Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు?

Star Maa Bigg Boss 5 starts on september 5, hosted Nagarjuna - Sakshi

ఆకర్షణీయమైన నాలుగు గోడల ‘బందీఖానా వినోదం’కు మళ్లీ తెర లేవనుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య స్నేహం, శతృత్వం, పోటీ, ప్రతీకారం... ఇవన్నీ జనం కుతూహలంగా చూడనున్నారు. మరో వారం రోజుల్లో సెప్టెంబర్‌ 5 నుంచి బిగ్‌బాస్‌ 5 తెలుగు. నాగార్జున యాంకర్‌ అని తెలుసు. కాని ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరు? అసలు ఈ షో సక్సెస్‌ ఫార్ములా ఏమిటి? సండే స్పెషల్‌...

ఎదుటివారి జీవితంలోకి తొంగి చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పల్లెల్లో అయితే నిన్న మొన్నటి వరకూ బహిరంగ జీవితం ఉండేది. ఏ ఇంట్లో ఏ మంచి చెడు జరిగినా అందరికీ తెలిసిపోయేది. కాని ఇప్పుడు మనుషులు ‘ప్రయివేటు’గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగలేకపోయినా మన ఇంటి వరకే అనుకుంటున్నారు. సమస్యలు, సంతోషాలు కూడా దాచుకుంటున్నారు. ఇక నగరాల్లో ఎవరికి వారే మూసీకి నీరే. పక్క ఫ్లాట్‌లో ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశమే లేదు. ఈ వెలితిని, మానవ స్వభావంలో ఉండే ‘పొరుగింటి కుతూహలాన్ని’ అడ్రస్‌ చేస్తూ సూపర్‌హిట్‌ అయిన షో ‘బిగ్‌బాస్‌’. మొదట హిందీలో మొదలయ్యి ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి మారిన ఈ షో ఇంటింటా రాత్రుళ్లు ‘ఇంకో ఇంటి’ని తీసుకొచ్చి ఆ ఇంటి సభ్యుల జీవితాన్ని పరిశీలించే వినోదాన్ని ఇస్తూ ఒక సీజన్‌ అయిన వెంటనే మరో సీజన్‌ ఎప్పుడూ అని ఎదురు చూసేలా చేస్తుంది. ఆ ఎదురు చూపులకు జవాబే వచ్చే వారం మొదలు కానున్న ‘బిగ్‌బాస్‌ 5’.

 

 

16 మనస్తత్వాల గేమ్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లో భిన్న నేపథ్యాలు, సామాజిక జీవనాలు, సెలబ్రిటీ స్టేటస్‌లు, వయసులు, జెండర్‌లు ఉన్న కంటెస్టెంట్‌లను 16 మందిని ఒకచోట చేర్చి వారి ఇంటికి బయట నుంచి తాళం వేసి వారి మధ్య నడిచే ‘భావోద్వేగాల డ్రామా’ను లెక్కకు మించిన కెమెరాలతో రికార్డు చేయడమే బిగ్‌బాస్‌ షోలో విశేషం. ఒకసారి వచ్చిన వారు మరోసారి రారు కనుక ప్రతిసారీ కొత్త మనుషుల స్వభావాలను చూసే వీలు ఈ షోలో ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ వీరి మధ్య స్నేహాలు ఏర్పడతాయి. శతృత్వాలు ఏర్పడతాయి. కక్షలు క్షణికావేశాలు... ఇవన్నీ ఉత్కంఠను కలిగిస్తాయి. ఎంత సెలబ్రిటీ అయినా సగటు సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తాడో చూపడమే ఈ షో ఫార్ములా. మానవ మనస్తత్వాన్ని గుర్తెరిగి ఎదుటివారి ప్రవర్తనకు చలించకుండా ఎవరైతే తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారో లేదా తమ వ్యక్తిత్వాన్ని నిజాయితీగా ప్రదర్శనకు పెడతారో వాళ్లే ఈ షోలో విజేతలు అవుతారు. లేని వారు ఎలిమినేట్‌ అవుతూ వెళతారు.

ఈసారి ఎవరు?
బిగ్‌బాస్‌ షో మొదలయ్యే వరకు అందులో పాల్గొనేవారు ఎవరు అనే విషయాన్ని షో నిర్వాహకులు రహస్యంగా ఉంచుతారు. అయినా సరే ‘లీకుల’ కోసం ప్రయత్నించి కొద్దో గొప్పో సమాచారాన్ని, ఊహాగానాలు చేయడాన్ని ప్రతిసారీ చూడవచ్చు. షోను అద్యంతం ఆసక్తికరం చేయడానికి నిర్వాహకులు రకరకాల సెలబ్రిటీస్‌ను చివరివరకూ సంప్రదిస్తూనే ఉంటారు. కనుక ఫైనల్‌ లిస్ట్‌ అనూహ్యంగా ఉంటుంది. బిగ్‌బాస్‌ 5 కోసం ఎవవరెవరిని సంప్రదించారు అనే విషయంలో ఎవరెవరు పాల్గొంటారన్న విషయంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో సీనియర్‌ నటి సురేఖవాణి పేరు ఒకటి. టీవీ, సినిమాల్లో ఆదరణ పొందిన సురేఖవాణి మంచి మాటకారి.

కనుక ఆమె షోలో ఆమె ఉండటం బాగుంటుందని భావించవచ్చు. అలాగే టీవీ, సినీ నటి ప్రియ కూడా కంటెస్టెంట్‌ల జాబితాలో ఉందని భోగట్టా. హుందా అయిన పాత్రలు చేసిన ప్రియ బిగ్‌హౌస్‌లో ఉండటం మహిళా ప్రేక్షకులకు నచ్చొచ్చు. టీవీ యాంకర్‌ల కోటాలో ఈసారి రవికి అవకాశం దక్కిందని అంటున్నారు. రవి కూడా మంచి మాటకారి కనుక ఈ షోకు ఎనర్జీ తెచ్చే అవకాశం ఉంది. గతంలో డాన్స్‌మాస్టర్లు బాబా మాస్టర్, అమ్మ రాజశేఖర్‌ల వరుసలో ఈసారి డాన్స్‌మాస్టర్‌ నట్‌రాజ్‌ పేరు వినిపిస్తోంది. అలాగే ఈసారి వినిపిస్తున్న మరోపేరు దీపక్‌ సరోజ్‌. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా బాలనటుడిగా కనిపించిన దీపక్‌ సరోజ్‌ ఆ తర్వాత ‘మిణుగురులు’ సినిమాలో నటించాడు. ఈసారి యూత్‌ ఐకాన్‌గా అతడు షోలో కనిపించవచ్చు. వీరు కాకుండా జబర్దస్త్‌ టీమ్‌ నుంచి పవన్, యాంకర్‌ లోబో పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇంకా యూట్యూబ్‌ స్టార్లు కొందరు చోటు దక్కించుకోవచ్చు. సీనియర్‌లు కొందరు రంగప్రవేశం చేయొచ్చు కూడా.

100 రోజులు ఎవరిస్తారు?
బిగ్‌బాస్‌ హౌస్‌లో కనీసం 100 రోజులు ఉండాలి. 100 రోజుల పాటు కుటుంబాన్ని, కెరీర్‌ను పక్కన పెట్టి ఈ షోలో పాల్గొనాల్సి ఉంటుంది. పైగా బిగ్‌బాస్‌ టాస్కుల్లో నచ్చినా నచ్చకపోయినా పాల్గొనాల్సి ఉంటుంది. సున్నిత మనస్కులకు ‘నామినేషన్‌’ ప్రక్రియ పెద్ద శిక్షే. అదీగాక ఈ షో వల్ల వచ్చే పాపులారిటీ బాగానే ఉన్నా అది కొత్తవారికి ఉపయోగపడినంతగా సీనియర్స్‌కు ఉపయోగపడదు. అందుకే షో తాలూకు సీజన్లు గడిచే కొద్దీ ‘తెలిసిన స్టార్లు’ తగ్గుతూ వెళ్లి పూర్తిగా కొత్త ముఖాలు చోటు చేసుకోవడం బిగ్‌బాస్‌ షో ట్రెండ్‌ను గమనించినవారికి అర్థమవుతుంది. గతంలోని బిగ్‌బాస్‌ సిరీస్‌ల వల్ల హరితేజ, రోల్‌ రైడ, రాహుల్‌ సిప్లిగంజ్, సోహైల్‌ తదితర యువతరం సెలబ్రిటీలే ఎక్కువగా లబ్ధి పొందారు.

సెప్టెంబర్‌ 5 నుంచి మొదలు
సెప్టెంబర్‌ 5 నుంచి ‘మా’ టీవీలో మొదలుకానున్న ఈ షో ఈసారి ఎన్ని సర్‌ప్రైజ్‌లను తేనుందో తెలియదు. యాంకర్‌గా నాగార్జున గత సీజన్‌లో మరింత ఈజ్‌తో షోను రక్తి కట్టించారు. ఆయనకు వీలు కాని రోజుల్లో ఒకసారి నటి రమ్యకృష్ణ, ఒకసారి సమంత షోను హోస్ట్‌ చేయడం కూడా విశేషం. ఈసారి ఆయన కాస్ట్యూమ్స్, లుక్‌ ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమే. ఏమైనా ఒక పెద్ద వినోదానికి తెర లేవనుంది. నానా చికాకులతో ఉన్న నేటి ప్రేక్షక లోకానికి ఈ షో ద్వారా మంచి వినోదం అందుతుందనే ఆశిద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top