కంచంలో ఉన్నది అమృతమేనా? | H-FAST And Special Food Safety Task Force Inspections Guest Column Story | Sakshi
Sakshi News home page

కంచంలో ఉన్నది అమృతమేనా?

Jul 7 2026 11:17 AM | Updated on Jul 7 2026 11:30 AM

H-FAST And Special Food Safety Task Force Inspections Guest Column Story

ప్రపంచ ఆరోగ్య సంస్థ

‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్‌ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది ‘స్లో పాయిజన్‌’. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదయ్యాయి. 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం రికార్డుల్లోకెక్కిన లెక్క మాత్రమే!

అవే లెక్కల ప్రకారం, మన దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం అంటురోగాలు కానివాటివల్లే కలుగుతున్నాయి. అందులో 27 శాతం మంది గుండె జబ్బుల వల్లే కన్నుమూస్తున్నారు. క్యాన్సర్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐసీఎమ్‌ఆర్‌ అంచనా ప్రకారం ఒక్క 2022లోనే భారత్‌లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందట! మరోవైపు, దాదాపు 13.8 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో మగ్గి పోతున్నారు.

ఎందుకిలా జరుగుతోంది? కూర గాయల నుంచి పండ్ల దాకా కొడుతున్న రసాయనాలు... హోటళ్లలో వాడిన నూనెనే పదే పదే వాడటం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌లో ఉండే విషపూరిత ప్రిజర్వేటివ్స్, అల్లం పేస్ట్‌ నుంచి కారం వరకు అన్నింటిలో జరుగుతున్న కల్తీ– ఇవన్నీ మనిషిని బతకనిస్తాయా? అందుకే అభివృద్ధిచెందిన దేశాలు ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

మన తెలంగాణ విషయానికి వస్తే... గతంలో జరిగిన తప్పులను సరిదిద్దు కుంటూ... ‘కల్తీ లేని తెలంగాణ’ లక్ష్యంగా 2024 జనవరి నుండి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే హెచ్‌ఫాస్ట్, ప్రత్యేక ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించి కఠిన చర్యలు తీసుకుంటోంది.

2024 నుండి 5,500కి పైగా ముమ్మర తనిఖీలు చేసి, నాణ్యత లేని 2,000కి పైగా సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 150కి పైగా హోటళ్లు, తయారీ కేంద్రాలను సీజ్‌ చేయడమే కాకుండా, రూ. 2 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. 100కి పైగా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కంచంలో పడే అన్నం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. మన కంచంలోని ఆహారం సురక్షితం కాకపోతే... అభివృద్ధి కథనాలన్నీ చివరకు ఆసుపత్రి కారిడార్లలో ముగిసి పోతాయి. – నవీన్‌ కుమార్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement