వరదకాలువ చెరువులకు చేరేదెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

వరదకాలువ చెరువులకు చేరేదెప్పుడో..?

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

వర్షాలు లేక ఆశగా చూస్తున్న అన్నదాతలు భారీగా పడిపోయిన భూగర్భజలాలు సాగుకు సిద్ధమవుతున్న రైతులు

కథలాపూర్‌: తలాపునే గోదావరి జలాలు వెళ్తున్నా.. వాటిని పంటలకు మళ్లించలేని దుస్థితి నెలకొంది మండల రైతుల పరిస్థితి. కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌తో ఎస్సారెస్పీ వరదకాలువ జలకళ సంతరించుకుంది. అయితే కాలువకు తూములు ఏర్పాటు చేయడంతో దిగువనున్న పలు గ్రామాల్లోని చెరువులకు నీళ్లు చేరుతున్నాయి. కానీ.. కాలువకు ఎగువనున్న గ్రామాల చెరువులకు మాత్రం చుక్కనీరు చేరని పరిస్థితి. వరదకాలువకు ఎగువనున్న గ్రామాల చెరువులకు నీళ్లు ఎప్పుడు వస్తాయోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మండలంలో వరదకాలువ ప్రవహించే గ్రామాలివే

మండలంలో 19 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 84 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఎస్సారెస్పీ వరదకాలువ పెగ్గెర్ల, కథలాపూర్‌, దుంపేట, దూలూర్‌, తక్కళ్లపెల్లి గ్రామాల మీదుగా వెళ్తుంది. వరదకాలువ నుంచి ఆయా గ్రామాల చెరువులను నింపేందుకు తూములు ఏర్పాటు చేశారు. వరదకాలువ ఎగువున ఉన్న గ్రామాల చెరువులకు మాత్రం నీరు చేరే పరిస్థితి లేదు. ఎత్తిపోతల ద్వారా నీరందిస్తామని అధికారులు సర్వే చేసి ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులకు మోక్షం కలగడంలేదు. వానకాలం సీజన్‌ ప్రారంభమైనా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఎత్తిపోతల పనులు చేపట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఎత్తిపోతలు పూర్తయితే వరదకాలువ నీటితోనైనా పంటలు గట్టెక్కించుకునేవారమని రైతులు అంటున్నారు.

ఎత్తిపోతలతో ప్రయోజనం ఇలా..

మండలంలోని చింతకుంటలోని లక్కాకుల చెరువు, భూషణరావుపేటలోని తుమ్మల చెరువు, బొమ్మెనలోని తుమ్మల చెరువు, బొమ్మెన ప్రాజెక్టు, తాండ్య్రాల ఊర చెరువు, గంభీర్‌పూర్‌ తాళ్లచెరువు, కలిగోట సూరమ్మ చెరువులను ఎత్తిపోతలతో నింపితే అన్ని గ్రామాలకు సాగు నీరంది భూగర్భజలాలు పెరుగుతాయని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎగువనున్న గ్రామాల చెరువులను నింపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ వరదకాలువ విభాగం ఏఈ పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ... వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులు నింపే పనులకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement