ఇదేమి.. 'సర్‌'దర్ద్‌! | EC portal not suitable for searching names | Sakshi
Sakshi News home page

ఇదేమి.. 'సర్‌'దర్ద్‌!

Jul 10 2026 1:26 AM | Updated on Jul 10 2026 1:26 AM

EC portal not suitable for searching names

కాగితాలపైనే పూర్తయిన ‘సర్‌’ ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ

100% పంపిణీ జరిగిన జిల్లాల్లోనూ ఇంకా ఫారాల కోసం ఓటర్ల నిరీక్షణ  

హైదరాబాద్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో బీఎల్వోల వద్దే ఫారాలు

ఫారాలను నింపడంపై ఓటర్లకు అవగాహన కల్పించని ఈసీ 

యూట్యూబ్‌లో చూసి నింపుకోవాలని చెబుతున్న బీఎల్వోలు 

2002 వివరాలు రాయాల్సిన చోట్ల ప్రస్తుత వివరాలు రాస్తున్న ఓటర్లు  

పాత, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో పేర్లు సహా అన్నీ తప్పులతడకలు 

పేర్లు వెతికేందుకు అనువుగా లేని ఈసీ పోర్టల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 సామాన్యులకు పజిల్‌గా మారింది. రాష్ట్రంలో 99.46 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి కార్యాలయం ప్రకటించగా ఇంకా తమకు ఫారాలు అందలేదని చాలా మంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు. ఫారాలను నింపడంపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) యూట్యూబ్‌లో చూసి నింపుకోవాలని సెలవిస్తున్నారు. వెరసి ‘సర్‌’కార్యక్రమం ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

కాగితాలపైనే 100% ఫారాల పంపిణీ! 
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఏకంగా 100 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ ఆయా జిల్లాల్లో చాలా మంది ఓటర్లు తమకు ఇంకా ఫారాలు అందలేదని చెబుతున్నారు. ఇళ్లు మారిన ఓటర్లలో చాలా మంది పాత ఇళ్లకు చెందిన ప్రాంతాల్లోని బీఎల్‌ఓల వద్దకు వెళ్లి ఫారాలు తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే ఫారాలు అందాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంత జిల్లాల్లో కొందరు బీఎల్‌ఓల వద్దే సగానికిపైగా ఫారాలు పంపిణీ కాకుండానే మిగిలిపోయాయి. పంపిణీ కాని ఫారాలను ఓటర్ల గైర్హాజరు, వలసలు, మరణించిన (అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్‌/ఏఎస్డీ) ఓటర్లవని పేర్కొంటూ వాటిని సైతం లెక్కల్లో చూపడంతోనే సగటున 99 శాతానికిపైగా ఫారాల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది.  

అవగాహన లేక..వివరాలు లేక.. ఫారం నింపలేక... 
ఎన్యూమరేషన్‌ ఫారాలు అందుకున్న ఓటర్లు 2002 ‘సర్‌’ఓటర్ల జాబితాలో ఓటరు పేరు ఉంటే ఆ వివరాలను ఎడమ వైపు కాలమ్‌లో రాయాల్సి ఉండగా ముందు (ఎడమ) కాలమ్‌లో బంధువుగా పేర్కొన్న వ్యక్తి పేరు గత సర్‌ జాబితాలో ఉంటే ఆ వివరాలను కుడివైపు కాలమ్‌లో రాయాల్సి ఉంది. ఇందుకోసం 2002 జాబితాలో తమ పేరు, బంధువుల పేర్లను వెతకాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేని ఓటర్లు ఈ కాలమ్స్‌లో ప్రస్తుత జాబితాలోని తమ వివరాలు రాస్తున్నారు. వాస్తవానికి 2002 జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఎలా ఉంటే అలా యథాతథంగా రాయాలి. 2002 జాబితాలో లేకుంటే ఖాళీగా వదిలేయాలి. అలాగే ఫారం మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ/ఆధార్‌(ఐచ్ఛికం)/మొబైల్‌ నంబర్‌/తండ్రి/తల్లి/భాగస్వామి వివరాలను రాయాల్సి ఉంది. 

2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో దాదాపుగా అందరు ఓటర్ల పేర్లు, బంధువుల పేర్లు, వయసు, బంధుత్వం వివరాల్లో వ్యత్యాసాలున్నాయి. ఒక జాబితాతో పోలిస్తే మరో జాబితాలో కొందరి పేర్లు, బంధువుల పేర్లు పూర్తిగా మారిపోయాయి. బంధుత్వం వద్ద తండ్రికి బదులు భర్త అని, భర్తకి బదులు తండ్రి/భార్య అని తప్పుగా వచ్చింది. దీంతో మూడో విభాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం వివరాలు రాయాలా లేక సరైన వివరాలు రాయాలా అనే అంశంపై ఓటర్లలో గందరగోళం నెలకొంది. దీంతో తప్పులు రాసి మళ్లీ సరిదిద్దే ప్రయత్నంలో చాలా మంది ఫారాన్ని గజిబిజి చేస్తున్నారు. పాతబస్తీలోని కొన్ని జిరాక్స్‌ సెంటర్ల నిర్వాహకులు ఒక్కో ఫారం నింపడానికి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. 

రోజుల తరబడి వెతికినా దొరకని 2002 జాబితాలో ఓటు 
ఇళ్లు మారిన పట్టణ ప్రాంత ఓటర్లు 2002 జాబితాలో తమ పేర్లను వెతకడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసీఐ పోర్టల్‌ (https://voters.eci.gov.in/searchIn SIR) లో 2002 జాబితాలో ఓటర్ల పేర్లు వెతకడానికి పీడీఎఫ్, సెర్చ్‌ విత్‌ ఓటర్స్‌ డిటైల్స్‌ అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. పాత నియోజకవర్గం పేరు, నాటి పోలింగ్‌ కేంద్రం నంబర్‌ తెలిసి ఉంటేనే పీడీఎఫ్‌ జాబితాలో నేరుగా వెతకడానికి వీలవుతోంది. ఈ వివరాలు తెలియకపోతే సెర్చ్‌ విత్‌ ఓటర్స్‌ డిటైల్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఓటరు పేరు, బంధువు పేరును కీవర్డ్స్‌గా ఇచ్చి సెర్చ్‌ చేయాలి. ఇలా సెర్చ్‌ చేస్తే తమ పేర్లు మినహా సారుప్యత కలిగిన ఇతర ఓటర్ల పేర్లు డిస్‌ప్లే అవుతున్నాయని ఓటర్లు పేర్కొంటున్నారు. సెర్చ్‌లో 200 మందికి మించి పేర్లు చూపకుండా సాఫ్ట్‌వేర్‌లో పరిమితులు విధించడంతో 2002 జాబితాలో పేర్లు వెతకడం చాలా మందికి అసాధ్యంగా మారింది. దీంతో ఆయా ఓటర్లు ఫారాలు నింపకుండా ఖాళీగా ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వారంతా నోటీసులు అందుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఖాళీ ఫారం తిరిగిచ్చేశా.. 
నా పేరు 2002 ఓటర్ల జాబితాలో లేదు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి వివరాలు లేవు. ఫారం నింపాలని బీఎల్‌ఓను అడిగితే ఏదో ఒక ఆధారం కావాలని అన్నారు. తండాలో చదువుకున్న వారి వద్దకు వెళ్తే వివరాల్లేకుండా ఫారం నింపడం సాధ్యం కాదన్నారు. అందుకే మీకు నచ్చినట్టు నింపుకోండని బీఎల్‌ఓకు ఫారం ఇచ్చేశా. 
– మాలోతు బాలమ్మ, గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ తిర్లాపురం తండా, మహబూబాబాద్‌ జిల్లా  
 
నాకు ఫారం ఇవ్వలేదు 
నేను వెల్డర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇంట్లో నలుగురం ఉన్నాం. ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. నాది ఇవ్వలేదు. రోజూ అధికారులను అడిగినా దొరకట్లేదు అంటున్నారు. దీంతో వారిని అడగడం మానేశా. 
– తిరునగిరి మహేశ్, వీవర్స్‌ కాలనీ, జనగామ (100% పంపిణీ పూర్తైన జిల్లా) 

ఫారాలు ఎలా నింపాలో తెల్వట్లే... 

మా ఇంట్లోని నలుగురు ఓటర్లకు బీఎల్‌వో ఫారాలను ఇచ్చారు. కానీ మాకు చదువురాకపోవడంతో ఎలా నింపాలో తెలియలేదు. హైదరాబాద్‌లో ఉన్న కొడుకు, కోడలి సూచనతో తెలిసిన వారిని అడిగాం. వారు సైతం తెలియదనడంతో ఫారాలను ఇంట్లోనే పెట్టుకున్నాం. 2002లో ఓటు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. 
–వాంకుడోత్‌ దేవోజి, భూక్యారాం తండా, మహబూబాబాద్‌  జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement