సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు మరోసారి చుక్కెదురైంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గువాహతి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. గురువారం ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కేసు నేపథ్యం ఏప్రిల్ 5న గువాహటిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించినది. ఆ సమయంలో పవన్ ఖేరా.. అసోం సీఎం భార్య రింకీ భుయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీలలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు మీడియాకు ప్రదర్శించారు. అయితే..
ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రింకీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అసోం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఆయన ప్రదర్శించింది ఫేక్ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ ఫోర్జరీ అభియోగాలు కూడా చేర్చారు. ఈ కేసు అసోం పోలీసులు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు జరిపారు.
అయితే ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్ నుంచి(సనత్ నగర్) పోటీ చేసిందని.. తనకు ఆధార్ కూడా ఇక్కడే ఉందని.. కాబట్టి ఈ కేసు విచారణే ఇక్కడే జరగాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఈలోపు..
అసోం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ముందస్తు బెయిల్ కోసం గువాహతి హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది. అయితే కోర్టుకు సెలవులు ఉన్నాయని.. తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. గువాహతి కోర్టునే ఆశ్రయించమని చెప్పింది.
తాజాగా.. ఇవాళ(ఏప్రిల్ 24న) గువాహతి హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరిణామంతో పవన్ ఖేరా అరెస్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మాత్రం.. “అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని.. ఎక్కడున్నా వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవాలని” అంటున్నారు.


