పవన్‌ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్‌ తప్పదా? | Another Court Setback For Congress Pawan Khera | Sakshi
Sakshi News home page

పవన్‌ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్‌ తప్పదా?

Apr 17 2026 2:00 PM | Updated on Apr 17 2026 2:22 PM

Another Court Setback For Congress Pawan Khera

కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ బెయిల్‌పై స్టే విధించగా.. దానిని తొలగించాలని వేసిన మరో పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. 

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్‌ శర్మపై  ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్‌ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని ఆరోపించారాయన. ఈ నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గువాహటిలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే.. 

ఈ వ్యవహారంపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అస్సాం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఖేరా భార్య హైదరాబాద్‌ నగరంలో పోటీ చేశారని.. ఇక్కడ ఆధార్‌ కార్డులు ఉన్నాయని.. కాబట్టి పిటిషన్‌ ఈ కోర్టులోనే విచారణకు అర్హత ఉందని పవన్‌ ఖేరా తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. వారంపాటు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది(ఏప్రిల్‌ 10న) హైకోర్టు. ఈలోపు సంబంధిత కోర్టుకు బెయిల్‌కు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. 

అయితే.. ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. పవన్‌ ఖేరా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన ఆధార్‌, ఇతర పత్రాలు కూడా తప్పుడువేనని వాదించారు. దీంతో అక్కడ పవన్‌ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది(ఏప్రిల్‌ 15న). అదే సమయంలో..

గువాహటి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే.. అస్సాంలో న్యాయస్థానాలకు సెలవులు ఉన్నాయని.. తన ట్రాన్సిట్‌ యాంటీసిపేటరీ బెయిల్‌పై స్టే ఎత్తివేయాలని.. ఆ స్టేను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును అభ్యర్థిస్తూ మరో పిటిషన్‌ వేశారు. అయితే సుప్రీం కోర్టు ఇవాళ(ఏప్రిల్‌ 17) ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. 

ఇవాళ శుక్రవారం. సోమవారం పిటిషన్‌ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్‌నా? లేక ఉగ్రవాదినా? అని పవన్‌ ఖేరా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని.. అస్సాం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని.. కాబట్టి ఆలస్యం చేయకుండా పిటిషన్‌ వేసుకోవాలని.. అవసరమైతే అత్యవసర పిటిషన్‌కు వెళ్లమని ఖేరాకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈలోపు ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు పవన్‌ ఖేరాను అరెస్ట్‌ చేసే అవకాశం లేకపోలేదు.

లొంగిపోతే మంచిది
సుప్రీం కోర్టు ఆదేశాలపై అస్సాం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోలీసులు స్పందించడం కంటే ముందే.. ఎక్కడున్న పవన్‌ ఖేరా గువాహటికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం మంచిదని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement