జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించిన సహకార సంఘాలు యాసంగి సీజన్‌లో రూ.921 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. ఒకప్పుడు రైతులకు రుణాలు ఇవ్వడం.. వసూళ్లకే పరిమితమైన సహకార సంఘాలు ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ కమీషన్ రూపంలో మంచి ఆదాయం ఆర్జిస్తున్నాయి. యాసంగిలో సేకరించిన ధాన్యానికి గాను సంఘాలకు రూ.12.16కోట్ల కమీషన్ రానుంది.
302 కేంద్రాలు
సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో 302 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,389 చొప్పున కొనుగోలు చేసి మిల్లులకు పంపించారు. సహకార అధికారుల పర్యవేక్షణలో సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు పర్యవేక్షించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. యాసంగిలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దొడ్డురకం ధాన్యం మంచి దిగుబడి వచ్చింది. సంఘాలు 71,934 మంది రైతుల నుంచి రూ.921 కోట్ల విలువైన 38.83లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా మెట్‌పల్లి మండలంలో 3.29 లక్షల క్వింటాళ్లు, అత్యల్పంగా బుగ్గారంలో 1.25 లక్షల క్వింటాళ్లు కొన్నారు.
కమీషన్‌తో సంఘాల వ్యాపార అభివృద్ధి
ధాన్యం కొనుగోలు చేసినందుకు సివిల్ సప్‌లై సంస్థ క్వింటాల్‌కు రూ.32 కమీషన్ ఇస్తుంది. ఇలా సహకార సంఘం పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఆ మేరకు కమీషన్ వస్తుంది. కొనుగోలు సీజన్ పూర్తికాగానే కమీషన్ అందించాల్సిన సివిల్ సప్‌లై సంస్థ తాత్సారం చేస్తున్నాయి. ప్రతి సంఘానికి ఒకట్రెండు ఏళ్ల కమీషన్ పెండింగ్‌లో ఉంది. మరోవైపు సహకార సంఘాలు కమీషన్ డబ్బులతో మరిన్ని వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తున్న సంఘాలు.. కొన్నిచోట్ల పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామాల్లో సూపర్ మార్కెట్లు పెట్టే ఆలోచన చేస్తున్నాయి.
సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. కొన్ని సంఘాలు ఆ సంఘాల పరిధిలో కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఐకేపీకి పోటీగా ధాన్యం కొంటున్నాయి. కమీషన్ రూపంలో వచ్చిన డబ్బులను సంఘ సభ్యులు చర్చించి, సంఘం ద్వారా మరిన్ని వ్యాపారాలు చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
– సీహెచ్.మనోజ్‌కుమార్, డీసీవో


