జ్యోతిర్మయం
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.
అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.
గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమై
నాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు


