పిలవని అతిథి | Funday: Sunday Special Malladi Venkata Krishna Murthy Stories | Sakshi
Sakshi News home page

పిలవని అతిథి

Jun 28 2026 8:06 AM | Updated on Jun 28 2026 8:29 AM

Funday: Sunday Special Malladi Venkata Krishna Murthy Stories

హైద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో రెండువేల చదరపు గజాల విస్తీర్ణంలోని అదొక్కటే అతి పాత ఇల్లు. చుట్టుపక్కల ఇళ్ళన్నీ పడగొట్టి అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్స్‌ కట్టారు. కాని కింద ఆరు గదులు, పైన ఆరు గదులున్న ఆ పెద్ద ఇల్లు మాత్రం ఏ మార్పులూ లేకుండా ఉంది. అది 1970లలో బాలానగర్‌లో లేత్‌ మెషిన్స్‌ తయారు చేసే ఓ పారిశ్రామికవేత్తది. ఆ ఇంటికి వారసురాలైన ఆయన భార్య సిద్ధిధాత్రి ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. 

ఎనభై రెండేళ్ళ ఆవిడకి నలుగురు పిల్లలు. కూతురికి పెళ్ళై కలకత్తా వెళ్ళిపోయింది. ముగ్గురు కొడుకుల్లో ఒకడు కరోనా సమయంలో పోయాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు డెహ్రాడూన్‌లో టీ పరిశ్రమ నడుపుతున్నారు. మూడో కొడుకు ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. ఆ సాయంత్రం ఆవిడ వంటగదిలోకి వెళ్ళి షెల్ఫ్‌ తలుపు తెరిచి చూసింది. ఆవిడకి ఆ షెల్ఫ్‌లో కాఫీ పొడి సీసాని కుడివైపు, చక్కెర సీసాని ఎడమవైపు ఉంచటం అలవాటు. 

కాని అవి అటుదిటు, ఇటుదటు కనిపించడంతో తను వాటిని అలా ఎప్పుడు పెట్టిందా అని ఆలోచించింది. మరో రోజు ఆవిడ పలాస నుంచి తెప్పించుకున్న పొట్టు జీడిపప్పు అరకిలో పాకెట్‌ని సీసాలో పోస్తే అది నిండింది. ఆ అరకిలో ఆవిడకి మూడు వారాలు వస్తుంది. ఆవిడ ఆరోగ్యం కోసం రోజుకి ఏడు పప్పులు తింటుంది. కాని అవి సరిగ్గా సగం రోజుల్లో ఖాళీ అవడం ఆవిడకి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఓ రాత్రి అన్నం తిన్నాక సాంబార్‌ గిన్నెను ఆవిడ సింక్‌లో పడెయ్యలేదు. దాన్ని డైనింగ్‌ రూమ్‌లో పింగాణీ డిష్‌లోకి మార్చాక, వేడి పోవాలని డైనింగ్‌ టేబిల్‌ మీదే గుర్తుగా ఉంచి మర్చిపోయింది. కాని మర్నాడు ఉదయం అది సింక్‌లో కనిపించింది. ఇంకో రోజు తోటలోని తాజా మెట్టతామర పూలు ఫ్లవర్‌ వేజ్‌లో ప్రత్యక్షం అవడంతో సిద్ధిధాత్రి తుళ్ళిపడింది. చూస్తే వాటిని తెంపిన కత్తెర టీవీ కింద కేబినెట్లో కుడి డ్రాయర్‌లో బదులు ఎడమ డ్రాయర్లో కనిపించింది. అది అలై్జమర్స్‌ లక్షణం అని స్ఫురించగానే తనకి అనుకోని అతిథిగా అలై్జమర్స్‌ వస్తోందా అని ఆవిడకి భయం వేసింది.

ఆ రాత్రి ఆవిడకి మృదువుగా ఈల వినిపించడంతో మెలకువ వచ్చి లేచి కూర్చుంది. అది పై అంతస్తులోంచా లేక తోటలోంచా? ఆవిడకి బోధపడలేదు. అంతలోనే ఆవిడకి నిద్రపట్టింది. మర్నాడు ఉదయం ఆవిడకి ఆ ఈల గుర్తొచ్చి కలై ఉంటుంది అనుకుంది. మర్నాడు రాత్రి కూడా ఆవిడకి ఈలతో మెలకువ రావడంతో ఇల్లంతా వెతికింది. ఎవరూ కనిపించలేదు. తన భర్త మరణించిన మంచం మీదే నిద్రించే సిద్ధిధాత్రికి దెయ్యాల మీద నమ్మకం లేదు. 

తనకి అనుకోని అతిథిగా అల్జిమర్స్‌ రావటం కాదని, ఇంట్లోనే ఏదో జరుగుతోందని ఆవిడకి అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల దాకా ఈల శబ్దం వినిపించలేదు. ఓ రాత్రి పెద్ద చప్పుడికి మెలకువ వచ్చి లేచి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది. డైనింగ్‌ టేబుల్‌ మీది అన్నం గిన్నె నేల మీద కనిపించింది. పిల్లి అంత పెద్ద గిన్నెని నేల మీదకి నెట్టలేదు. వెంటనే ఆవిడ పోలీసులకి ఫోన్‌ చేసింది. పావుగంటలో వాళ్ళు వచ్చారు.

‘‘ఏం జరిగింది?’’ ఆవిడ వెంట లోపలకి నడుస్తూ ఎస్‌.ఐ. ప్రశ్నించాడు. ‘‘ఇంట్లో దొంగ పడ్డాడు. ఇది ఆ దొంగ పని. ఇంట్లో నాకు తెలీకుండా ఎవరో మసలుతున్నారు.’’ ఆవిడ నేల మీది ఆ గిన్నెని చూపించి చెప్పింది. ఆవిడ సాంబారు గిన్నె గురించి, జీడిపప్పు, కాఫీ, చక్కెర సీసాల గురించి చెప్పింది. ఆ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంటుందని తెలిసిన పోలీసులు ఇల్లు, తోట వెతికారు. ఎవరూ కనపడలేదు. తలుపులు, కిటికీలు మూసే ఉన్నాయి.

‘‘ఈ ఇంట్లోకి ఇంకెవరో వచ్చి వెళ్తున్నారు. పైన గెస్ట్‌ రూమ్‌లో దుప్పట్లు పరిచి గుర్తుగా ఓవైపు అంగుళం ఎక్కువ కిందకి జార్చాను. కాని అది మర్నాడు సమానంగా కనిపించింది. ఓ తెల్లవారుఝామున అతిథుల బాత్‌రూంలోకి వెళ్తే అది తడిగా ఉంది.’’ ఎస్‌.ఐ., హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అది గమనించిన ఆవిడ చెప్పింది.

‘‘నేనేం పిచ్చిదాన్ని కాను.’’ ‘‘రాత్రుళ్ళు మా పెట్రోల్‌ కారు వాళ్ళని మీ ఇంటివైపు వచ్చి ఓకన్నేసి ఉంచమని చెప్తాను.’’ ఎస్‌.ఐ. చెప్పాడు. మర్నాడు ఉదయం సిద్ధిధాత్రి ఎప్పటిలా మరో మనిషి ఉనికి కోసం షెల్ఫ్‌లోని కాఫీ సీసాని గమనించింది. అది యథాస్థానంలో లేదు. కావాలని ఆవిడ దాని కింది కాగితం చుట్టూ బాల్‌ పెన్‌తో గుండ్రం గీసింది. కాఫీ పొడి సీసా ఆ గుండ్రంలో లేదు. ఆవిడ మేడ మెట్లు ఎక్కి పై భాగంలోకి వెళ్ళి గెస్ట్‌ రూమ్‌ తలుపు తెరుచుకుని మంచం దగ్గరికి వెళ్ళింది. దాని మీద ఆవిడకి ఓ కాగితం కనిపించింది. దాన్ని అందుకుని చదివింది.

మేడం సిద్ధిధాత్రి, ఈ ఇంట్లో మీతో పాటు నేనూ ఉంటున్నాను. చిరుద్యోగినైన నేను పగలు ఉద్యోగానికి ఫ్యాక్టరీకి వెళ్ళి, రాత్రి మీరు నిద్రపోయాక టెర్రేస్‌ తలుపులోంచి లోపలికి వస్తున్నాను. మీకు ఎలాంటి కీడు చేయను. కేవలం రాత్రుళ్ళు ఆశ్రయం, స్నానం, కాఫీలని, ఆకలేసినప్పుడు స్నాక్స్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టం లేకపోతే ఈ ఉత్తరాన్ని తీసుకోండి. 

ఓ అపరిచితుడికి సహాయం చేద్దామనుకుంటే దీన్ని ఇక్కడే ఉంచండి. ఈ అర్ధరాత్రి మంచం మీద ఇది కనపడకపోతే ఇక ఎప్పటికీ మీ ఇంటికి రానని మాట ఇస్తున్నాను. దాన్ని చదివాక ఆవిడ కొద్దిసేపు ఆలోచించింది. ఆ ఉత్తరంతో బయటకి నడిచి మెట్లు దిగింది. మధ్యాహ్నం సిద్ధిధాత్రి దాని కింద ‘నువ్వు ఈల మాత్రం వేయకు’ అని రాసి మళ్ళీ అతిథి గదిలోకి వెళ్ళి మంచం మీద ఆ ఉత్తరాన్ని ఉంచి బయటకి నడిచింది. 
మల్లాది వెంకట కృష్ణమూర్తి  

(చదవండి: ‘త్రిపుర రాయని కథ’’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement