తిరుమల ఆలయ పాలనలో.. ఇప్పటికీ బ్రిటిష్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది!

British Rule In Tirumala Temple Administration - Sakshi

సాక్షి: స్వామి రోజూ అద్దంలో చూసుకుంటారా? అంటే అవుననే చెబుతోంది వైఖానస ఆగమ శాస్త్రం. ప్రత్యూష కాల పూజల్లో  గర్భాలయ మూలమూర్తికి ఆదర్శం (అద్దం), గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజం, అశ్వం, గాయకుడు.. ఇలా వరుసగా దర్శింప చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. ఇదే సంప్రదాయం ఆధునిక కాలంలోనూ స్పల్పమార్పులతో నేటికీ కొనసాగుతుండటం విశేషం.

► 8వ శతాబ్దంలో వైఖానస మహాపండితుడు శ్రీమాన్‌ నృసింహ వాజపేయ యాజులవారు తన ‘భగవదర్చాప్రకరణమ్‌’ అనే గ్రంథంలో తిరుమల ఆలయంలో నిత్యం వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆరాధన గురించి తెలియజేశారు. శ్రీవారికి కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాల అమలు కోసం పూర్వం వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 
► ప్రత్యూష కాలంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచెకోల (తాళాలు)తో మంత్ర పూర్వకంగా బంగారు వాకిలి ద్వారాలు తెరిచి వేదపఠనంతో అంతరాళంలోకి ప్రవేశిస్తారు. 
► గర్భాలయంలోని స్వామి మూర్తికి కుడివైపున దక్షిణ దిశలో దర్పణం ఏర్పాటు చేసి ఉంది. అర్చకులు ఆ అద్దంలోగుండానే స్వామిని చూస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగమ సంప్రదాయానికి లోబడే మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలిలోని గరుడాళ్వారు సన్నిధికి పైభాగంలో టీటీడీ పెద్ద అద్దం ఏర్పాటు చేసింది.   
► లేగదూడతో సహా గోవును స్వామివారి ప్రథమ వీక్షణకై అంతరాళంగా పరిగణించే శయన మండపంలో నిలిపి ఉంచాలి. పూర్వం శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణ కోసం సన్నిధి గొల్ల ముందుగా ఆవు, దూడతో వెళుతుండగా, ఆయనను అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు.
► ఆవు, లేగదూడలను గర్భాలయ మూలమూర్తికి అభిముఖంగా నిలిపి, ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని పూర్తి చేయించాలి. తర్వాత సన్నిధి గొల్ల గోవు పొదుగు నుండి పాలు పితికి అర్చకులకు అందించేవాడు. ఆగమంలో చెప్పినట్టు ఆ పాలు ‘ధారోష్ణం’ అంటే ఆవు పొదుగు నుండి పాలు పితికినపుడు పాత్రలో పడిన పాలధార వల్ల కొంత ఉష్ణం పుడుతుంది. అటువంటి ధారోష్ణం కలిగిన పాలను నివేదనగా సమర్పించేవారు. 
► ప్రస్తుత పరిస్థితుల్లో గోవు, లేగదూడ ఆలయంలోనికి ప్రవేశించే సంప్రదాయం లేదు. వైఖానస ఆగమంలో చెప్పబడిన ‘గో సూక్తం’ అనే వేద మంత్ర పఠనం ద్వారా పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆగమ సంప్రదాయంకోసం స్వామివారే యాదవ వంశస్థుడైన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం చేసుకునే వరమిచ్చారు. అదే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. 
గజముఖాన్ని దర్శించే స్వామి.. 
► స్వామివారు ప్రథమ వీక్షణ కోసం గజాన్ని దర్శించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు.
► గర్భాలయ మూలమూర్తికి ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సమస్త పూజలను మూలమూర్తికి సమానంగానే నిర్వహిస్తారు. రాత్రి ఏకాంత సేవ కూడా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికే నిర్వహిస్తారు. ఇదే చివరగా నిర్వహించే పవళింపు పూజ. గర్భాలయానికి ముందున్న శయనమండపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి భోగ శ్రీనివాసుడిని శయనింప చేస్తారు. మరుసటి రోజు ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొలుపుతారు.
► శయన మండపంలో స్వామివారికి ఉత్తర, దక్షిణ దిశల్లో  రెండేసి శిలాస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర దిశలో ఉన్న ఓ శిలాçస్తంభం అగ్రభాగాన గజ శిర స్సు చెక్కబడి ఉంది. 
► శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవలో మేల్కొలుపు తర్వాత ప్రథమంగా శిలాççస్తంభంపై ఉన్న గజ ముఖాన్ని దర్శింప చేస్తారు. ఆ తర్వాతే భోగ శ్రీనివాసుడిని శయనమండపం నుంచి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థాపంలో వేంచేపు చేస్తారు.

శ్రీవారి పద్మపీఠం.. దివ్యతేజో రహస్య యంత్రం!
► శ్రీవేంకటేశ్వర స్వామి వారు గర్భాలయంలోని ఉపద్యక పవిత్ర స్థానంలో స్వయంవ్యక్త సాలగ్రామ అర్చావతారంగా స్థానిక మూర్తి/ ధ్రువమూర్తిగా పద్మపీఠంపై కొలువయ్యారు. స్వామి పాదపద్మాల కింద రహస్య యంత్రం ఉంది. సాక్షాత్తు మూలమూర్తి అంశగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహ పరిశీలనలో ఈ విషయం తేలింది. 
► క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి సామవై పెరుందేవి మహారాణి ఈ రజత మూర్తిని ఆలయానికి సమర్పించారు. శంఖచక్రాలు ధరించి, అడుగున్నర పొడవు కలిగిన ఈ రజితæమూర్తి పూర్తిగా మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ విగ్రహం కింద యంత్రం ఉన్నట్టు అర్చకులు గుర్తించారు. అందువల్ల కచ్చితంగా మూలవిరాట్టు పాదపద్మాల కింద యంత్రస్థాపన ఉండి ఉంటుందనీ అర్చకుల వాదన. వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వారు ఈ రహస్యాన్ని గురించి వివరణ ఇచ్చి ఉండటం అర్చకుల వాదనకు బలం చేకూరింది.

తెల్లదొరలూ... శ్రీవారి సేవకులే..
1801 నుండి 1843 వరకు బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా పాలకుల హయాంలోనే ఆలయ పాలనకు కఠిన నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతులు అమలయ్యాయి. నేటికీ తిరుమల ఆలయం, టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్‌  ఈస్టిండియా కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నార్త్‌ ఆర్కాట్‌ జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో సాగింది.

అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. దీంతో బ్రిటిష్‌ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు ∙1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్‌ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్‌  నియమితులయ్యారు.

టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు 
దిట్టం: శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు. 
కైంకర్యపట్టీ: తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీదారులు, జియ్యర్‌ సిబ్బంది వి«ధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చే శారు. దీనిప్రకారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి. 
బ్రూస్‌కోడ్‌: బ్రిటిష్‌ ప్రావిన్షియల్‌ జడ్జి పి.బ్రూస్‌ ఈస్టిండియా కోడ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్‌ రూపొందించారు. అదే బ్రూస్‌ కోడ్‌. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచిగా ఉంది. 
సవాల్‌–ఇ–జవాబు: శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలు వేసి వాటికి సమా«ధానాలు రూపొందించారు. దీన్నే సవాల్‌– ఇ–జవాబు పట్టీగా పిలుస్తారు. 
పైమేయిషీ ఖాతా: ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషీ అకౌంట్‌’ అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, వి«ధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది.

►జీవో ఎంఎస్‌ నెంబరు 4429 తేది:23.09.1940,  జీవో ఎంఎస్‌ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్‌ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చదరపు కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి భక్తి తత్పరతకు నిదర్శనం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top