breaking news
saradh pawar
-
మహారాష్ట్ర పాలిటిక్స్‌లో హైడ్రామా.. రంగంలోకి సుప్రియా సూలే!
ముంబై: మహారాష్ట్ర ప్రతిపక్ష‘మహా వికాస్ అఘాడీ’కూటమిలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని చల్లార్చేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలోని డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కార్యాలయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయనతో సమావేశం కావడం, అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో అక్కడే భేటీ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామంపై మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కూటమిలో ముసలం పుట్టిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే, ఈ మొత్తం వ్యవహారంపై శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రీయా సూలే స్పందించారు. ఇదంతా కేవలం ‘టీకప్పులో తుఫాను’ లాంటిదని కొట్టిపారేశారు.ఈ వివాదంపై శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సుప్రీయా సూలే, అది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన స్వల్పకాలిక భేటీ మాత్రమేనని, దానికి అంతకంటే ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.తమ పార్టీలోని కొందరు నాయకులు ఎన్డీఏ వైపు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారాన్ని ఆమె పూర్తిగా తోసిపుచ్చారు. తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలతో తాను నిరంతరం టచ్‌లోనే ఉన్నానని, తమ శ్రేణులన్నీ పూర్తి ఐక్యతతో ఉన్నాయని వివరించారు. శివసేన (యూబీటీ) నేతలతో నెలకొన్న అసంతృప్తిపై స్పందిస్తూ.. తాము చర్చలు జరుపుతున్నామని, అదంతా ఒక చిన్న అవగాహనా లోపం వల్ల జరిగిందన్నారు. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఆమె పేర్కొన్నారు.అయితే అంతకుముందు శివసేన (యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ ఈ భేటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షిండేను ఒక ‘ద్రోహి’గా అభివర్ణించిన ఆయన, అటువంటి వ్యక్తితో శరద్ పవార్ భేటీ కావడం అఘాడీ కూటమి నమ్మకత్వాన్ని దెబ్బతీస్తుందని, ఈ చర్యతో మిత్రపక్షాలన్నీ నొచ్చుకున్నాయని ఆరోపించారు. కూటమి శ్రేణుల భావోద్వేగాలను ప్రతిబింబించడానికే తాను ఆ వ్యాఖ్యలు చేశానని రౌత్ పేర్కొంటూ, కూటమి నేతలకు షిండే ఎప్పటికీ అంటరాని వ్యక్తిగానే మిగిలిపోవాలని హితవు పలికారు.మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి హాజరైన శరద్ పవార్, ఆ తర్వాతే షిండే కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందని ఎన్సీపీ వర్గాలు సమర్థించుకున్నాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సైతం ఈ వివాదంపై స్పందించారు. శరద్ పవార్ వర్గానికి చెందిన ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు ఏ క్షణంలోనైనా వైఖరి మార్చుకునే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ వ్యాఖ్యలను ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జయంత్ పాటిల్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ ఎంపీలు కానీ, పది మంది ఎమ్మెల్యేలు కానీ ఎక్కడికీ వెళ్లడం లేదని అందరూ సమైక్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తోటి మిత్రపక్షాలపై ఇటువంటి ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే వర్గంలోకి మారిన నేపథ్యంలో, ఈ తాజా పరిణామాలు మహా వికాస్ అఘాడీ కూటమిలో అంతర్గత ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. -
'మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి వారంతా ఏకంకావాలి'
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) వ్యతిరేక కూటమికి కాంగ్రెస్ ఇరుసు కావాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన జాతీయ పార్టీగా సహజంగానే కాంగ్రెస్ ప్రత్యామ్నాయ కూటమికి మూలస్తంభం కావాలన్నారు. తేజస్వి ఆదివారం పీటీఐతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 200 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు నేరుగా బీజేపీతోనే పోటీ నెలకొందని, హస్తం పార్టీ వాటిపై దృష్టి కేంద్రీకరించి... మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఢిల్లీ నివాసంలో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల, వివిధ రంగాల ప్రముఖుల భేటీ గురించి అడగ్గా... అక్కడేం చర్చించారో తనకు తెలియదని తేజస్వి బదులిచ్చారు. నియంతృత్వ పోకడలతో విభజన రాజకీయాలు, అణిచివేతకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపిచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లడం తప్పనిసరని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో తేజస్వి కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
ఆసక్తి రేపుతున్న పవార్, ప్రశాంత్ కిశోర్ భేటి.. అందుకేనా?
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. దీంతో రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ధీటుగా ఎదుర్కొనేందుకు దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. కాగా జూన్ 11న ముంబైలోని శరద్ పవార్ ఇంటిలో వారి సమావేశం తరువాత నేడు ఢిల్లీలో మళ్లీ కలుసుకున్నారు. నేడు జరిగిన భేటీతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. నివేదికల ప్రకారం.. రాజకీయ వ్యూహకర్తను కలిసిన తరువాత, 15 పార్టీలతో కూడిన విపక్ష ప్రతినిధులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశానికి హాజరు కావాలని పవార్ ఆహ్వానించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చడేమే గాక ఆసక్తి కూడా రేపుతోంది. ‘ఇది సాధారణ సమావేశంగా కలిసామని, రాజకీయాలతో సంబంధం లేదని’ కిషోర్ అన్నారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రారంభించిన రాజకీయ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ సమావేశం శరద్ పవార్ నివాసంలో జరుగునుంది. ఈ సమావేశనికి ఎన్సీపీకి చెందిన మజీద్ మీనన్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ ఇతర నాయకులు పాల్గొననున్నారు. ఇక తాజా భేటీలో ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్, పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ హాజరు కాలేదు. పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే దిశగా చర్చలు సాగినట్టు సమాచారం. #NewsAlert | Prashant Kishor meets NCP chief Sharad Pawar in Delhi. Kishor says, 'it's just a routine meeting'. This is the second meeting between the duo in 2 months. Prashant Kumar with analysis. pic.twitter.com/FIJB6E4RS8 — TIMES NOW (@TimesNow) June 21, 2021 చదవండి: బీజేపీతో కలిసిపోదాం.. సీఎంకు శివసేన ఎమ్మెల్యే లేఖ -
‘టీ’కి మహా అండ
తెలంగాణ బిల్లు ఆమోదంలో షిండే, పవార్ల కీలకపాత్ర హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక తెలంగాణవాదులు తెలంగాణ పోరులో వలసబిడ్డల మరవలేని కృషి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కావడానికి మహారాష్ట్ర ఉద్ధండులు చేయూతనిచ్చారు. ఉభయసభల్లో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసవచ్చి రాష్ట్రంలో స్థిరపడిన తెలంగాణవాదులు వీరి మద్దతుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఈ నాయకులకు అండగా ఉంటామని ప్రకటించారు. సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో మహారాష్ట్ర నాయకులు కీలకపాత్ర పోషించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలంగాణవారి 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేయడంలో తమదైన పాత్ర పోషించారు. తమిళనాడుకు చెందిన పి.చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించినా అంత వేగంగా బిల్లు ముందుకు కదలలేదు. రాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన అనుభవమున్న షిండే, తెలంగాణ వెనుకబాటుతనంపై కొంత అవగాహన ఉండటం కూడా ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై షిండే తీసుకున్న చొరవపై రాష్ట్రంలో స్థిరపడిన తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో అనేక మంది షిండే మద్దతుదారులుగా కూడా ఉన్నారు. మరోవైపు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కూడా తెలంగాణకు మద్దతు పలికారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో తమదైన పాత్ర పోషించారు. తెలంగాణ పోరులో వలసబిడ్డలు... ప్రత్యేక తె లంగాణ పోరాటంలో ముంబైలోని అనేక మంది తెలంగాణ ప్రజలు కూడా క్రియాశీలకపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల క్రితమే ఉద్యమాలు జరిగినా, 13 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పుట్టాకే ఇవి మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజలు తమదైన శైలిలో నిరసనకు దిగారు. వీళ్ల బాటలోనే ముంబైలోని తెలంగాణ వలసబిడ్డలు నడిచారు. పలు కార్యక్రమాలు... 2007 జనవరిలో గోరేగావ్‌లో జరిగిన తెలంగాణ ధూమ్‌ధామ్ కార్యక్రమం అనంతరం ముంబైలోని తెలంగాణవాదుల్లో చైతన్యం వచ్చింది. ఉద్యమంలో ముందుకు దూసుకెళ్లారు. 2008 సంవత్సరంలో అనేక మంది తెలంగాణవాదులు సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు. వేర్వేరు సంఘాల పేర్లతో ప్రత్యేక తెలంగాణ కోసం కృషిచేసిన వీరు ఒక బ్యానర్ కింద ఉద్యమం చేపట్టాలని భావించారు. ముంబైలో ‘తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక’, ‘ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’లను స్థాపించుకున్నారు. ఈ రెండు సంస్థలు వాటి వాటి అనుబంధ సంస్థలు, ఇతర సంఘాలు, కార్మిక యూనియన్ల ద్వారా తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలన్నింటిపై దృష్టిసారించి ప్రతి అంశాన్ని ఇక్కడి తెలంగాణ ప్రజలకు తెలిపి ఆందోళనలో పాల్గొనేలా చైతన్యవంతం చేశాయి. వలసబిడ్డలైన వీరు పలుమార్లు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఆందోళనలలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఇప్పటివరకు ముంైబె లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో 2007లో గోరేగావ్, బాంద్రాలో జరిగిన ధూంధాం కార్యక్రమాలున్నాయి. ఆజాద్‌మైదాన్‌లో కూడా నిరాహారదీక్షలు చేశారు. 2013లో ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా జీవోఎంతో భేటీ అయ్యారు . 2013 నవంబర్‌లో గోరేగావ్‌లో జరిగిన తెలంగాణ సాధన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉంటున్న తెలంగాణవాదులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో సంస్థ సభ్యులులు సఫలీకృతమయ్యారు. ఢిల్లీలోని నాయకులు, ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రులతోపాటు మహారాష్ట్రలోని మంత్రులు, నాయకులతో భేటీ అయి తెలంగాణకు మద్దతివ్వాలని వినతిపత్రాలను కూడా సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తూనే, ప్రత్యేక తెలంగాణలో వలస బిడ్డలకు ప్రాధాన్యం లభించాలని కూడా పోరాడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వలసబిడ్డల భవిష్యత్‌పై చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ముంబైలో తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకపాత్ర పోషించినవారు అనేక మంది ఉన్నారు. వీరిలో అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలనివాస మాల, ముంబై టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్ది హేమంత్‌కుమార్, తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక కన్వీనర్లు శేఖర్ గ్యారా, అక్కినపెల్లి దుర్గేష్, రమేష్ గొండ్యాల, పొట్ట వెంకటేష్‌లతోపాటు ముంబై టీజేఏసీ పదాధికారులు కాసుల నర్సింహగౌడ్, గంగాధర్ గంగపుత్ర, నాగెల్ల దేవేందర్, ద్రవిడ్ మాదిగ, భోగ సుదర్శన్ పద్మశాలి తదితరులు ఉన్నారు. చిగురించిన కొత్త ఆశలు... తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌తోపాటు రాజ్యసభలో ఆమోదం లభించడంతో ముంబైలోని వలసబిడ్డలలో కొత్త ఆశలు చిగురించాయి. అందరూ సంబరాలు జరుపుకున్నారు. ముంబైలో నివసించే తెలంగాణ ప్రజలలో అనేక మంది పొట్టచేత పట్టుకుని వలస వచ్చిన కూలీలు, అసంఘటిత కార్మికులున్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర అవతరణతో మంచిరోజులు వచ్చినట్టేనని భావిస్తున్నారు. ముంబైలోని వలసబిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా క్రియశీలపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వలసజీవులకు చేయూతనిచ్చేలా తెలంగాణ నాయకులు చొరవ తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, ఇప్పటికే ఎన్నో వ్యయాప్రయాసలకు గురవుతున్నామని అంటున్నారు.


