
దూరవిద్యలో దూసుకెళ్తున్న ఇగ్నో
2022–23లో ఈ వర్సిటీ విద్యార్థుల సంఖ్య 13 లక్షలకుపైనే
333 ప్రోగ్సామ్స్ ద్వారా డిప్లొమా, యూజీ, పీజీ డిగ్రీలు
గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ రిజిస్ట్రేషన్లు
మొత్తం చేరికల్లో దాదాపు సగం మంది మహిళలే
చదువుకుంటున్న 11,089 మంది జైల్ ఇన్‌మేట్స్
ఇగ్నో డిగ్రీలతో ఉద్యోగాల్లో ఎదుగుదల
ప్లేస్‌మెంట్ డ్రైవ్స్, పూర్వవిద్యార్థుల సమ్మేళనాలతో కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: వయోలింగ భేదాల్లేకుండా దేశంలో అవసరమైనవారి విద్య, విజ్ఞానదాహం తీరుస్తోంది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు, రెగ్యులర్‌గా కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోలేని లక్షలాది మందికి దూరవిద్య, ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా డిగ్రీలను ప్రదానం చేస్తోంది. ఏటికేడాది ఈ విశ్వవిద్యాలయంలో చేరికలు పెరుగుతున్నాయి. 21 స్కూల్ ఆఫ్ స్టడీస్ ద్వారా 67 రీజనల్ సెంటర్లు, 2,257 లెర్నింగ్ సపోర్టు కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా దూరవిద్య, ఆన్‌లైన్‌లో డిప్లొమా, యూజీ, పీజీ డిగ్రీలు ఇగ్నో అందిస్తోంది.
333 అకడమిక్ ప్రోగ్రామ్స్ అందిస్తున్న ఇగ్నో అనేకమంది ఉద్యోగాలు సాధించడంలోను, ఉద్యోగుల కెరీర్ వృద్ధిలోను కీలకపాత్ర పోషిస్తోంది. ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించే దివ్యాంగులకు విద్యను చేరువ చేయడమే కాకుండా.. వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ‘జైల్ ఇన్‌మేట్స్’ (ఖైదీలు)ను సైతం విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి వర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి.
2022–23లో 7,13,510 మంది వివిధ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరితో కలిపి ఆ విద్యాసంవత్సరంలో ఇగ్నోలో 13 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. 2022–23లో నమోదైనవారిలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. మొత్తం చేరికల్లో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. దివ్యాంగులు 4,227 మంది, ఖైదీలు 11,089 మంది చేరారు.
కెరీర్ వృద్ధికి సోపానం
ఇగ్నో సగటు విద్యార్థులకు దూరవిద్యలో బోధన అందించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కెరీర్‌లో ఎదగాలనుకునేవారికి సైతం చేయూతనిస్తోంది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇగ్నోలో ఇతర డిగ్రీలు అభ్యసిస్తున్నవారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 2015–16లో 98,071 మంది ఉద్యోగులు నమోదు చేసుకుంటే.. 2019–20లో 2.28 లక్షల మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. తరువాత సంవత్సరం ఈ సంఖ్య 1.30 లక్షలకు తగ్గినా.. 2022–23లో 1.44 లక్షలకు పెరిగింది.
సంప్రదాయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే ఇగ్నో సైతం తమ సంస్థలో డిగ్రీలు పొందినవారికి ప్లేస్‌మెంట్స్ కల్పించడానికి చర్యలు చేపడుతోంది. 2022–23లో ఎనిమిది ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించింది. 2021–22లో 21 శాతం ఉన్న ప్లేస్‌మెంట్స్ రేటు 2022–23లో 30 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఎస్‌బీఐ లైఫ్, గ్లోబివా, ఇన్సూరెన్స్ థేఖో డాట్‌కామ్ వంటి పలు సంస్థల్లో వీరు ఉద్యోగాలు పొందారు.
కావాల్సినంత ప్రోత్సాహం
విశ్వవిద్యాలయం కెరీర్ అవగాహన సెషన్లు నిర్వహించడం ద్వారా పరిశ్రమ నిపుణుల కెరీర్ ప్లానింగ్, నైపుణ్య అవసరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులకు చేయూత ఇస్తోంది. సీవీ తయారీ, జాబ్ పోర్టల్ వినియోగం, ఇంటర్వ్యూలకు తర్ఫీదు ఇస్తోంది. ఇగ్నో పోర్టల్‌లో 59 వేల కంటే ఎక్కువమంది పూర్వవిద్యార్థులు నమోదు చేసుకున్నారు.
దీని ఆధారంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి వివిధ రంగాల్లో విజయం సాధించిన వారితో ప్రేరణ కార్యక్రమాలు అందిస్తోంది. 2022–23లో ఇటువంటి 13 సమ్మేళనాలను నిర్వహించింది. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు ఆయా రంగాల్లో మరింత ఎదిగేందుకు కూడా ఈ విశ్వవిద్యాలయం తోడ్పాటు ఇస్తోంది.