జుట్టు నేరుస్తోందని.. మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని ఫీలవకండి. వయసు పెరుగుతోందని అసలు సిగ్గుపడకండి. పైపెచ్చు జుట్టు తెల్లబడుతున్నందుకు సంతోషించండి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు . జుట్టు నెరవడం ఏమాత్రం సిగ్గుపడే విషయం కాదని .. అది వారి ఆరోగ్యానికి హేతువని పరిశోధనల్లో తేలింది. ఇకపై తెల్లజుట్టు వచ్చిందని, తమకు వృద్ధాప్యం వచ్చిందని ఏమాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇస్తున్నారు.
టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా ఒక ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. నల్లని జుట్టు తెల్లగా మారడం వెనుక ఒక గొప్ప ప్రక్రియ ఉందని.. అది మన ఆరోగ్యానికి భద్రతను.. భరోసాను కలిగిస్తుందని.. ఈ క్రమంలో తెల్లజుట్టును అందరూ ఆహ్వానించాలని అంటున్నారు. మానవుల శరీరంలో మొదలయ్యే కేన్సర్‌కు దారితీసే ప్రమాదకర కణాలను మన శరీరం నాశనం చేసి మనలను ప్రాణహాని నుంచి కాపాడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా శరీరంలోని జుట్టు రంగును కోల్పోయి తెల్లగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
మన చర్మానికి, జుట్టుకు కణాలు మెలనోసైట్ స్టెమ్ సెల్స్ కారణంగా ఆ రంగు వస్తుంది. ఈ కణాలు ఎక్కువగా జుట్టు కుదుళ్ళలో ఉంటాయి. ఇవి ఎప్పటికపుడు అంతరించిపోతూ నిరంతరం కొత్త కణాలు పుడుతూ చర్మానికి, జుట్టుకు రంగును అందిస్తుంటాయి. అయితే..

డీఎన్ఏకు క్యాన్సర్ కణాలు ఏర్పడడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఈ స్టెమ్ సెల్స్ వెంటనే ఉత్తేజితం అయిపోతాయి. సరిహద్దుల్లోని సైనికుల మాదిరి ఎలర్ట్ అయిపోయి శరీరాన్ని రక్షించే బాధ్యత తీసుకుంటాయి. అవి స్వతంత్రంగా.. అంటే ఆటోమాటిగ్గా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి తమను తాము నిర్మూలించుకుంటాయి. ఈ ఫైటింగ్ ప్రక్రియలో ఆ సెల్స్ ఆత్మార్పణ చేసుకుని మన శరీరాన్ని కాపాడుతాయి అన్నమాట దీంతో నల్లని జుట్టు కాస్తా తెల్లగా మారిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అంటే, జుట్టు బూడిదగా మారడం అనేది కేన్సర్‌కి దారితీసే కణాలను శరీరం త్యజించిన ఫలితమనే అర్థం.
అంతిమంగా ఈ పరిశోధన ఏమి చెబుతుందంటే 'బూడిద జుట్టు ఉండటం కేన్సర్‌కి రక్షణ అనేది నేరుగా చెప్పలేము, కానీ అది శరీరం కణాలను పరిశుభ్రం చేసే సహజ జీవ క్రియను సూచిస్తుంది. తద్వారా శరీరంలోని మృతకణాలు అంతరించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.' అనేది ఈ పరిశోధన సారాంశం.
:::సిమ్మాదిరప్పన్న


