వైర్లు లేకుండా విద్యుత్‌ | Scientists are discovering new technology electricity with wire less power | Sakshi
Sakshi News home page

వైర్లు లేకుండా విద్యుత్‌

Sep 11 2022 5:51 AM | Updated on Sep 11 2022 11:13 AM

Scientists are discovering new technology electricity with wire less power - Sakshi

రాత్రి వేళ సోలార్‌ పలకలు

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త సాంకేతికత వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతానికి కొంచెం వింతగా అనిపించినా భవిష్యత్తులో సాధారణంగా మారే అవకాశం ఉన్న సరికొత్త పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న అలాంటి కొన్ని సరికొత్త వాస్తవాలను పరిచయంచేసే ప్రయత్నమే ఈ వారం సండే స్పెషల్‌.  

వైర్‌లెస్‌ విద్యుత్‌.. 
ప్రస్తుతం మనకు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ గురించి తెలుసు. కానీ, వైర్‌లెస్‌ కరెంటు గురించి తెలీదు. త్వరలోనే ప్రతి ఇంట్లోకి వైర్‌లెస్‌ కరెంట్‌ అందుబాటులోకి రాబోతోందని దక్షిణ కొరియాలోని సెజాంగ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. 30 మీటర్ల దూరం వరకూ ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఉపయోగించి, 400 మిల్లీవాట్ల వైర్‌లెస్‌ విద్యుత్‌తో ఎల్‌ఈడీ లైటును వెలిగేలా చేశారు.

ట్రాన్స్‌మీటర్, రిసీవర్‌ ద్వారా ఈ విద్యుత్‌ సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్‌ సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎలాంటి అపాయాలు జరగవని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు.. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్‌హోమ్స్‌ లేదా పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఇంటర్నెట్‌ ద్వారా పనిచేసే పరికరాలు)కు విద్యుత్‌ను అందించే అవకాశముంటుందని చెబుతున్నారు.  

ఇసుకతో బ్యాటరీ.. 
ఫిన్లాండ్‌ శాస్త్రవేత్తలు ఇసుకతో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేశారు. దీనిలో ఒకసారి గ్రీన్‌ పవర్‌ను స్టోర్‌చేస్తే నెలవరకూ నిల్వ ఉంటుంది. సౌర, పవన విద్యుత్‌ లాంటి గ్రీన్‌ ఎనర్జీని ఏడాది పొడవునా అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని ఈ తాజా బ్యాటరీ పరిష్కరించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ను ఉష్ణం రూపంలో 500 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద దీనిలో నిల్వచేయొచ్చు.

సోలార్, పవన విద్యుత్‌ను గ్రిడ్లతో అనుసంధానించవచ్చు. కానీ, రాత్రివేళ, గాలి లేనప్పుడు విద్యుదుత్పత్తి జరగదు. ఈ సమస్యను పెద్దపెద్ద బ్యాటరీలతో పరిష్కరించవచ్చు. ప్రస్తుతం చాలావరకు బ్యాటరీలను లిథియంతోనే తయారుచేస్తున్నారు. ఇది చాలా ఖరీదైన లోహం. ఫిన్లాండ్‌ ఇంజినీర్లు ఇసుకతో తయారుచేసిన బ్యాటరీలో తక్కువ ఖర్చుతో విద్యుత్‌ నిల్వచేయగలిగారు. అమెరికాలోని నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లే»ొరేటరీ కూడా ఇసుకను హరిత ఇంధనంగా భావించి పరిశోధనలు చేపట్టింది. 

రాత్రిపూటా సోలార్‌ విద్యుత్‌ 
రాత్రిపూట కూడా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే సోలార్‌ ప్యానెల్‌ను కాలిఫోరి్నయాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. ఇప్పుడు మనం చూసే సోలార్‌ ప్యానెల్‌ ఏదైనా పగటిపూట మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దానికి సూర్యకాంతి అవసరం. కానీ.. కొత్త ప్యానెల్స్‌తో బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. ఆ బ్యాకప్‌ నుంచి పగలు, రాత్రి నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. రాత్రిపూట విద్యుదుత్పత్తి కోసం ఇంజనీర్లు థర్మోఎలక్ట్రిక్‌ జనరేటర్‌ను రూపొందించారు. ఈ జనరేటర్‌ సోలార్‌ ప్యానెల్, గాలి, ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని విద్యుత్‌గా మారుస్తుంది.  

ఎన్నెన్నో ప్రయోగాలు.. 
ఇక గాలిపటాలతో విద్యుత్‌ను పుట్టించే  టెక్నాలజీని స్కాట్లాండ్‌కు చెందిన రాడ్‌ కనిపెట్టారు. ‘ఫ్లయింగ్‌ టర్బైన్‌’ టెక్నాలజీని ఆయన ఆవిష్కరించారు. గాలి పటాలు తిరుగుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్‌ స్టేషన్‌ విద్యుత్‌గా మారుస్తుంది. మరోవైపు.. బ్రిటన్‌లోని ఒక నైట్‌క్లబ్‌ తమ క్లబ్‌కు వచ్చి డ్యాన్స్‌ చేసే కస్టమర్ల శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్‌ తయారుచేస్తోంది. ‘బాడీహీట్‌’ పేరుతో ఇలా తయారుచేసిన విద్యుత్‌ను నిల్వచేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేలా ఏర్పాటు కూడా చేసింది.

పలు దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సముద్ర అలలతో విద్యుదుత్పత్తి చేసే అవకాశాలపై అధ్యయనం జరుగుతోంది. ఇటీవల మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను స్థాపించారు. ఇక బొగ్గు కొరత నుంచి బయటపడేందుకు బ్లూ హైడ్రోజన్‌ ప్రత్యామ్నాయమని జపాన్‌ భావిస్తోంది. అమ్మోనియానుగానీ, హైడ్రోజన్‌ను గానీ మండించడం ద్వారా విద్యుదుత్పత్తి చేయడమే ఈ బ్లూ హైడ్రోజన్‌ విధానం. జపాన్‌లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌తో వాహనాలను ఆ దేశం ప్రయోగాత్మకంగా నడిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement