సన్నాఫ్‌ కింగ్‌.. బిజినెస్‌లో రాకింగ్‌ | Special Story On Naga Chaitanya Businesses | Sakshi
Sakshi News home page

సన్నాఫ్‌ కింగ్‌.. బిజినెస్‌లో రాకింగ్‌

Mar 18 2026 12:37 PM | Updated on Mar 18 2026 12:48 PM

Special Story On Naga Chaitanya Businesses

క్రియేటివిటీయే కిక్ ఇస్తుందంటున్న చైతూ

కోట్లాది మందికి నాగ చైతన్య ఒక నటుడిగానే తెలుసు. కానీ కొంత మందికి మాత్రం ఆయనలో గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడని కూడా తెలుసు. తండేల్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌నూ, రాష్ట్ర అవార్డ్‌ను కూడా అందుకున్న నాగ చైతన్య యువ హీరోల్లో దూసుకుపోతున్న యువహీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు. సీనియర్‌ హీరోల్లో నాగార్జున సైతం వ్యాపార రంగంలో ముఖ్యంగా రెస్టారెంట్‌ రంగంలో తనను తాను నిరూపించుకున్న నేపధ్యంలో అందులోనూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నాగ చైతన్య. కుటుంబ సంబంధ పరిశ్రమకు అనుబంధంగా దక్షిణ భారతదేశంలోని అత్యంత అధునాతన సౌండ్‌ మిక్సింగ్‌ స్టూడియోలలో ఒకదానిని ఏర్పాటు చేయడం వంటివాటితో పాటు సినిమాకు అవతల కూడా తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని చైతూ నిర్మించుకుంటున్నాడు.

టాలీవుడ్‌ టూ టేస్టీ ఫుడ్‌...
లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది నటీనటులు కొత్త కధలు వింటూనో, విభిన్న భాషా చిత్రాలను చూస్తూనో గడిపితే.. నాగ చైతన్య మాత్రం  క్లౌడ్‌ కిచెన్‌ అనే సరికొత్త కాన్సెప్ట్‌కి శ్రీకారం చుడుతూ దాని కోసం మెనూలను డిజైన్‌ చేస్తూ గడిపాడు. జపనీస్‌ స్ఫూర్తితో ఆయన ప్రారంభించిన క్లౌడ్‌ కిచెన్‌ పేరు.. ’షోయు’, నిజానికి ఇది ఒక వ్యాపార ప్రణాళికతో  మొదలవ్వలేదు. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ సమయంలో చైతూ చేతిలో ఉన్న ఖాళీ సమయంతో మొదలైంది. ‘జపనీస్‌ వంటకాలంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, మొదటగా రుచి చూసేది జపనీస్‌ వంటకాలే. ఆ రుచిని, ఆ అనుభూతిని ఏదో ఒక విధంగా హైదరాబాద్‌కు తీసుకురావాలనుకున్నాను,‘ అని ఆయన గుర్తు చేసుకున్నాడు. 

తన అభిరుచికి అనుగుణంగా మొదట ఆయన ఒక జపనీస్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినా కరోనా మహమ్మారి కొత్త ఆలోచనలు అందించింది.  డైనింగ్‌ రూమ్‌లు మూతపడటం, డెలివరీ యాప్‌లు విపరీతంగా పెరగడం అనే సంక్షోభం నుంచి ఆయన క్లౌడ్‌ కిచెన్‌.  అనే ఒక  కొత్త అవకాశాన్ని గుర్తించాడు. ‘రెస్టారెంట్‌లో వడ్డించినట్లుగా  ఆహారాన్ని చక్కగా ప్యాక్‌ చేసి ఇంటికి పంపే క్లౌడ్‌ కిచెన్ కు మన మార్కెట్‌లో మంచి స్కోప్‌ ఉందని గమనించాడు. వినియోగదారుడి ఇంటికి ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ సరైన విధంగా చేరేలా చూసుకోవడానికి ప్రత్యేకమైన క్రమశిక్షణ కావాలి ‘క్లౌడ్‌ కిచెన్ లో క్లయింట్‌ ఏమీ చూడలేరు. 

ఓ ప్యాకెట్‌ డెలివరీ బాయ్‌ ద్వరా తన ఇంటికి రావడం మాత్రమే జరుగుతుంది. అంతా ఆహారం మాత్రమే చెప్పాలి. అక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదు.‘ అని చైతన్య అంటున్నాడు.   కొత్త వంటకాలను తయారు చేస్తున్నప్పుడు, వాటిని మొదటగా రుచి చూసేది  నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాలే. ‘ఇంట్లో, ఫుడ్‌ ట్రయల్స్‌ జరుగుతున్నప్పుడు నేను కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటే, శోభిత ఆ వంటకాలను రుచి చూస్తూ నాకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంది,‘ అని ఆయన చెప్పాడు. మెనూలను తీర్చిదిద్దడంలో ఆమె సలహాలు కూడా ఒక భాగమని ఆయన వివరిస్తారు. ‘ఈ విషయంలో  కుటుంబం నాకు గొప్ప మద్దతుగా నిలుస్తోంది..‘అంటాడు చైతూ.

తొలి బ్రాండ్‌ షోయు మంచి సక్సెస్‌ కావడంతో    రెండవ బ్రాండ్‌ అయిన స్కూజీ కూడా దూసుకొచ్చింది. తొలి బ్రాండ్‌కు శోభిత ఫ్యాన్‌ అయితే చైతూ తండ్రి నాగార్జున రెండ బ్రాండ్‌కి ఫ్యాన్‌గా మారారు. తన తండ్రి తమ  పిజ్జాలకు వీరాభిమాని అని చైతూ సంతోషంగా చెబుతాడు.  అలా నాగచైతన్య స్థాపించిన షోయు శరవేగంగా విస్తరిస్తోంది.  ఇప్పుడు హైదరాబాద్‌లోని  అవుట్‌లెట్, ఎయిర్‌పోర్ట్‌ అవుట్‌లెట్‌కు అదనంగా, బెంగళూరు  ఢిల్లీలో కూడా క్లౌడ్‌ కిచెన్ లను ఏర్పాటు చేసింది.. బ్రెడ్‌  చీజ్‌ ఆధారంగా రూపొందించిన కంఫర్ట్‌ ఫుడ్‌ బ్రాండ్‌ అయిన స్కూజీ, కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. వచ్చే జూలై నెలలో మాదాపూర్‌లో ఒక పూర్తి స్థాయి  కేఫ్‌ ప్రారంభం కానుంది. ఈ రెండు బ్రాండ్‌లు ఇప్పటికే స్వయం సమృద్ధిని సాధించడం విశేషం.

నాటి స్కూల్‌ డేస్‌ నుంచి నేటి రేసింగ్‌ లీగ్‌ దాకా..
ఎందుకో సరిగ్గా తెలియకపోయినా చెన్నైలోని సర్క్యూట్‌లలో వేగంగా దూసుకుపోయే కార్లను, నాడు స్కూల్‌ విద్యార్థి గా  చైతూ ఆసక్తిగా చూసేవాడు.  ‘‘చాలా చిన్నప్పటి నుంచే రేసింగ్‌ నా హాబీగా ఉంది. నా స్కూల్‌ రోజుల్లో,  దాదాపు ప్రతి వారాంతం శ్రీ పెరంబుదూర్‌ రేస్‌ట్రాక్‌కు వెళ్లి స్థానిక జాతీయ ఛాంపియన్‌ షిప్‌లను చూసేవాడిని. రేసింగ్‌ పట్ల ఇష్టం అక్కడి నుంచే వచ్చింది.’’అంటూ గుర్తు చేసుకుంటాడు.

ఆ చిన్ననాటి వారాంతపు అభిరుచి ఇప్పుడు ఓ ట్రాక్‌ వైపు దారితీసింది. ఇప్పుడు  ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లోని హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌కు నాగ చైతన్య  సహ–యజమానిగా మారేలా చేసింది. ఈ ఓపెన్‌ సీటర్‌ ఫార్ములా కార్లతో మోటార్‌స్పోర్ట్‌ను ఇంత దగ్గరగా చూడటం దాదాపు ఒక కల నిజమైనట్లుగా ఉంది. స్ట్రీట్‌ సర్క్యూట్‌ ఫార్మాటే ఈ లీగ్‌ను ప్రత్యేకంగా నిలుపుతుందని ఆంటాడు చైతూ.

సినిమా అనేది తనను మేల్కొలిపే పలు అంశాలలో ఒకటి మాత్రమేనని చైతూ చెబుతున్నాడు. ‘‘చేస్తున్న ప్రతి పనిలో, పాలుపంచుకున్న ప్రతి చోట, సృజనాత్మకంగా  ఉత్తేజితుడనవుతాను. అదే నన్ను సంతోషంగా ఉంచుతుంది, నన్ను ముందుకు నడిపిస్తుంది. మీరు నిజంగా ఆనందించే పనులు చేస్తున్నప్పుడు, ఇక ఏ సమస్య లేదు’’ అని అంటాడీ యంగ్‌ బిజినెస్‌ లీడర్‌.

తనలాగే ఒకే కెరీర్‌కు మించి ఏదైనా నిర్మించాలనుకునే యువ అభిమానులకు ఆయన ఇచ్చే సలహా... ‘రాత్రికి రాత్రే ఫలితాలు రావాలని లక్ష్యంగా పెట్టుకోవద్దు. మంచి విషయాలన్నింటికీ సమయం పడుతుంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలానికి ప్రణాళిక వేసుకోండి.  విజయానికి చిన్న చిన్న అడుగులు వేయాలి.  షార్ట్‌కట్స్‌ వెతకడానికి ప్రయత్నించవద్దు. నిజమైన సహజమైన మార్గాన్ని ఎంచుకోండి.‘ అని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement