మెటా కలలు కల్లలైన వేళ | Meta AI Dreams Stumble 8000 Layoffs Fail to Deliver Progress | Sakshi
Sakshi News home page

మెటా కలలు కల్లలైన వేళ

Jul 3 2026 12:09 PM | Updated on Jul 3 2026 12:17 PM

Meta AI Dreams Stumble 8000 Layoffs Fail to Deliver Progress

కృత్రిమ మేధ సాంకేతికతలో అగ్రగామిగా నిలవాలని భావించిన సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, అంతర్గత పునర్నిర్మాణం తర్వాత కూడా తాము ఆశించిన స్థాయిలో ఏఐ ఏజెంట్ల అభివృద్ధి సాగడం లేదని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగంగానే అంగీకరించారు. సంస్థలో జరిగిన భారీ మార్పులు ఆశించినంత సాఫీగా సాగలేదని, ఏఐ ఏజెంట్ల అభివృద్ధి పథం గత నాలుగు నెలలుగా నెమ్మదించిందని ఆయన అంతర్గత సంభాషణల్లో పేర్కొనడం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశంగా మారింది.

ఏఐ కోసం భారీ కోతలు.. అయినా తప్పని నిరాశ

కంపెనీని పూర్తిగా ఏఐ కేంద్రీకృత సంస్థగా మార్చాలనే పట్టుదలతో మెటా ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం (సుమారు 8,000 మంది) ఉద్యోగులపై వేటు వేసింది. అలాగే గతంలో భర్తీ చేయాలనుకున్న 6,000 ఖాళీలను రద్దు చేసింది. మరోవైపు, సుమారు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ బృందాల్లోకి మార్చింది. ఇంతటి భారీ మార్పులు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ‘కనీసం నాలుగు నెలలుగా ఏజెంటిక్ డెవలప్‌మెంట్‌ మేము ఊహించిన విధంగా వేగవంతం కాలేదు’ అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. వినియోగదారుల తరఫున స్వయంగా పనులు చేయగల అధునాతన సాధనాలనే ఏఐ ఏజెంట్లు అంటారు. వీటి అభివృద్ధి మందగించడం మెటా వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది.

అసంతృప్తిలో ఉద్యోగులు

ఏఐ మౌలిక సదుపాయాల కోసం మెటా ఈ ఏడాది ఏకంగా 145 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేయాలని అంచనా వేసింది. మరెక్కడా లేని విధంగా నిధులను ఏఐ వైపు మళ్లిస్తున్నప్పటికీ అంతర్గత పునర్నిర్మాణం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ ఏడాది మార్చిలో అప్లైడ్ ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతర విభాగాల నుంచి 6,500 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను ఇందులోకి మార్చారు. అయితే, ఈ ఆకస్మిక మార్పులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement