సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్న అస్సాం పోలీసులకు భంగపాటు కలిగింది.
వ్యక్తిగత స్వేచ్ఛ (Article 21)ను తేలికగా ప్రమాదంలో పడేయరాదని ముందస్తు బెయిల్ తీర్పు సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ అరెస్ట్ గనుక జరిగితే కచ్చితంగా ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయాలని అస్సాం పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో.. విచారణలో సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పవన్ ఖేరాకు కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ బెయిల్‌లో అవసరమైతే అదనపు షరతులు కూడా విధించవచ్చని ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
వాదనలు ఇలా..
👉ఖేరా తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ వాదించారు. ‘‘ఇది పరువు నష్టం కేసు మాత్రమే. కస్టడీ విచారణ అవసరం లేదు. అరెస్ట్ అవమానకరం. అలాగే ఈ కేసు అనూహ్యమైంది. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
👉అస్సాం పోలీసుల తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ‘‘పవన్ ఖేరా మీడియా సమావేశంలో చూపించిన పాస్‌పోర్ట్ పత్రాలు నకిలీ, కల్పితమైనవి. వాటిలో ఉన్న సర్కారీ ముద్రలు, QR కోడ్లు, అధికారిక గుర్తులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి విచారణ అవసరం. అందుకు కస్టడీ తప్పనిసరి. ఈ పత్రాల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు.
👉కోర్టు తీర్పు.. కస్టడీ అవసరం లేదు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నాం. విచారణకు ఖేరా పోలీసులకు సహకరించాలి
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రింకీ భూయాన్ శర్మపై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఆమెకు 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించకుండా దాచి పెట్టారని పలు పత్రాలకు మీడియాకు ప్రదర్శించారాయన. అయితే..
ఈ వ్యవహారంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పరువు నష్టం దావాకు వెళ్లడంతో గువాహతి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలంగాణ హైకోర్టులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ అత్యవసర పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు వారంపాటు మధ్యంతర ఊరట ఇస్తూ.. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే..
అస్సాం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గువాహతి హైకోర్టు(అస్సాం)లో పిటిషన్ వేయాలని ఖేరాకు సూచించింది. దీంతో ఆయన స్టే తొలగించాలంటూ మరోసారి పిటిషన్ వేయగా.. మరోసారి చుక్కెదురైంది. ఈ తరుణంలో..
పవన్ ఖేరా అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోందన్న ప్రచారం ఉధృతంగా సాగింది. ఈలోపు ఆయన గువాహతి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో కచ్చితంగా అరెస్ట్ అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.


