వినూత్న విద్యుత్‌.. పంప్డ్‌ స్టోరేజ్, సోలార్, విండ్‌ పవర్‌

Pumped storage hydropower project is Innovative electricity - Sakshi

పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ అనేది సరికొత్త విధానం

వేర్వేరు ఎత్తులలో రెండు నీటి రిజర్వాయర్ల నిర్మాణం

వాటి మధ్య టర్బైన్‌ గుండా నీరు కదులుతున్నప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి

విద్యుత్‌ నిల్వ, అవసరమైనప్పుడు విడుదల చేయగల సామర్థ్యం 

సౌర, పవన విద్యుత్‌తో మరింత ప్రయోజనం  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతతో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అధునాతన రివర్స్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌  ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

ప్రైౖవేటు సెక్టర్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పిన్నాపురంలో గ్రీన్‌ కో గ్రూప్‌ ఇటువంటి ప్రాజెక్టునే స్థాపిస్తోంది. 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 1,680 మెగావాట్లు పంప్డ్‌ స్టోరేజ్, 3 వేల మెగావాట్లు సోలార్, 550 మెగావాట్లు విండ్‌ పవర్‌ ఉత్పత్తి జరుగుతుంది. దీని కోసం కేవలం ఒక టీఎంసీ నీరు సరిపోతుంది. ఇలా ఒకే చోట మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే సమగ్ర పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే ఇది పెద్దది. ఈ నేపథ్యంలో పంప్డ్‌ స్టోరేజ్, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల సాంకేతికత, వాటి ప్రయోజనాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఉత్పత్తి చేస్తుంది.. నిల్వ చేస్తుంది
పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ (పీఎస్‌హెచ్‌) ఒక రకంగా జల విద్యుత్‌ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్‌లపై నిర్మిస్తారు. వీటి మధ్య టర్బైన్‌ల గుండా నీరు ఒకదాని నుండి మరొక దానికి (డిశ్చార్జ్‌) కదులుతున్నప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఇది శక్తిని నిల్వ చేయగలదు, అవసరమైనప్పుడు దానిని విడుదల చేయగలదు. ఎగువ రిజర్వాయర్‌ (రీచార్జ్‌) లోకి నీటిని తిరిగి పంప్‌ చేస్తున్నందున దానికి అవసరమైన విద్యుత్‌ను అందించానికి పీఎస్‌హెచ్‌ ఒక పెద్ద బ్యాటరీలా పనిచేస్తుంది.

రెండు విధాల పని
ఈ విద్యుదుత్పత్తి కేంద్రాలు జలాశయాల్లోని నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఎక్కువ నీరు అవసరం ఉండదు. విద్యుత్‌ ఉత్పత్తికి ఎగువ జలాశయం నుండి జనరేటర్‌ని తిప్పే టర్బైన్ల ద్వారా నీరు ప్రవహించి, విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. దిగువ రిజర్వాయర్‌ నుంచి ఎగువ రిజర్వాయర్‌లోకి నీటిని తిరిగి పంప్‌ చేయడానికి టర్బైన్‌లు వెనుకకు తిరుగుతాయి, అప్పుడు కూడా విద్యుత్‌  ఉత్పత్తి అవుతుంది. ఇలా రెండు విధాలా ఉపయోగకరంగా ఉంటాయి.

హైడ్రో పవర్‌తో ఇవీ ప్రయోజనాలు
పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్‌ సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్‌ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని  విడుదల చేయడం వల్ల టర్బైన్‌ కిందికి కదిలి  విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. తక్కువ గాలి, సూర్యరశ్మి లేకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికంగా లాభదాయకంగా, పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్‌ స్టోరేజీ మాత్రమే సరైన మార్గం. ఈ ప్లాంట్లు సామర్థ్యంలో 82 శాతం వరకు పని చేస్తాయి. 80 సంవత్సరాలకంటే ఎక్కువ జీవితకాలం దీని అదనపు ప్రయోజనం.

సౌర విద్యుత్‌  సూత్రమిది
ప్రపంచంలో ఒక సంవత్సరం ఉపయోగించే విద్యుత్‌  కంటే ఒక గంటలో వెలువడే సౌర శక్తి ఎక్కువ. కానీ అంత విద్యుత్‌ను మనం వినియోగించుకోలేము. సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లలో సోలార్‌ పానెల్‌లోని ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌ వెలుతురుని ఎలక్ట్రాన్లుగా మార్చి విద్యుత్‌ శక్తిగా మారుస్తాయి. ఒక్కో మాడ్యూల్‌ ఒకటిన్నర చదరపు మీటర్‌ విస్తీర్ణంలో ఉంటుంది. అది 40–60 వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. 4–12 శాతం లాస్‌ అవుతుంది.

గాలి చేసే మేలు
పవన విద్యుత్‌ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం ద్వారా పవన విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. మూడు రెక్కలు గల గాలి మరను దీనికోసం వాడుతుంటారు. మన పూర్వీకులు, చాలా ఏళ్ళ ముందు నుంచీ నావలను నడపడానికి, నీటిని తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుదుత్పత్తిలోనే. పవన విద్యుత్‌ శిలాజ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌తో పోలిస్తే తక్కువ గ్రీన్‌హౌస్‌ వాయువులను విడుదల చేస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు. 

సౌర విద్యుత్‌తో మరింత ఉపయోగం
భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల విద్యుత్‌ సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగెళ్లిపోతాయి. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్‌ను హీట్‌ ఇంజన్‌ (ఉష్ణోగ్రత భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది)ల నుంచి, ఫొటో వోల్టాయిక్‌ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు.

చిన్న, మధ్య తరహా అవసరాల కోసం మొదట్లో ఫోటో వోల్టాయిక్స్‌నే వాడేవారు. ఆ తరువాత వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్‌ ప్లాంట్లు వచ్చాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో లక్షలకొద్దీ సౌర ఫలకాలు విద్యుత్‌ గ్రిడ్‌లో భాగం కావడం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఫొటో వోల్టాయిక్‌ పవర్‌ స్టేషన్‌ కర్ణాటకలోని పావగడలో ఉంది. ఇది ఏటా 2,050 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top