించడానికే కాదు, ఒక్కోసారి అమాయకులను రక్షించడానికీ ఉపయోగపడతాయి. నగరంలో నమోదైన హైప్రొఫైల్ కేసులో ఒకటి రికార్డుల్లో నిలిచిపోయే జగదాంబ జ్యూలర్స్ యజమాని ప్రహ్లాద్ అగర్వాల్ భార్య పుష్పాబాయి హత్యకేసు దర్యాప్తులో తొలుత అనుమానితుల జాబితా భారీగా ఉంది. అనేకమందిని విచారించారు. ఎట్టకేలకు సంఘటనా స్థలంలో నిందితుడు వదిలి వెళ్లిన దుస్తులు, జేబులో లభించిన వస్తువుల ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.
బషీర్‌బాగ్‌లో జగదాంబ జ్యూలర్స్ నిర్వహించే ప్రహ్లాద్ అగర్వాల్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో నివసించేవారు.
వీరిది ఉమ్మడి కుటుంబం. అగర్వాల్ భార్య పుష్పాబాయితో పాటు ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమలు ఒకే ఇంట్లో ఉండేవారు. అగర్వాల్, ఆయన కుమారులు 2005 అక్టోబర్ 5 ఎప్పటిలాగే వారి బంగారం దుకాణానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడలు రాధిక నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వారందరూ హడావుడిగా ఇంటికి పరిగెత్తేలా చేసింది. అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు డాక్టర్లును పిలిపించారు. వాళ్లు వచ్చి రక్తపు మడుగులో ఉన్న పుష్పాబాయిని నిశితంగా పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. దీన్ని హత్యగా తేల్చారు.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో లభించిన ఓ చొక్కా గుండీ, ప్యాంటు–షర్టు, ఆడవారి చెప్పులు, కుర్తా–పైజామాలతో పాటు హతురాలు పుష్పాబాయి చేతిలో ఉన్న పొడువాటి వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ పాదముద్రనూ గుర్తించి, దాన్ని కెమెరాలో బంధించారు. ఇంటి చుట్టూ క్షుణ్ణంగా పరిశీలించగా, హత్య జరిగిన గది నుంచి వంటింటి మీదుగా బయట వరకు పడిన రక్తపు మరకలు కనిపించాయి.
వీటి నమూనాలు సేకరించి, సాంకేతికంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు– అవి హతురాలివి కావని, హంతకుడికి అయిన గాయం నుంచి కారినవని నిర్ధారించారు. తన భార్య ప్రతిరోజూ ధరించే రెండు బంగారు గాజులు కనిపించట్లేదంటూ ప్రహ్లాద్ పోలీసులకు తెలిపారు. ఎక్కువ సొత్తు చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దోపిడీ దొంగల పని కాదని భావించారు. కేవలం పరిచయస్తుల పనిగా అనుమానించి, ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు తొలుత ఒక అనుమానితుల జాబితా రూపొందించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరి పూర్వాపరాలు తెలుసుకుని ఒక్కోక్కరికీ క్లీన్‌చిట్ ఇస్తూ పోయారు. ఇదిలా ఉండగా, హతురాలి చేతిలో లభించిన వెంట్రుకలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు కొందరి అనుమానితుల నుంచి సేకరించిన వాటితో పోల్చారు.
అవి ఎవరి వాటితోనూ సరిపోలలేదు. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పుష్పాబాయి నమూనాలతోనూ పరీక్షించి ఆమెవే అని తేల్చారు. హత్య జరిగిన గది బయట స్వాధీనం చేసుకున్న చెప్పులు పుష్పాబాయి కోడలివిగా తేలాయి. ఘటనా స్థలిలో పడి ఉన్న కుర్తా–పైజామా ఆ ఇంట్లో వారివే అని స్పష్టం కావడంతో దానిపై ఉన్న రక్తపు మరకల కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం నిందితులు తమకు అంటిన రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఆ దుస్తులు వినియోగించారని వెల్లడైంది.
అంతకంతకూ కేసు జటిలంగా మారుతుండటంతో అధికారులు మరింత లోతుగా, సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఆ ఇంట్లో పని చేస్తున్న ఒడిశా యువకుడిని, అతడి కుటుంబీకులు, సన్నిహితులను అనుమానితుల జాబితాలో చేర్చారు. హత్యాస్థలిలో లభించిన నమూనాలు వీరిలో ఎవరి వాటితోనూ సరిపోలేదు. దీంతో దర్యాప్తు అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇస్తూ వదిలేశారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలుల్లో ఉన్న చొక్కా బటన్, ప్యాంటు–షర్టులపై పోలీసులు దృష్టి పడింది. రక్తపు మరకలు అంటిన ఆ ప్యాంట్, షర్ట్ విప్పే క్రమంలోనే దాని గుండీ తెగిపడి ఉంటుందని తేల్చారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ జత బట్టలు కనిపించట్లేదంటూ యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హత్య చేస్తున్నప్పుడు ధరించిన దుస్తులను అక్కడ వదిలేసిన నిందితుడు– యజమాని దుస్తులను వేసుకు వెళ్లాడని వెల్లడైంది.
నిందితుడు వదిలేసిన ప్యాంట్ కాళ్ల దగ్గర మడిచి ఉండటం, జేబులో కాల్చిన చింత గింజలు వంటివి లభించడంతో హత్య చేసిన వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పోలీసులు అంచనా వేశారు. ఆ ఆహార్యంతో ఉండే వ్యక్తులు ఎవరంటూ హతురాలి సంబంధీకులను పోలీసులు ప్రశ్నించగా, వెలుగులోకి వచ్చిన పేరే నర్సింహ. హతురాలి కుమార్తె వద్ద గతంలో పనిమనిషిగా ఉండి మానేసినట్లు వెల్లడైంది. మరోపక్క హత్యకు ముందు ఆ ఇంటికి రాకపోకలు సాగించిన వారి వివరాలు ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నర్సింహతో పాటు నారాయణ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తేల్చారు. హత్య తర్వాత అతడు ఆ చుట్టుపక్కలకు రాకపోవడంతో అనుమానం నిజమైంది. దీంతో అతడి ఇంటి అడ్రస్ తీసుకున్న పోలీసులు గగన్‌మహల్ వద్ద ఉన్న గదిపై దాడి చేశారు. అప్పటికే అది తాళం వేసి ఉండటం, స్వస్థలమైన మెదక్ జిల్లా చిన శంకరంపేటలోనూ అతడి ఆచూకీ లేకపోవడంతో ఈ హత్య నర్సింహ పనిగా నిర్ధారించారు.
నర్సింహ కోసం తాము వెతుకుతుంటే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీలుసు భావించారు. గగన్‌మహల్‌లో అతడు అద్దెకు తీసుకున్న గదిలో సామాను అలానే ఉందా? లేదా? అనేది గమనించారు. అవన్నీ అక్కడే ఉండటంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ముందు అతడి కోసం పోలీసులు గాలించట్లేదని అనుకునేలా చేద్దామని దర్యాప్తు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు గగన్‌మహల్‌లో ఉన్న గదిపై నిఘా ఉంచిన మఫ్టీ పోలీసులు ఎట్టకేలకు నర్సింహ రాకను గుర్తించి పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా, నారాయణ అనే వ్యక్తిని పనిలో చేర్చే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ అగర్వాల్ ఇంటికి అతడితో కలిసి వెళ్లానని, అయితే పుష్పాబాయి వద్ద ఉన్న సొత్తు చూసి దాని కోసం నారాయణతో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత భయం వేయడంతో కేవలం గాజులు మాత్రమే పట్టుకుని పారిపోయామని బయటపెట్టాడు. దీంతో గాలింపు కొనసాగించిన అధికారులు నారాయణను కూడా అరెస్టు చేయగలిగారు.
శ్రీరంగం కామేష్


