breaking news
IGNOU
-
75 ఏళ్ల వయసు.. 32 డిగ్రీలు.. ఇప్పుడు మరో పరీక్ష
"నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు" అని అంటున్నారు 32 డిగ్రీలు సాధించిన 75 ఏళ్ల మిల్ఖీ రామ్. మరో డిగ్రీ సాధించేందుకు ఆయన ఇటీవల మరో పరీక్ష రాశారు. హిమాచల్‌లోని కాంగ్రా జిల్లాలో గందర్ ప్రాంతానికి చెందిన రామ్, జూన్ 30న హమీర్‌పూర్‌లోని ఇగ్నూ అధ్యయన కేంద్రంలో సంస్కృత పరీక్ష రాశారు. చాలామంది 60 ఏళ్ల వయసుదాటగానే విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. మిల్ఖీ రామ్ మాత్రం 75 ఏళ్ల వయసులో పరీక్షా హాలులో కనిపించడం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.ఇగ్నూలో సంస్కృతంలో ఎంఏ కోర్సుకు 'ఆచార్య' డిగ్రీతో సమాన గుర్తింపు ఉంది. ఆ కేంద్రంలో పరీక్ష రాసిన వారిలో రామ్ అత్యంత వయోవృద్ధుడు. 1952 ఫిబ్రవరి 10న జన్మించిన రామ్, 1972లో అటవీ శాఖలో ఉద్యోగంలో చేరిన తర్వాత 1976లో ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు పెరిగినా చదువును ఎప్పుడూ వదల్లేదు. 2010లో గ్రేడ్-1 హోదా నుంచి పదవీ విరమణ చేసే సమయానికి ఆయన 26 డిగ్రీలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 32కు చేరింది.ఆయన సాధించిన విద్యార్హతల్లో బీఎడ్, ఎల్ఎల్బీ, జర్నలిజం (జేఎంసీ), బీఏ (సంస్కృతం), ఎంఏ (హిందీ, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర, ఇంగ్లిష్, ఆర్థిక శాస్త్రం), ఎంబీఏ, ఎంఫిల్, హిందీలో పీహెచ్డీ ఉన్నాయి. "యువత చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి. జ్ఞానం ఎవరూ తీసుకోలేని ఆస్తి. సమాజం, వ్యక్తి అభివృద్ధికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనం" అని మంగళవారం రామ్ అన్నారు.తన సుదీర్ఘ విద్యా ప్రయాణంలో భార్య విద్యా దేవి తనకు అండగా నిలిచారని ఆయన చెప్పారు. విద్యా దేవి కూడా అటవీ శాఖలో గ్రేడ్-1 అధికారిగా పదవీ విరమణ చేశారు. వారి కుమారుడు రాకేశ్ కుమార్, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్‌లో అధికారి."నా భార్య, కుమారుడు, కోడలు ఇచ్చిన సహకారం నన్ను ఎప్పుడూ ముందుకు నడిపించింది" అని ఆయన చెప్పారు. చదువు, పరీక్షల సన్నాహాల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇటీవల కంటి చికిత్స కూడా చేయించుకున్నానని తెలిపారు.రామ్ 'ఆచార్య' పరీక్ష రాసిన హమీర్పూర్ అధ్యయన కేంద్రం ఇన్చార్జి ప్రొఫెసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేర్చుకోవాలనే ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదలే విజయానికి కారణమని ఆయన జీవితం చెబుతోందన్నారు."చిన్న చిన్న ఇబ్బందులకే చాలామంది యువత చదువు మానేస్తున్న ఈ సమయంలో, రామ్ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ విద్య పట్ల అంకితభావానికి సజీవ నిదర్శనంగా ఉన్నారు" అని ఆయన అన్నారు. -
సకలజన సార్వత్రిక విద్య
సాక్షి, అమరావతి: వయోలింగ భేదాల్లేకుండా దేశంలో అవసరమైనవారి విద్య, విజ్ఞానదాహం తీరుస్తోంది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు, రెగ్యులర్‌గా కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోలేని లక్షలాది మందికి దూరవిద్య, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా డిగ్రీలను ప్రదానం చేస్తోంది. ఏటికేడాది ఈ విశ్వవిద్యాలయంలో చేరికలు పెరుగుతున్నాయి. 21 స్కూల్ ఆఫ్ స్టడీస్ ద్వారా 67 రీజనల్ సెంటర్లు, 2,257 లెర్నింగ్ సపోర్టు కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా దూరవిద్య, ఆన్లైన్లో డిప్లొమా, యూజీ, పీజీ డిగ్రీలు ఇగ్నో అందిస్తోంది. 333 అకడమిక్ ప్రోగ్రామ్స్ అందిస్తున్న ఇగ్నో అనేకమంది ఉద్యోగాలు సాధించడంలోను, ఉద్యోగుల కెరీర్ వృద్ధిలోను కీలకపాత్ర పోషిస్తోంది. ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించే దివ్యాంగులకు విద్యను చేరువ చేయడమే కాకుండా.. వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ‘జైల్ ఇన్‌మేట్స్’ (ఖైదీలు)ను సైతం విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి వర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. 2022–23లో 7,13,510 మంది వివిధ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరితో కలిపి ఆ విద్యాసంవత్సరంలో ఇగ్నోలో 13 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. 2022–23లో నమోదైనవారిలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. మొత్తం చేరికల్లో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. దివ్యాంగులు 4,227 మంది, ఖైదీలు 11,089 మంది చేరారు. కెరీర్ వృద్ధికి సోపానం ఇగ్నో సగటు విద్యార్థులకు దూరవిద్యలో బోధన అందించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కెరీర్లో ఎదగాలనుకునేవారికి సైతం చేయూతనిస్తోంది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇగ్నోలో ఇతర డిగ్రీలు అభ్యసిస్తున్నవారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 2015–16లో 98,071 మంది ఉద్యోగులు నమోదు చేసుకుంటే.. 2019–20లో 2.28 లక్షల మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. తరువాత సంవత్సరం ఈ సంఖ్య 1.30 లక్షలకు తగ్గినా.. 2022–23లో 1.44 లక్షలకు పెరిగింది. సంప్రదాయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే ఇగ్నో సైతం తమ సంస్థలో డిగ్రీలు పొందినవారికి ప్లేస్‌మెంట్స్ కల్పించడానికి చర్యలు చేపడుతోంది. 2022–23లో ఎనిమిది ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించింది. 2021–22లో 21 శాతం ఉన్న ప్లేస్‌మెంట్స్ రేటు 2022–23లో 30 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఎస్బీఐ లైఫ్, గ్లోబివా, ఇన్సూరెన్స్ థేఖో డాట్‌కామ్ వంటి పలు సంస్థల్లో వీరు ఉద్యోగాలు పొందారు. కావాల్సినంత ప్రోత్సాహం విశ్వవిద్యాలయం కెరీర్ అవగాహన సెషన్లు నిర్వహించడం ద్వారా పరిశ్రమ నిపుణుల కెరీర్ ప్లానింగ్, నైపుణ్య అవసరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులకు చేయూత ఇస్తోంది. సీవీ తయారీ, జాబ్ పోర్టల్ వినియోగం, ఇంటర్వ్యూలకు తర్ఫీదు ఇస్తోంది. ఇగ్నో పోర్టల్‌లో 59 వేల కంటే ఎక్కువమంది పూర్వవిద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీని ఆధారంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి వివిధ రంగాల్లో విజయం సాధించిన వారితో ప్రేరణ కార్యక్రమాలు అందిస్తోంది. 2022–23లో ఇటువంటి 13 సమ్మేళనాలను నిర్వహించింది. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు ఆయా రంగాల్లో మరింత ఎదిగేందుకు కూడా ఈ విశ్వవిద్యాలయం తోడ్పాటు ఇస్తోంది. -
IGNOU: అత్యున్నత ఓపెన్ వర్సిటీ
ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన ‘ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ’ (ఇగ్నో) సమాజంలోని వెనుకబడిన వర్గాలకు దూర విద్య ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తోంది. భారతదేశంలో సార్వత్రిక దూర విద్యను ప్రోత్సహించటం, సమ న్వయం చేయడం, మంచి ప్రమాణాలను నెల కొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారత దేశ మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన – పరిశోధనలతో పాటు... విస్తరణ, శిక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఇగ్నో పని చేస్తోంది. భారత మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరు మీద ఆమె జన్మదినం నవంబర్ 19న 1985లో నెలకొల్పిన ఈ యూనివర్సిటీ... ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సేవలు అంది స్తోంది. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్థులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో ప్రవేశాలు పొందినవారే. 226కు పైగా అకాడెమిక్ ప్రోగ్రాంలు, మరికొన్ని ఆన్ లైన్ ప్రోగ్రాములే కాకుండా ‘స్వయం’ మూక్స్ ద్వారా కూడా విద్యను అందిస్తోంది ఇగ్నో. భారత దేశ దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి ఇగ్నో మొదటి ఉపకులపతిగా సేవలు అందిచటం మన తెలుగువారికి గర్వకారణం. మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీలకు (ఎంపిక చేసిన) సంబంధిచిన ట్యూషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇస్తూ... మామూలు రెగ్యులర్ విద్యా లయాల్లో చేరి చదువుకోలేని లక్షలాదిమంది బడుగు, బలహీన, పేద విద్యార్థులకు ఇగ్నో ఉదారంగా విద్యనందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధిని కలిపించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్ ప్రోగ్రాములను అభ్యసించిన ఇగ్నో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు పొందు తున్నారు. ఢిల్లీలోని మెయిన్ క్యాంపస్‌లోనే కాక... వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్ క్యాంపస్సుల్లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి, అనేక కంపెనీలు ఇగ్నో విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ విధంగా రెగ్యులర్ యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోకుండా... కొన్నిసార్లు వాటికన్నా మిన్నగా విద్యా, ఉపాధి అవకాశాలను అందిస్తోంది ఇగ్నో. మార్చి 2022 లో వెబ్మెట్రిక్ ప్రమాణాల ర్యాంకింగ్‌లో ఇగ్నో 247వ స్థానంలో నిలిచి తన సత్తా చాటడం ముదావహం. (క్లిక్ చేయండి: ‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?) - డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల అకడమిక్ కౌన్సిలర్, ఇగ్నో (నవంబర్ 19న ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావ దినం) -
ఇగ్నోలో కోర్సులకు ఫీరియింబర్స్‌మెంట్
సాక్షి, హైదరాబాద్ : ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) 2018 విద్యాసంవత్సరానికి దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజును రీయింబర్స్ చేయనున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రొగ్రాంలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీరీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 31. అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం ఫీజును ముందుగా చెల్లించాలనీ, ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తరువాత వారి ఫీజును తిరిగి చెల్లిస్తామని ఇగ్నో అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్నుంచి అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుతో పాటు కులధ్రువీకరణ పత్రాలను జత చేసి పంపాలి. మిగతా వివరాలకు www.ignou.ac.in ను సంప్రదించవచ్చు. -
రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ టెలివిజన్ నిర్మాత, రీసెర్చ్ స్కాలర్ రవి అయ్యగారిని వరించింది. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ డీ.పీ సింగ్ చేతుల మీదుగా రవికి ఈ అవార్డును బహూకరించారు. అన్లైన్లోనే బోధించడం, నేర్చుకోవడం అనే అంశంపై సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)లో వినూత్న అప్లికేషన్ని డెవలప్ చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో నామినేటెడ్ సభ్యుడు గా రవి కొనసాగుతున్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో విజన్ 2020 ప్రాజెక్టులో కలిసి పని చేశారు. -
ఇగ్నో నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న ఖైదీ
న్యూఢిల్లీ: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అన్న చందంగా పదేళ్ల జైలు శిక్ష పడిన ఓ ఖైదీ.. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి బంగారు పతకం సాధించాడు. వారణాసి సెంట్రల్ జైల్లో 2012 ఫిబ్రవరి నుంచి శిక్ష అనుభవిస్తున్న అజిత్ కుమార్ సరోజ్ (23) అనే ఖైదీ ఇగ్నో నిర్వహించిన పర్యాటక విద్యా డిప్లొమాలో ప్రథమస్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో అజిత్‌కు పసిడి పతకాన్ని బహూకరించారు. ఇదే కాకుండా అజిత్ శిక్షాకాలంలో మానవ హక్కులు, విపత్తు నిర్వహణ, ఎన్జీవో మేనేజ్మెంట్, ఫుడ్, న్యూట్రిషన్ తదితర కోర్సులు పూర్తి చేశాడు. వీటిలో దాదాపు 65 శాతం పైన మార్కులు తెచ్చుకున్నాడని అధ్యాపకులు అభినందించారు. ఇగ్నోకు సంబంధించి వారణాసి రీజియన్‌లో ఉన్న 20 జిల్లాల్లోని ఆరువేల మంది విద్యార్థుల్లో అజిత్‌కు మాత్రమే గోల్డ్ మెడల్ దక్కడం విశేషమని ప్రశంసించారు. -
ఇగ్నోలో ఇక ఆన్లైన్ అడ్మిషన్లు
న్యూఢిల్లీ: విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ఆన్లైన్ అడ్మిషన్ వ్యవస్థ(ఓఏఎస్)ను ప్రారంభించింది. ఈ ఆన్లైన్ వ్యవస్థను గురువారం ఇగ్నో తాత్కాలిక ఉప కులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇగ్నోలో వివిధ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవస్థ ద్వారా ఇక ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇగ్నోలోని 148 కోర్సులకు జూలై 2015 అడ్మిషన్ సెషన్లో ప్రవేశాలకు ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. ఇగ్నో వెబ్సైట్ (www.ignou.ac.in) ద్వారా ఆన్లైన్ ప్రవేశాలు పొందవచ్చని, పీజీ కోర్సులకు జూన్ 15 ఆఖరు తేదీ అని, ఆలస్య రుసుముతో జూన్ 30 వరకూ గడువుందని తెలిపారు.


