నీవని... నేనని... | A Sunday Special Story Written By PAS Sudhakara Rao | Sakshi
Sakshi News home page

నీవని... నేనని...

Jul 5 2026 8:08 AM | Updated on Jul 5 2026 8:08 AM

A Sunday Special Story Written By PAS Sudhakara Rao

సండే స్టోరీ

‘‘నందినిగారూ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు’’ సడన్‌గా ప్యూన్‌ వచ్చి చెప్పగానే, ఏదో ఆలోచిస్తున్న నందిని ఉలిక్కిపడి లేచింది. మేడం అంటే ఆ ఆఫీస్‌లో బాస్‌. పేరు మాలతి– చండశాసనురాలు. నందిని ఉలిక్కిపడిలేచి మాలతి రూములోకి వెళ్ళింది, కొంచెం దిగులుగా భయంగా. తనని చూడగానే మాలతి కూర్చోమని తన స్వభావానికి విరుద్ధంగా మృదువుగా ఇలా అంది.

‘‘చూడు నందినీ! ఈ ఆఫీసులో అందరికన్నా శ్రద్ధగా కష్టపడి పనిచేసే అమ్మాయివి నువ్వు. కానీ ఈమధ్య పనిమీద నీ ధ్యాస తగ్గింది. తప్పులమీద తప్పులు చేస్తున్నావు. టెండరు విషయంలో దొర్లిన తప్పువల్ల ఆ కాంట్రాక్ట్‌ మనకు దక్కకుండా పోయింది. నీలాంటి మంచి ఉద్యోగినిని వదులుకోవడం ఇష్టంలేక ఆఖరిసారి వార్నింగ్‌ ఇద్దామని పిలిచా. ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు ఆఫీసులో చర్చించడం నాకిష్టం ఉండదు. కానీ నీమీద ఉన్న అభిమానంతో అడుగుతున్నా. ఎందుకు ఈమధ్య పరధ్యానంగా ఉంటున్నావ్‌ ? ఏమైనా సమస్యలా! ఇబ్బందులుంటే చెప్పు. నేను నీకు కావల్సిన సహాయం చేస్తా’’ అనునయంగా అంది మాలతి. చండశాసనురాలిగా పేరున్న బాస్‌ నోట ప్రేమపూర్వకమైన మాటలు వినగానే నందిని కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఏం చెప్పాలో తెలియనట్లు మాలతికేసి చూసింది.

‘‘సరే వెళ్ళి పని చూసుకో ఇంటికి వెళ్ళేముందు నన్నోసారి కలిసి వెళ్ళు’’ అని తన పని చూసుకోసాగింది మాలతి. 
నందిని బయటికి వచ్చి తన సీట్లో కూర్చుంది. అన్యమనస్కంగానే పనిలో నిమగ్నమయ్యింది. ‘సాయంత్రం తన ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. అందుకే వెళ్ళేటప్పుడు కలవమంది’ అని ఆలోచించసాగింది. సాయంత్రం ఆరు కాగానే మాలతి వెళ్ళిపోతుందని తెలుసు. ఇక భారంగా లేచింది నందిని. తోటివారి జాలిచూపులు తప్పించుకుంటూ మాలతి రూములోకి నడిచింది. తను లోపలికి వెళ్ళేటప్పటికే మాలతి తన టేబుల్‌ క్లియర్‌ చేసి బ్యాగ్‌ తీసుకుని బయటికి వెళ్ళడానికి లేచింది. నందినిని చూడగానే,

‘‘వచ్చావా! సరే నాతో రా మనం బైటకి వెళ్తున్నాం’’ అంది కూల్‌గా.
ఒక్క క్షణం ఆశ్చర్యం, ఉద్వేగం చుట్టుముట్టాయి నందినికి. ఏదో అనేలోగా, మళ్ళీ మాలతే ‘‘నీ డెస్క్‌  క్లోజ్‌ చేసి, బ్యాగ్‌ తీసుకొని బైటకి రా’’ అని బయటకు కదిలింది.
అయోమయంగా నందిని తన బ్యాగ్‌ తీసుకుని బయటకు నడిచింది. కార్లో తన కోసం చూస్తూ మాలతి కనపడింది. మాలతి రమ్మని సైగ చెయ్యటంతో అలాగే ఆశ్చర్యంగా మాలతి పక్కసీటు డోర్‌ తీసి పక్కనే కూర్చుంది నందిని. దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. సీరియస్‌గా డ్రైవ్‌ చేసుకుంటూ నేరుగా తనింటి దగ్గరికి తీసుకెళ్ళి, ఆపింది మాలతి. తనవెంట రమ్మని సైగ చేసి డోర్‌ దిగి తన ఇంటి లాక్‌ తీసి లోపలికి నడిచింది. నందిని లోపలికి రాగానే కూర్చోమని సోఫా చూపించి, టీవీ రిమోట్‌ ఇచ్చి, ‘‘టీవీ చూస్తూండు. ఒక పది నిమిషాల్లో వస్తా’’ అని లోపలికి వెళ్ళిపోయింది.

యాంత్రికంగా రిమోట్‌ తీసుకుని టీవీ ఆన్‌ చేసింది నందిని. కాని మనసు టీవీ మీదకు పోవటంలేదు. యథాలాపంగా హాలంతా కలియచూస్తూ కూచుంది. హాలంతా అందంగా అలంకరించి ఉంది. గోడమీద ఒకే ఒక చక్కని కలర్‌ ఫొటో ఫ్రేమ్‌ ఉంది. మాలతి, ఆవిడ భర్త కాబోలు చాలా హుందాగా ఉన్నాడు. ఇద్దరూ చూడ చక్కని జంట. నందినికి ప్రభాకర్‌ గుర్తొచ్చాడు. మనసు వికలమైంది. ఇంతలో మాలతి ఫ్రెష్‌గా తయారై, ఒక ట్రేలో రెండు కాఫీలు పట్టుకు వచ్చింది. 
నందిని లేచి, ‘‘అయ్యో ఎందుకు మేడం, శ్రమ పడుతున్నారు!’’ అంటూ దగ్గరకెళ్ళింది.

‘‘కూర్చో... ఇందులో శ్రమేముంది, ఇది ఆఫీసు కాదు. ఇప్పడు నేను నీ బాస్‌ని కాదు. నువ్వు నా అతిథివి. హాయిగా కూర్చుని ఈ కాఫీ తాగు’’ అని కాఫీ కప్‌ చేతికిచ్చింది. టీపాయ్‌  మీద బిస్కట్స్‌  ప్లేట్‌ పెట్టి తను కూడ కాఫీ కప్‌ తీసుకుని సోఫాలో పక్కనే కూర్చుంది. 
పొద్దుటినుండి జరిగిన సంఘటనలతో మూడీగా ఉన్న నందిని పొగలు కక్కుతున్న కాఫీ కప్పు చూడగానే మాట్లాడకుండా కప్పు తీసుకొని, కాఫీ తాగుతూ కూర్చుంది.

కాఫీలు పూర్తయ్యాక ‘‘నందినీ, ఇప్పుడు చెప్పు ఎందుకు ఈమధ్య పనిమీద శ్రద్ధ తగ్గింది? నువ్వంటే నాకెంతో అభిమానం. నువ్వు నిస్సంకోచంగా నీ సమస్య ఏంటో చెప్పు. ఒక బాస్‌గా కాకపోయినా, ఒక స్నేహితురాలిగా సహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తాను’’ అని అభిమానంగా నందిని భుజం మీద చెయ్యేసి అడిగింది మాలతి. 
ఆ అభిమానానికి నందిని కరిగిపోయింది. తనలో గూడు కట్టుకున్న దుఃఖం బయటికి వచ్చింది. నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది నందిని.

‘‘మేడం, నేను రెండేళ్ళ కిందటే ప్రేమించి, ప్రభాకర్‌ని పెళ్ళి చేసుకున్నా. రెండేళ్ల పాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకే ఇదంతా జరిగింది. అమ్మా నాన్న ముందు వెంటనే అంగీకరించకపోయినా, నామాట కాదనలేక మా పెళ్ళి జరిపించారు. ఈమధ్య దాకా మా కాపురం హాయిగా ఆనందంగా గడిచిపోయింది. మాకేమీ ఆర్థిక సమస్యలు లేవు. ఇద్దరం సంపాదిస్తున్నాం. హాయిగా గడిచిపోతున్న జీవితంలో ఎందుకో గాప్స్‌ రావటం మొదలయ్యింది. తనకి నామీద ప్రేమ తగ్గిందని చెప్పలేను కాని ఆఫీసు ఒత్తిడో, వాళ్ళ చెల్లెలి కాపురం సరిగా లేదని చిరాకో తెలీదు కాని, అనవసరంగా నామీద విసుక్కోవటం ఎక్కువయ్యింది.

ఇంట్లో ఏం కూర చెయ్యాలన్న దగ్గర్నుండి, ఏ సినిమాకు వెళ్ళాలన్నదాకా ప్రతిదాన్లో తనకి అసహనం. తాను చెప్పిందే వినాలన్న పంతం మొదలైంది. చెల్లెలి కాపురంలో సమస్యల వల్ల కావచ్చు అనుకుంటూ. నేనే ఓర్పుగా ఉంటున్నా. ఆఫీసు నుండి లేటుగా రావటం మొదలైంది. ఏదో నెలకో రెండు నెలలకో ఒకసారి ఫ్రెండ్స్‌తో పార్టీలంటూ వెళ్ళేవాడు ఉన్నట్టుండి వారానికి ఒకటి రెండుసార్లు అర్ధరాత్రి వరకూ పార్టీలంటూ తిరుగుతున్నాడు. అడిగితే, ‘ఇరవైనాలుగు గంటలూ నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక టైము లేవు నాకు. ఆదివారం ఇంట్లోనే ఉంటున్నాగా! పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలుంటాయి. అవి చూసుకోవాలి. అయినా నీకేం లోటు చేస్తున్నాను! నువ్వు మాత్రం లేటుగా రావటంలేదా అప్పుడప్పుడు ఆఫీసునుండి. అందరూ ఐదు గంటలకే వెళ్ళిపోతుంటే. నువ్వు ఆరు, ఏడు గంటలదాకా పనిచెయ్యటంలేదా! ఐనా నేనేం అనట్లేదే! నాకు కాఫీ కలుపుకోవటం కూడా రాదని నీకు తెలుసుకదా! అయినా ఓపిగ్గా ఎదురుచూశా కదా! నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు’ అని నన్నే దెప్పడం మొదలుపెట్టాడు.

అమ్మ నాన్నలకు చెప్పుకుందామంటే సిగ్గేసింది. ఇంత చదువుకొని, ప్రేమించి పెళ్ళిచేసుకుని, నా కాపురం సరిగా లేదని ఎలా చెప్పగలను! అలా అని అనుభవించనూ లేను’’ అని తన బాధంతా వెళ్ళ గక్కింది నందిని.
అంతా ఓపికగా విన్నది మాలతి... నెమ్మదిగా చెప్పసాగింది...

‘‘చూడు నందినీ, నీ సమస్య నేను అర్థం చేసుకుంటున్నా. ప్రతి అమ్మాయికి పెళ్ళయ్యాక ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. మీరిద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నా, మీ పరిచయాలకి  ముందు మీవి భిన్నమైన జీవితాలు. మీ మీ కుటుంబాల్లో కాస్త స్వతంత్రంగా ఉండి ఉంటారు. నీకన్నా తనకి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండి ఉండచ్చు. సమస్య తనదైనా, నీదైనా భార్యాభర్తలయ్యాక ఇద్దరు కలిసి చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే సులభంగా ఉంటుంది కదా!

‘నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దాలని నేను ప్రయత్నిస్తుంటే తను సపోర్టు ఇవ్వటంలేద’నే భావన తనకు రాకూడదు కదా! ఇద్దరిలో కంఫర్ట్‌ జోన్‌లో ఉండేవాళ్ళే చొరవ తీసుకుని సహాయానికి పూనుకుంటే, న్యాయంగా ఉంటుంది. రేపు నీకేదైనా నీ తోబుట్టువులకో, తల్లిదండ్రులకో సహాయం చేయవలసివస్తే తన సపోర్టు నీకు అవసరం కదా! తను ఆ సమస్య పరిష్కరించుకొనేందుకు సమయం కావాలనుకుంటే, నువ్వు కొంచెం భిన్నంగా తను ఇదివరకులా సమయం కేటాయించట్లేదని బాధపడుతున్నావా? అదృష్టంకొద్దీ మీకు ఆర్థిక ఇబ్బందులు లేవు.

తన చెల్లెలి సమస్య వివరాలు ఎప్పుడైనా అడిగావా! సహాయం చెయ్యడానికి ప్రయత్నించావా?’’ అడిగింది మాలతి. 
‘‘ఒకసారి అడిగా మేడం. వాళ్ళ చెల్లెలు ఆడపడుచు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రభాకర్‌ని ఇచ్చి చెయ్యాలని అనుకున్నారట. ప్రభాకర్‌ అప్పటికే నామీద ప్రేమలో ఉన్నాడు. ఆ విషయం చెప్పి కుదరదని చెప్పాడట. మొదట్లో భారీగా కట్న కానుకలు వచ్చాయని సరిపెట్టుకున్నా, తర్వాత తర్వాత వాళ్ళ చెల్లెల్ని సతాయించటం మొదలుపెట్టారట. ప్రభాకర్‌ ఒకసారి ఆ అమ్మాయిని కూడా  కలిసి అంతా చెప్పాడట. ఆ అమ్మాయి అర్థంచేసుకొని అడ్జస్ట్‌ అయ్యిందికానీ, అత్తమామల ధోరణిలో మార్పులేదు. ఇక ఈ విషయంలో నేను ప్రభాకర్‌కి ఏం సహాయం చెయ్యగలను? నేనేదైనా చెప్పబోతే, ఒకసారి కరుగ్గా ‘ఈ సమస్యకి ఒక కారణం నువ్వు కూడా... నువ్వు తలదూరిస్తే, సమస్య ఇంకా పెద్దదవుతుంది.

దయచేసి దీనిలో జోక్యం చేసుకోకు’ అన్నాడు. ‘అయితే, ఈ సమస్యకి పరిష్కారం నువ్వు రోజూ నీ స్నేహితులతో తాగి తందనాలాడి ఇంటికి వస్తే దొరుకుతుందా?’ అని నేనూ ఆవేశంగా అన్నా... అంతే, అప్పట్నుంచి దూరం పెరిగింది.. హాయిగా సాగిపోతున్న మా కాపురంలో కలతలు, అపార్థాలు మొదలయ్యాయి. ప్రభాకర్‌ నన్ను తక్కువగా చూసినా అవమానకరంగా మాట్లాడినా, నేను తట్టుకోలేను. ఇదీ మా కథ మేడం. ఉద్యోగం సరిగా చెయ్యలేకపోతున్నా. రాజీనామా చేద్దామని చాలాసార్లు అనుకున్నా. మళ్ళీ ఇంట్లో ఒక్కతినే ఉంటే ఆలోచనలు ఎక్కువై కుంగిపోతానేమో అని భయపడి చెయ్యలేదు.’’ చెప్పింది నందిని.
మాలతి శ్రధ్ధగా విన్నది. ఒక పది నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.

పది నిమిషాలయ్యాక మాలతి మౌనాన్ని ఛేదిస్తూ, ఇలాఅంది: ‘‘నందినీ, నీ సమస్య కొంచెం జటిలంగానే ఉంది. ఓపిగ్గా పరిష్కరించుకోవాలి. ఇందులో నీ తప్పేమీలేదని కూడా నాకు అర్థమయ్యింది. కానీ ఇలా దూరాలు పెంచుకొని , శాశ్వతంగా దాంపత్య బంధం తెంచుకోవటంకన్నా, దాన్ని మరింత బలపరుచుకోవటం మీద దృష్టి పెడితే మంచిదని నాకనిపిస్తుంది. భార్యా భర్తల మధ్య ఒక జీవితకాల ప్రయాణం ఉంటుంది. ప్రయాణం ఇద్దరిదీ, కాని మార్గం ఒక్కటే! గమ్యం కూడా ఒక్కటే కావాలి. ఇది నిండు జీవితానికి సంబంధించిన సమస్య. నీ భర్త దుర్మార్గుడైతే, శారీరకంగా, మానసికంగా నిన్ను ఇబ్బంది  పెట్టేవాడయితే, ఆ బంధాన్నే పట్టుకుని వేలాడమని చెప్పను.

నువ్వు చెప్పినదాన్ని బట్టి అతను స్వతహాగా మంచివాడే. పరిస్థితుల ప్రభావంవల్ల ఇబ్బందులు పడుతూ, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంచుమించు నీలాంటి పరిస్థితే నాకు ఎదురైనప్పుడు, నేను ఆత్మాభిమానం గురించి ఎక్కువగా ఊహించుకొని, నా భర్తకు దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అన్నీ ఉన్నా ఏదో వెలితి. తను నన్ను వదిలేసి లండన్‌ వెళ్ళిపోయాడు. మరోపెళ్ళి గురించి కూడా ఆలోచించా. కాని తన స్థానంలో ఇంకో వ్యక్తిని ఊహల్లో కూడ భరించలేకున్నా. నన్ను చండశాసనురాలు అనుకుంటారు కానీ, పని మీద ఫోకస్‌ పెట్టి వ్యక్తిగత బాధని మర్చిపోయే  ప్రయత్నం చేస్తున్నా.

చివరగా నేను చెప్పేదేమిటంటే, నామాట విని కొంచెం నెమ్మదిగా ఓర్పుగా, మళ్ళీ ప్రయత్నించు తనకు దగ్గరవటానికి. నీకు ఈ సలహాతో పాటు ఒక సహాయం కూడా చేస్తున్నా. రేపటి నుంచి నీకు ఒక నెలరోజులు పెయిడ్‌ లీవ్‌ శాంక్షన్‌ చేస్తున్నా. మీ వారికి రాజీనామా చేశానని చెప్పు. ఈ నెలరోజులూ తన మనసు గెలవడానికి ప్రయత్నించు. నా సపోర్టు నీకెప్పుడూ ఉంటుంది. అవసరమైతే లీవ్‌  పొడిగించుకో.’’  అంటూ ముగించింది మాలతి.
నందినికి మనసంతా చాలా తేలికపడింది. ‘‘థాంక్యూ వెరీమచ్‌ మేడం! మీ మేలు మరచిపోలేను. తప్పకుండా మీ సలహా పాటిస్తా’’ అని సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసింది.

ఇంటికెళ్ళేటప్పటికి ప్రభాకర్‌ ఇంకా ఇంటికి రాలేదు. గబగబా రెడీ అయ్యి, తనకిష్టమైన వంట చేసి,  ఎదురుచూడసాగింది. ప్రభాకర్‌ కొంచెం లేటుగానే వచ్చాడు. నందిని ప్రశాంతంగా ‘‘రా వడ్డిస్తాను’’ అని టేబుల్‌ సర్దుతూ కూచుంది.
మామూలుగా ఐతే ఈపాటికి ఒక చిన్నపాటి గొడవ అయితే కానీ భోజనం ఉండేది కాదు ప్రభాకర్‌కి. కాస్తంత రిలీఫ్‌గా ఫీలై వచ్చి కూర్చున్నాడు. వంట అంతా తన కిష్టమైన పదార్ధాలే! తృప్తిగా భోజనం చేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నందిని అన్నీ సర్దేసి వచ్చేసరికి ప్రభాకర్‌ సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాడు. లేపి బెడ్రూమ్‌కి తీసుకెళ్ళి పడుకోబెట్టి, తను పడుకుంది నందిని.
మర్నాడు తెల్లవారింది. ప్రభాకర్‌ మామూలుగా ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. తనతోపాటు పరుగులు పెడుతూ, ఆఫీసుకు తయారయ్యే నందిని ప్రశాంతంగా కూర్చుని ఉంది.

‘‘ఏం నందినీ ఆఫీసులేదా!’’ అడిగాడు ప్రభాకర్‌. 
‘‘ఉద్యోగానికి రిజైన్‌ చేశా’’ అంది నెమ్మదిగా.
ఉలిక్కి పడ్డాడు ప్రభాకర్‌. ‘విన్నది తానేనా! అన్నది నందినేనా! తను ఉద్యోగం రిజైన్‌ చెయ్యటమా?’... కొద్ది క్షణాలకు తేరుకుని... ‘‘నిజంగానా, ఎందుకు, ఏమైంది?’’ అన్నాడు ఆశ్చర్యంగా. 
‘‘మరేంలేదు. ఈ ఉరుకులు పరుగులు వదిలేసి, మన జీవితాలు కొంచెం ఆనందంగా, హాయిగా ఉండాలని బ్రేక్‌ తీసుకున్నా. నువ్వు ఆఫీసుకు వెళ్ళిపో... సాయంత్రం ఎదురుచూస్తూంటా, బై...’’ అని సాగనంపింది.
ఒక వారం రోజులు ఇలాగే గడిచాయి. ప్రభాకర్‌కి కావల్సినవి అరేంజ్‌ చెయ్యటం తప్ప ఏం రియాక్టవకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది నందిని.

ఒకసారి డ్రింక్‌ చేసి లేట్‌గా వచ్చినా మౌనంగా సర్దుకుపోయింది. ఇంకో నాలుగు రోజులు పోయాక ప్రభాకర్‌లో కొంచెం కదలిక ప్రారంభమైంది. ‘అరే, తను నందిని  తన సమస్యతో బాధపెడుతున్నాడా! తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదిలేసేటట్టు చేశాడా! తను ఇలాగే మౌనంగా ఓర్చుకుంటూ, కుమిలిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే... తన జీవితం ఏమైపోతుంది! సరిగా గమనించలేదు కానీ, నందినిలో మునుపటి చలాకీతనం, ఉత్సాహం పూర్తిగా మాయమయ్యాయి. తనే చొరవ తీసుకొని నందినితో మునపటిలా ఉండాలి’ అనుకుంటూ మరో రెండు రోజులు గడిపేశాడు. ఆరోజు ఆదివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మామూలుగానైతే, బైటకెళ్ళి సినిమాకో, షికారుకో వెళ్ళి హోటల్లో డిన్నర్‌ చేసి వచ్చేవాళ్ళు. ఈమధ్య తను చెల్లెలి సమస్యతో నందినిని దూరం పెడుతున్నాడు. ఆలోచిస్తూనే ఇద్దరూ కాఫీ టిఫిన్లు పూర్తి చేశారు. ఇంతలో నందినే చొరవ తీసుకొని దగ్గర కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టింది.

‘‘ప్రభా! మన మధ్య దూరం రోజురోజుకి పెరుగుతోందని అర్థమవుతోంది. నావంతు ప్రయత్నంగా నిన్ను కంఫర్ట్‌ జోన్‌లో పెట్టడానికి నా ఉద్యోగానికి కూడా రిజైన్‌ చేశా. నీ సమస్యకి నేనేమీ చెయ్యలేనని అన్నావు కాబట్టి ఆ విషయం గురించి కూడ మాట్లాడలేదు. కానీ, నువ్వు మారుతావన్న నమ్మకం తగ్గిపోతోంది. నీ మౌనం నన్ను కాల్చేస్తోంది. నీకు దూరం అవుతానేమో అన్న ఆలోచనే భయంకరంగా ఉంది. మన బంధం మునుపటిలా ఉండాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నీకోసం ఏం కావాలన్నా చేస్తా!’’ నందినికి భావోద్వేగంతో మాటలు పెగలటంలేదు.

ఇంకా ఏదో చెప్పబోయేంతలో... అప్పటికే కదిలిపోయిన ప్రభాకర్‌– నందినికి దగ్గరగా జరిగి గబుక్కున తనని దగ్గరికి తీసుకుని, ‘‘సారీ నందూ! ఇంకేం మాట్లాడకు. తప్పంతా నాది. నా సమస్యని నీ మీద రుద్ది నిన్ను బాధపెట్టాను. మనమధ్య పెరిగిన ఈ దూరంతో నీకన్నా నేనే ఎక్కువ నష్టపోయాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు. తిట్టుకుంటూనో, పొగుడుకుంటూనో కలిసుంటేనే ఆనందం. విడిపోతే ఏముంటుంది! మా చెల్లెలు వాళ్ళకు దూరంగా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా. అదైపోతే ఈ గొడవ కూడా ఉండదు. కాకపోయినా పర్లేదు. నీ విలువేంటో నాకర్థమైంది. నువ్వు మళ్ళీ నీ ఉద్యోగం కోసం ప్రయత్నించు. లేదా ఇంకో జాబ్‌ కోసం ప్రయత్నించు. నాకు నా మునుపటి నందిని కావాలి...’’ చెప్పుకుంటూ పోతున్నాడు ప్రభాకర్‌.

నందినికి సంతోషంతో మాటలు రావటంలేదు. క్షమ, ఓర్పు ఎంత గొప్పవో అని మాలతి చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. మాలతి మీద కృతజ్ఞతతో మనçసు నిండిపోయింది. ప్రభాకర్‌ని హత్తుకొని గుండెలమీద తలవాల్చి అలాగే ఉండిపోయింది.
నందినితో మాట్లాడిన రాత్రి మాలతి– లండన్లో ఉన్న భర్త మధుసూదన్‌కి కాల్‌ చేసింది. ‘‘హాయ్‌ మధూ! ఎప్పుడు ముగుస్తోంది నీ లండన్‌ అజ్ఞాతవాసం! రెండేళ్ళు కావొస్తోంది– కెరీర్, బిజినెస్‌ అంటూ నువ్వక్కడ నేనిక్కడ... డిసెంబరు లోపల రాకపోయావో, ఆఫీసు క్లోజ్‌ చేసి లండన్‌ వచ్చేస్తా! ఈ ఒంటరి జీవితం నా వల్లకాదు...’’ ఇంకం పూర్తి చెయ్యకముందే, అట్నుంచి మధు అనబడే మధుసూదన్‌ ‘‘మహాతల్లీ! ఆ పని చెయ్యకు. ఈలోగా వచ్చేస్తాగా!’’

‘‘సరే, చెప్పాగా రాకపోతే ఏమవుతుందో... అన్నట్టు మధూ! నీకొక సంగతి చెప్పాలి. మా ఆఫీసులో నందిని అనే సిన్సియర్‌ ఎంప్లాయీ గురించి చెప్తుంటా కదా! తన కాపురం చక్కదిద్దటానికి, మనిద్దరం విడిపోయామని, నువ్వు దుర్మార్గుడివని, నన్ను వదిలేసి వెళ్ళిపోయావని చెప్పా’’ అంటూ జరిగిందంతా చెప్పింది మాలతి. 
విని, నవ్వుతూ అన్నాడు మధు ‘‘పర్లేదు మాలా! చాలాసార్లు సరైన సలహాలు దొరకక, చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ, అందమైన దాంపత్యం జీవితానికి దూరం అవుతుంటారు చాలామంది. మంచి పని చేశావు. వాళ్ళ కాపురం చక్కబడాలని కోరుకుందాం. ఉంటామరి... బై!’’ అని ఫోన్‌ పెట్టేశాడు మధు. - పి.ఎ.యస్‌. సుధాకరరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement