– ఉదయ్ చౌహాన్
‘‘పళ్ళ బురుసు’ సినిమాలో మంచి వినోదం ఉంది. అలాగే మనసును హత్తుకునే సందేశం కూడా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ ఊర్లోకి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుంది. మంచి సినిమా చూశామనే అనుభూతితో థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వస్తారు’’ అని డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెలిపారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్ళ బురుసు’.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది మహబూబ్‌నగర్ జిల్లా. మా అమ్మానాన్న ప్రభుత్వోద్యోగులు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో డాక్టర్ చదవమని చెప్పారు. కానీ సినిమాలపై ప్యాషన్‌తో డైరెక్షన్‌వైపు వచ్చాను. నిర్మాత సుప్రియగారికి ‘పళ్ళ బురుసు’ కథ నచ్చడంతో ఈ ప్రయాణం ఆరంభమైంది.
ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపిస్తారు. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో ‘పళ్ళ బురుసు’ సినిమా తీశాను. నా నిర్మాతలు హ్యాపీగా ఉండటమే నా మొదటి సక్సెస్‌గా భావిస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ చాలా టాలెంటెడ్. మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. సినిమాటోగ్రాఫర్ వినోద్, నేను మంచి ఫ్రెండ్స్. తను చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చాడు. నాగార్జునగారు ‘పళ్ళ బురుసు’ చూసి మనసుని హత్తుకునేలా ఉందన్నారు. డైలాగ్స్ బాగున్నాయని, నిడివి ఎక్కువైనా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయిందని మెచ్చుకున్నారు. నాగచైతన్యగారికి కూడా ఈ కథ చెప్పాను... ఆయనకు కూడా చాలా నచ్చింది. నా కొత్త సినిమాల కోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి. ‘పళ్ళ బురుసు’ రిలీజ్ తర్వాత వాటిపై పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.


