వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధనలకు ప్రాముఖ్యత
ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి:కేంద్ర మంత్రి జేపీ నడ్డా
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ ఎయిమ్స్ రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ, మార్గదర్శక వైద్య సంస్థగా ఎదుగుతుందని కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్‌లో అందుతున్న వైద్యం, పరిశోధనలు, భవన నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో నడ్డా మాట్లాడారు. ఎయిమ్స్ కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధనల విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా నిలుస్తుందన్నారు.
1956లో ప్రారంభమైన ఢిల్లీ ఎయిమ్స్‌కు పూర్తి గుర్తింపు రావడానికి దాదాపు 20 ఏళ్లకు పైగా సమయం పట్టిందని, కానీ, బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి తాము కేవలం 10 ఏళ్ల సమయం మాత్రమే అడుగుతున్నాం అని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పాతభవనాల పునరుద్ధరణతోపాటు రేడియోగ్రఫీ, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్ కేవలం నాలుగేళ్ల స్వల్పకాలంలో ఎంతో వృద్ధి సాధించిందని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే మోదీ ప్రభుత్వంలో ఎయిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటు గణనీయంగా పెరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ విజయ్ నేత్రా, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


