కాంగ్రెస్‌ వస్తే.. బీజేపీ నేతలు సెక్యూరిటీతో తిరగాలి | Pawan Khera Remarks Triggers Controversy, Says BJP Leaders Need Security If Congress Returns To Power | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వస్తే.. బీజేపీ నేతలు సెక్యూరిటీతో తిరగాలి

Jun 26 2026 9:01 AM | Updated on Jun 26 2026 9:53 AM

Pawan Khera Says BJP Leaders Need Security if Congress Returns to Power

న్యూఢిల్లీ: సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పవన్‌ ఖేరా చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్రంలో అధికార మార్పు జరిగితే.. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. గత 12-15 ఏళ్ల పరిణామాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొంటూ.. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నాయకులు ప్రజల్లోకి భద్రత లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా, ఇటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.

గురువారం కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌ ఖేరా.. గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అధికార దుర్వినియోగం, దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్షాలపై రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు భద్రత లేకుండా రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.

పవన్‌ ఖేరా చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్‌ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం పవన్‌ ఖేరా వ్యాఖ్యలను వేరే కోణంలో చూడాలని అంటున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వివరిస్తున్నాయి.

అయితే పవన్‌ ఖేరా వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాటిని రాజకీయ వ్యాఖ్యలుగానే అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement