మూసీ కోసం పీఎంసీ | Green signal given to set up consultancy to oversee Musi beautification project | Sakshi
Sakshi News home page

మూసీ కోసం పీఎంసీ

Jul 10 2026 1:29 AM | Updated on Jul 10 2026 1:29 AM

Green signal given to set up consultancy to oversee Musi beautification project

ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ 

డిజైన్ల పరిశీలన, నాణ్యత, భద్రత, క్రమబద్ధమైన తనిఖీ దీని బాధ్యత 

ఈపీసీ విధానంలో అభివృద్ధి పనులకు సర్కారు నిర్ణయం 

త్రివేణి సంగమానికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవంపై కీలక ముందడుగు పడింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ)ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మూసీ అభివృద్ధి డిజైన్ల పరిశీలన నుంచి నిర్మాణ పనుల్లో నాణ్యత, భద్రత, నిర్దిష్ట సమయపాలన, క్రమబద్ధమైన తనిఖీల వరకూ ఈ పీఎంసీదే బాధ్యత. 

అలాగే మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి పనులను ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీకి రూ.4,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈపీసీకి సంబంధించిన చర్యలు చేపట్టాలని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీఎల్‌)ను ఆదేశించింది. 

రూ.7,345 కోట్లకు పరిపాలనా అనుమతులు
మూసీ సుందరీకరణ తొలిదశలో మొత్తం 21 కిలోమీటర్లను అత్యంత ప్రాధాన్యత అంశంగా ఎంఆర్‌డీసీఎల్‌ అధికారులు తీసుకున్నారు. జోన్‌–1ఏ కింద హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 9.20 కి.మీ, జోన్‌–1బీ కింద ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11.80 కి.మీ. అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఈ తొలిదశ మూసీ పునరుజ్జీవానికి భూ సేకరణ మినహా రూ.7,345.12 కోట్లకు ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ఏడీబీ రుణం మినహా మిగతా రూ.2,845.12 కోట్లను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ నుంచి రుణం రూపంలో సమీకరించనున్నారు. 

పనుల పురోగతిపై సీఎస్‌ సమీక్ష 
మూసీ, ఈసా నదుల మధ్య ఉన్న ప్రాంతం నుంచి గాంధీ సరోవర్‌ వరకూ ఉన్న ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయాలని ప్రభు త్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేప థ్యంలో ఆయా ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యాలు, నదీ తీరంతో కూడిన స్థిరమైన పట్ట ణాభివృద్ధి కోసం ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూ పొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఎంఆర్‌డీసీఎల్, హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. 

మూసీ ఫేజ్‌–1 పరిధి లోని కీలక ప్రాంతాలను గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఉస్మాన్‌సాగర్, నార్సింగి ఎస్టీపీ సైట్, గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ భూములను పరిశీలించారు. మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ధి ప్రా జెక్టు దీర్ఘకాలిక మనుగడ, పర్యావరణ సమతుల్యత, హైదరాబాద్‌ నగర రూపురేఖలను మా ర్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దేందుకు ఆయన పలు వ్యూహాత్మక సూచనలు చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జాయింట్‌ ఎండీ పి.గౌతమి, జలమండలి ఎండీ కె.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement