Pawan Khera
-
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్న అస్సాం పోలీసులకు భంగపాటు కలిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ (Article 21)ను తేలికగా ప్రమాదంలో పడేయరాదని ముందస్తు బెయిల్ తీర్పు సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ అరెస్ట్ గనుక జరిగితే కచ్చితంగా ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయాలని అస్సాం పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో.. విచారణలో సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పవన్ ఖేరాకు కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ బెయిల్లో అవసరమైతే అదనపు షరతులు కూడా విధించవచ్చని ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాదనలు ఇలా.. 👉ఖేరా తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ వాదించారు. ‘‘ఇది పరువు నష్టం కేసు మాత్రమే. కస్టడీ విచారణ అవసరం లేదు. అరెస్ట్ అవమానకరం. అలాగే ఈ కేసు అనూహ్యమైంది. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.👉అస్సాం పోలీసుల తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ‘‘పవన్ ఖేరా మీడియా సమావేశంలో చూపించిన పాస్‌పోర్ట్ పత్రాలు నకిలీ, కల్పితమైనవి. వాటిలో ఉన్న సర్కారీ ముద్రలు, QR కోడ్లు, అధికారిక గుర్తులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి విచారణ అవసరం. అందుకు కస్టడీ తప్పనిసరి. ఈ పత్రాల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు. 👉కోర్టు తీర్పు.. కస్టడీ అవసరం లేదు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నాం. విచారణకు ఖేరా పోలీసులకు సహకరించాలిముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రింకీ భూయాన్ శర్మపై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఆమెకు 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని పలు పత్రాలకు మీడియాకు ప్రదర్శించారాయన. అయితే.. ఈ వ్యవహారంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పరువు నష్టం దావాకు వెళ్లడంతో గువాహతి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలంగాణ హైకోర్టులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ అత్యవసర పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు వారంపాటు మధ్యంతర ఊరట ఇస్తూ.. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే.. అస్సాం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గువాహతి హైకోర్టు(అస్సాం)లో పిటిషన్ వేయాలని ఖేరాకు సూచించింది. దీంతో ఆయన స్టే తొలగించాలంటూ మరోసారి పిటిషన్ వేయగా.. మరోసారి చుక్కెదురైంది. ఈ తరుణంలో.. పవన్ ఖేరా అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోందన్న ప్రచారం ఉధృతంగా సాగింది. ఈలోపు ఆయన గువాహతి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో కచ్చితంగా అరెస్ట్ అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు మరోసారి చుక్కెదురైంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గువాహతి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. గురువారం ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ కేసు నేపథ్యం ఏప్రిల్ 5న గువాహటిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించినది. ఆ సమయంలో పవన్ ఖేరా.. అసోం సీఎం భార్య రింకీ భుయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీలలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు మీడియాకు ప్రదర్శించారు. అయితే..ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రింకీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అసోం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఆయన ప్రదర్శించింది ఫేక్ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ ఫోర్జరీ అభియోగాలు కూడా చేర్చారు. ఈ కేసు అసోం పోలీసులు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు జరిపారు.అయితే ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్ నుంచి(సనత్ నగర్) పోటీ చేసిందని.. తనకు ఆధార్ కూడా ఇక్కడే ఉందని.. కాబట్టి ఈ కేసు విచారణే ఇక్కడే జరగాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఈలోపు..అసోం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ముందస్తు బెయిల్ కోసం గువాహతి హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది. అయితే కోర్టుకు సెలవులు ఉన్నాయని.. తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. గువాహతి కోర్టునే ఆశ్రయించమని చెప్పింది. తాజాగా.. ఇవాళ(ఏప్రిల్ 24న) గువాహతి హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరిణామంతో పవన్ ఖేరా అరెస్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మాత్రం.. “అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని.. ఎక్కడున్నా వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవాలని” అంటున్నారు. -
పవన్ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్ తప్పదా?
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ బెయిల్‌పై స్టే విధించగా.. దానిని తొలగించాలని వేసిన మరో పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని ఆరోపించారాయన. ఈ నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గువాహటిలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ వ్యవహారంపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అస్సాం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఖేరా భార్య హైదరాబాద్ నగరంలో పోటీ చేశారని.. ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయని.. కాబట్టి పిటిషన్ ఈ కోర్టులోనే విచారణకు అర్హత ఉందని పవన్ ఖేరా తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. వారంపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది(ఏప్రిల్ 10న) హైకోర్టు. ఈలోపు సంబంధిత కోర్టుకు బెయిల్‌కు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన ఆధార్, ఇతర పత్రాలు కూడా తప్పుడువేనని వాదించారు. దీంతో అక్కడ పవన్ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది(ఏప్రిల్ 15న). అదే సమయంలో..గువాహటి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే.. అస్సాంలో న్యాయస్థానాలకు సెలవులు ఉన్నాయని.. తన ట్రాన్సిట్ యాంటీసిపేటరీ బెయిల్‌పై స్టే ఎత్తివేయాలని.. ఆ స్టేను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును అభ్యర్థిస్తూ మరో పిటిషన్ వేశారు. అయితే సుప్రీం కోర్టు ఇవాళ(ఏప్రిల్ 17) ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఇవాళ శుక్రవారం. సోమవారం పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్నా? లేక ఉగ్రవాదినా? అని పవన్ ఖేరా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని.. అస్సాం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని.. కాబట్టి ఆలస్యం చేయకుండా పిటిషన్ వేసుకోవాలని.. అవసరమైతే అత్యవసర పిటిషన్‌కు వెళ్లమని ఖేరాకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈలోపు ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు పవన్ ఖేరాను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.లొంగిపోతే మంచిదిసుప్రీం కోర్టు ఆదేశాలపై అస్సాం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోలీసులు స్పందించడం కంటే ముందే.. ఎక్కడున్న పవన్ ఖేరా గువాహటికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం మంచిదని సూచించారు. -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


