కురులు నల్లగా ఉంటేనే అందం రెట్టింపవుతుంది. అయితే రసాయనాలు నిండిన షాంపూలు, కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే చాలామందికి జుట్టు తెల్లగా మారుతోంది. నడివయసుకు రాకముందే నెరిసిన జుట్టు అందాన్ని పాడు చేస్తుంది. జుట్టు తెల్లబడటం మొదలవుతున్నప్పుడే సమస్యను గుర్తిస్తే, జుట్టును నల్లగా మార్చుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు.
కెమికల్స్‌తో కూడిన రంగులు వాడకుండా, ఇక్కడ చెప్పిన చిట్కా పాటిస్తే చాలు. ఒక కప్పు తాజా కలబంద గుజ్జును రెండు చెంచాల ఆముదంతో కలిపి జుట్టు కుదుళ్లకు రాసుకోవాలి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ జుట్టులోని మెలనిన్ తగ్గకుండా చూస్తాయి. ఆముదంలో ఉండే ఒమేగా–6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు సరైన పోషణను అందిస్తాయి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా రాసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడంతో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.


