ఇప్ప కాశీరాం (ఫైల్)
భర్తను హత్య చేసిన భార్య
రోకలిబండతో కొట్టి చంపిన వైనం
నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు
కరీంనగర్, కోరుట్ల: భర్త ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తనతోపాటు, పిల్లలను వేధిస్తున్నాడని భావించిన భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అల్లమయ్య గుట్ట ప్రాంతంలో నివసించే ఇప్ప కాశీరాం, రజినీ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం.
కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు కలిసి మద్యం తాగారు. భార్య తనముందే మద్యం తాగిందని మనసులో పెట్టుకున్న కాశీరాం అప్పటినుంచి అతిగా మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేని రజినీ 20రోజుల క్రితం భర్తపై ఎదురుతిరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి గొడవ సద్దుమణిగించారు. అప్పటినుంచి ప్రతిరోజూ గొడవ పడుతూనే ఉన్నారు. బుధవారం కుటుంబసభ్యులందరూ కలిసి వనభోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత రజినీ తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని తన తల్లిగారింటికి పంపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీరాం(35)ను రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం అయ్యప్ప గుట్ట సమీపంలో ఉండే తల్లిగారింటికి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలైన రజినీని గురువారం అరెస్టు చేశారు. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి కటకటాల్లోకి వెళ్లటంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. కాశీరాం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్‌పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు ఆధ్వర్యంలో రజినీని రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు.


