75 ఏళ్ల వయసు.. 32 డిగ్రీలు.. ఇప్పుడు మరో పరీక్ష | 75 Year Old With 32 Degrees Takes Another Exam, His Lifelong Learning Story Will Inspire You | Sakshi
Sakshi News home page

75 ఏళ్ల వయసు.. 32 డిగ్రీలు.. ఇప్పుడు మరో పరీక్ష

Jul 7 2026 10:15 PM | Updated on Jul 8 2026 1:23 PM

  75 year old with 32 degrees sits for another exam in Himachal

"నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు" అని అంటున్నారు 32 డిగ్రీలు సాధించిన 75 ఏళ్ల మిల్ఖీ రామ్. మరో డిగ్రీ సాధించేందుకు ఆయన ఇటీవల మరో పరీక్ష రాశారు. హిమాచల్‌లోని కాంగ్రా జిల్లాలో గందర్ ప్రాంతానికి చెందిన రామ్, జూన్ 30న హమీర్‌పూర్‌లోని ఇగ్నూ అధ్యయన కేంద్రంలో సంస్కృత పరీక్ష రాశారు. చాలామంది 60 ఏళ్ల వయసుదాటగానే విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. మిల్ఖీ రామ్ మాత్రం 75 ఏళ్ల వయసులో పరీక్షా హాలులో కనిపించడం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.

ఇగ్నూలో సంస్కృతంలో ఎంఏ కోర్సుకు 'ఆచార్య' డిగ్రీతో సమాన గుర్తింపు ఉంది. ఆ కేంద్రంలో పరీక్ష రాసిన వారిలో రామ్ అత్యంత వయోవృద్ధుడు. 1952 ఫిబ్రవరి 10న జన్మించిన రామ్, 1972లో అటవీ శాఖలో ఉద్యోగంలో చేరిన తర్వాత 1976లో ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు పెరిగినా చదువును ఎప్పుడూ వదల్లేదు. 2010లో గ్రేడ్-1 హోదా నుంచి పదవీ విరమణ చేసే సమయానికి ఆయన 26 డిగ్రీలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 32కు చేరింది.

ఆయన సాధించిన విద్యార్హతల్లో బీఎడ్, ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం (జేఎంసీ), బీఏ (సంస్కృతం), ఎంఏ (హిందీ, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర, ఇంగ్లిష్, ఆర్థిక శాస్త్రం), ఎంబీఏ, ఎంఫిల్, హిందీలో పీహెచ్‌డీ ఉన్నాయి. "యువత చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి. జ్ఞానం ఎవరూ తీసుకోలేని ఆస్తి. సమాజం, వ్యక్తి అభివృద్ధికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనం" అని మంగళవారం రామ్ అన్నారు.

తన సుదీర్ఘ విద్యా ప్రయాణంలో భార్య విద్యా దేవి తనకు అండగా నిలిచారని ఆయన చెప్పారు. విద్యా దేవి కూడా అటవీ శాఖలో గ్రేడ్-1 అధికారిగా పదవీ విరమణ చేశారు. వారి కుమారుడు రాకేశ్ కుమార్, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్‌లో అధికారి.

"నా భార్య, కుమారుడు, కోడలు ఇచ్చిన సహకారం నన్ను ఎప్పుడూ ముందుకు నడిపించింది" అని ఆయన చెప్పారు. చదువు, పరీక్షల సన్నాహాల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇటీవల కంటి చికిత్స కూడా చేయించుకున్నానని తెలిపారు.

రామ్ 'ఆచార్య' పరీక్ష రాసిన హమీర్‌పూర్ అధ్యయన కేంద్రం ఇన్‌చార్జి ప్రొఫెసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేర్చుకోవాలనే ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదలే విజయానికి కారణమని ఆయన జీవితం చెబుతోందన్నారు.

"చిన్న చిన్న ఇబ్బందులకే చాలామంది యువత చదువు మానేస్తున్న ఈ సమయంలో, రామ్ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ విద్య పట్ల అంకితభావానికి సజీవ నిదర్శనంగా ఉన్నారు" అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement