మెట్‌పల్లి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద వేలాది మంది యువత దరఖాస్తు చేసుకుంది. అర్హులైన వారికి గతేడాది జూన్ 2 నుంచి దశల వారీగా రుణాలు అందించాలని ఆ సమయంలో నిర్ణయించింది. కానీ ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్కరికీ రుణం మంజూరు చేయలేదు. ప్రభుత్వం కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితం కావడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
జిల్లాలో వేలాది మంది దరఖాస్తు..
● జిల్లాలో 20మండలాలతోపాటు ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల నుంచి ఇరవై వేలకు పైగానే యువత దరఖాస్తు చేసుకున్నారు.
● పథకం కింద ఎంపికై న వారికి రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
● రూ.50 వేల యూనిట్‌కు పూర్తి రాయితీ, రూ.లక్ష లోపు రుణానికి 80శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 70శాతం రాయితీ, రూ.4లక్షలకు 60శాతం రాయితీ ఇచ్చేలా పథకాన్ని రూపకల్పన చేసింది.
● మొదటి విడత కింద రుణాలు అందించడం కోసం అధికారులు దరఖాస్తులను పరిశీలించి కొందరిని ఎంపిక చేశారు.
నిరాశలో దరఖాస్తుదారులు..
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి దశల వారీగా రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మొదటగా రూ.లక్షకు సంబంధించిన యూనిట్లను గత జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం.. చివరి క్షణంలో వాయిదా వేసింది.
అప్పటి నుంచి ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు.
రుణాలు మంజూరు చేస్తే వాటితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవనం సాగించాలని నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది.
ప్రభుత్వం రుణాల మంజూరుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
‘మెట్‌పల్లి పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ది నిరుపేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసిన అతడు స్వయం ఉపాధి పొందడానికి రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణంకోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని విధాలుగా అర్హుడైన అతడికి ఏడాది గడిచినా ప్రభుత్వం రుణం మంజూరు చేయలేదు. అధికారుల వద్దకు వెళ్లి అడిగితే.. వారు తమకు తెలియదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక్క శ్రీనివాసే కాదు.. జిల్లాలోని వేలాది మంది నిరుపేదలు రుణం కోసం దరఖాస్తు చేసుకొని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


