breaking news
Musical instrument
-
తరతరాల కళా నిబద్ధత
ఐదు దశాబ్దాలుగా ‘కడ్డి తంత్రి’ అనే అపురూప జానపద సంగీత కళారూపాన్ని సంరక్షిస్తున్న దురిశెట్టి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ జానపద కళా ప్రపంచానికే గర్వకారణం. పెద్దపల్లి జిల్లా (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఆయన అరుదైన కళాసాధకుడు. ఎస్సీ మాల సామాజిక వర్గంలోని ‘మిత్తుల అయ్య వార్లు’ లేదా ‘నిత్యులు’ అనే ఉపకులానికి చెందిన రామయ్య, చిన్నతనంలోనే తన తండ్రి రామానుజం వద్ద ఈ కడ్డి తంత్రి కళను అభ్యసించారు. రామానుజం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం విశేషం.కడ్డి తంత్రి వాయిద్యం తెలంగాణలోని అత్యంత ప్రాచీన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటి. అడ విలో లభించే టేకు చెట్టు మొద్దును లోపల ఖాళీగా తొలిచి ఈ వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. రామయ్య వద్ద ఉన్న వాయిద్యానికి దాదాపు ఆరు నుంచి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. కశ్మీర్‌కు చెందిన సంతూర్, పాశ్చాత్య దేశాల డల్పీమర్, సింబలోన్ వంటి వాటిలో అనేక తంత్రులు (తీగలు) ఉంటాయి. కానీ, కడ్డి తంత్రి లేదా కడ్డి వీణలో కేవలం మూడు లేదా నాలుగు తంత్రులే ఉంటాయి. వీటితోనే 32 స్వరాలను పలికించడం గమనార్హం. చిన్న వెదురు బద్ద చివర కొన్ని గజ్జెలు కట్టి వాటితో తీగలను కొడతారు. బద్దతో వాయించినప్పుడు వచ్చే రాగతాళాలకు అనుగుణంగా గజ్జెల శబ్దం మేళవించి శ్రోతలకు వీనులవిందు కలిగిస్తుంది.ఈ వాయిద్యం కథాగానం, పురాణ ప్రవచనాలకు మాధ్యమంగా రూపుదిద్దుకుంది. రామయ్య తన బృందంతో కలిసి భాగవతం, భారతం వంటి ఇతిహాస గాథలను విని పిస్తారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, కీచక వధ, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, రామదాసు చరిత్ర, విరాట పర్వం, సుందరకాండ వంటి ఘట్టాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కడ్డి తంత్రి వాయిద్యంతో నిర్వహించే సాధారణ ప్రదర్శనల్లో ఆరు గురు కళాకారులు పాల్గొంటారు. అదే వేషధారణతో కూడిన నాటక రూప ప్రదర్శనలైతే 12 మంది కళాకారులు భాగస్వాములవుతారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ప్రద ర్శనలు తెల్లవారుజాము వరకు సాగుతుంటాయి. ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాల కోర్చి ‘కడ్డి తంత్రి’ కళను కాపాడుకుంటూ వస్తున్న దురిశెట్టి రామయ్య జీవితం... జానపద వారసత్వ పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత ప్రస్థానం!– జంపాల ప్రవీణ్, ఔత్సాహిక పరిశోధకుడు -
సింథసైజర్ వాయిస్తుండగా బ్రెయిన్ సర్జరీ
భోపాల్: ఇంజక్షన్ పేరు చెబితే చాలు చిన్నారులతో సహా పెద్దలు కూడా కొందరు భయపడతారు. అలాంటిది సర్జరీ అంటే.. ఇక ఎంత భయం, ఆందోళన ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధైర్యవంతుల్లో కూడా చిన్నపాటి ఆందోళన సహజం. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి మాత్రం బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా.. ఏ మాత్రం భయపడలేదు సరి కదా.. ఏకంగా సింథసైజర్(ఎలక్ట్రానిక్ సంగీత పరికరం) వాయిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. గ్వాలియార్కు చెందిన సౌమ్య అనే తొమ్మిదేళ్ల చిన్నారికి తలలో కణితి ఏర్పడింది. తల్లిదంద్రులు చిన్నారిని గ్వాలియర్ బీఐఎంఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే సాధారణంగా ఆపరేషన్‌కు ముందు మత్తు మందు ఇస్తారు. కానీ సౌమ్య విషయంలో ఇలా మత్తు మందు ఇచ్చి సర్జరీ చేయడం ప్రమాదం అని.. దాని వల్ల మెదడులోని ఇతర నరాలు దెబ్బతింటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, ఆమె శస్త్రచికిత్సను 'అవేక్ క్రానియోటమీ'(రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేయడం) పద్ధతిలో చేయాలని వైద్యులు నిర్ణయించారు. (చదవండి: బిగ్‌బాస్ షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్) ఈ క్రమంలో చిన్నారి దృష్టి మరల్చడం కోసం వైద్యులు వినూత్న ఆలోచన చేశారు. సౌమ్యకు సర్జరీ చేస్తుండగా సింథసైజర్ ఇవ్వాలని... పాప దానితో ఆడుకుంటూ.. శస్త్ర చికిత్స విషయం మర్చిపోతుందని భావించారు. ఇక సర్జరీ చేసే భాగం వరకు మాత్రమే మత్తు మందు ఇచ్చారు. అనంతరం వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి సౌమ్య తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత సౌమ్యను ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా ఉందని వెల్లడించారు వైద్యులు. -
చెట్టు నీడ
పాత సూఫీ కథ ఇది. ‘ఓషో’ రజనీశ్ తన శిష్యులకు తరచూ చెబుతుండేవారు. నేడు ఆయన వర్ధంతి. కథేమిటంటే.. ఒక ఇంట్లో ఒక సంగీత సాధనం ఉండేది. పూర్వీకుల నుండి అది ఆ ఇంట్లో ఉంటోంది. తరాలు మారుతున్నాయి కానీ అది మారడం లేదు. అలాగని ఏ తరమూ దానిని సాధన చేయడం లేదు! అసలు దానిని ఎలా పలికించాలో కూడా ఎవరికీ తెలీదు. పడేయడానికి మనసొప్పక ఓ మూలన పడేసి ఉంచుతున్నారు. అలా ఏళ్లుగా దానిపై దుమ్ము పేరుకుపోయింది. మళ్లీ ఓ కొత్త తరం వచ్చింది. దమ్ము దులుపుతుంటే ఆ సంగీత సాధనం బయటపడింది. ‘ఎవరికీ పనికిరానిది ఇంట్లో ఎందుకు?’ అని బయటికి విసిరిపారేసింది కొత్తతరం. ఆ సాయంత్రం.. పక్షులు ఇళ్లకు చేరే సమయంలో ఆ కొత్తతరం ఉంటున్న వీధిలో శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ఇళ్లలోని వారంతా బయటికి వచ్చి ఆసక్తిగా చూశారు. ఒక యాచకుని చేతిలోని సంగీత వాద్యం అది. అతడి వేళ్లు ఒడుపుగా రాగాలను పలికిస్తున్నాయి! కొత్తతరం కూడా ఇంటి బయటికి వచ్చి చూసింది. యాచకుని చేతిలోని వాద్యాన్నీ చూసింది. ‘‘ఓయ్.. అది మాది, తరతరాలుగా మా ఇంట్లో ఉంటోంది. మాది మాకు ఇచ్చేయ్’’ అని అడిగింది. అందులో అంత మధురమైన రాగాలు ఉంటాయని ఆ కొత్త తరం ఊహించలేదు.యాచకుడు ఇవ్వలేదు! ‘‘తరాలుగా మీ ఇంట్లో ఉన్నా మీరు దీనిని పలికించలేదు కనుక ఇది మీది కాదు. నేను పలికిస్తున్నాను కాబట్టి ఇప్పుడిది నాది’’ అని, వాద్యంలోంచి లయబద్ధంగా గీతాలను ఒలికించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. జీవితం కూడా అంతే.. సాధన చేసినంతకాలం మనది. జీవన గమకాలు పలికించినంతకాలం మనది. ఊరికే జీవితాన్ని చేత్తో పట్టుకునో, గూట్లో పెట్టుకునో కాలాన్ని గడిపేస్తుంటే ఆ జీవితం మనదవదు. జీవితంలో కదలిక లేదని, దుమ్ముపట్టిపోయిందనీ మనలో చాలామందిమి నిస్పృహలో పడిపోతుంటాం. నిజానికి అది మన జీవితానికి పట్టిన దుమ్ము కాదు. మన వేళ్లకు పట్టిన దుమ్ము. ఆ దమ్మును వదిలించుకుని జీవితాన్ని పలికించుకోవాలి. – మాధవ్ శింగరాజు -
కళాత్మకం.. సబ్బండనాదం
♦ వివిధ వస్తువులతో సంగీత పరికరం రూపకల్పన ♦ జనచైతన్య కళా సంస్థ ప్రతినిధుల ఘనత జిన్నారం: కళాకారులు వినూత్నంగా ఆలోచించారు. నిత్యం వినియోగంలో ఉండే వివిధ రకాల వస్తువులను ఉపయోగించి ఓ సంగీత పరికరాన్ని రూపొందించారు. దీనికి ‘సబ్బండనాదం’గా నామకరణం చేశారు. డీజే సౌండ్ సిస్టం వంటి పరికరాలను పక్కనపెట్టి వీటితో కూడా సంగీతాన్ని అందించవచ్చని ఈ కళాకారులు నిరూపించారు. మెదక్ జిల్లా జిన్నారం మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన జన చైతన్య కళా సంస్థ కళాకారులు నిత్యం వాడుకలో ఉండే డప్పు, గడ్డపార, ఇనుప గంప, తాపీ, పారా, బిందె, కంజెరలను ఉపయోగించి సంగీత పరికరాన్ని తయారు చేశారు. ఆదివారం ఈ పరికరాన్ని బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సురభి నాగేందర్‌గౌడ్ ఆవిష్కరించారు. ప్రస్తుత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో నిత్యం రాత్రి సమయంలో ఈ సంగీత పరికరంతోనే వివిధ రకాల నృత్య ప్రదర్శనలు చేయిస్తామని జనచైతన్య కళా సంస్థ డెరైక్టర్ ఎల్లయ్య తెలిపారు.


