అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి అమెరికన్ ఆర్థికవేత్త, రచయిత, ప్రొఫెసర్ రాబర్ట్ రీచ్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:
విశ్వగురు
ఈ రోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ప్రతి పట్టభద్రుల సభలో మాట్లాడే వ్యక్తి ఇదే మాట చెబుతారేమో. కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. బర్కిలీ అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం. నేను ఇక్కడ 17 సంవత్సరాలు బోధించే అదృష్టం పొందాను. ఇప్పుడు మీరు చదువు పూర్తయిందని అనుకుంటున్నారు. ఇక విద్యార్థి జీవితం ముగిసిందని భావిస్తున్నారా? ఎందుకంటే... జీవితం అంటే నేర్చుకోవడమే. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాడు. ఒక మంచి విద్యార్థి... ఎప్పుడో ఒక రోజు ఉపాధ్యాయుడవుతాడు. ఈ రెండూ వేర్వేరు పాత్రలు కావు. ఒకే ప్రయాణంలో రెండు దశలు. మనలోని ఆసక్తి, ప్రశ్నించే స్వభావం, మనుషులతో కలిసిమెలసి నేర్చుకోవాలనే తపనే... బోధనకూ, అభ్యాసానికీ మూలం. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న సహ విద్యార్థులను చూడండి. ఈ నాలుగేళ్లలో వాళ్ల దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు కూడా వారికి ఎన్నో విషయాలు నేర్పారు. ఇదే నిజమైన విద్య.
ఎవరు నిజమైన నాయకులు?
నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచానికి మార్గం చూపే గురువులు ఎవరు? నేను కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయుల గురించే మాట్లాడటం లేదు. ప్రపంచం ఏ దిశగా వెళ్లాలి? ప్రజలకు ఏది సరైన మార్గమో ఎవరు చూపిస్తారు? నాయకుడు కావాలంటే... మీ పేరుకు ముందు పెద్ద హోదా ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్యాలయం అవసరం లేదు. ప్రభుత్వంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. చరిత్రను మార్చిన గొప్ప నాయకుల్లో చాలామందికి ఎలాంటి అధికార పదవులు లేవు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, డోలోరెస్ హుయెర్టా, రోసా పార్క్స్, డబ్ల్యూ.ఇ.బి. డు బాయిస్, సుసాన్ బి.ఆంథోనీ... వీళ్లందరూ తమ ఆలోచనలతో, ధైర్యంతో, నైతిక విలువలతో ప్రపంచాన్ని మార్చారు. నిజమైన నాయకుడు ఎవరు? ప్రపంచం ఎటు వెళ్లాలో తెలుసుకునే వ్యక్తి. ఆ దిశగా ఎలా వెళ్లాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. ప్రజల ప్రతిభను, శక్తిని, మంచి ఆలోచనలను ఒకే లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల వ్యక్తి. నాయకత్వం అనేది ఒక పదవి కాదు... అది ఒక నైతిక బాధ్యత!
విద్య అసలు ఉద్దేశం ఏమిటి?
ప్రపంచం ఇప్పుడు ‘మనం ఏం చేయగలం?‘ అనే ప్రశ్నతోనే ఎక్కువగా పరుగులు తీస్తోంది. అద్భుతమైన యంత్రాలను తయారు చేశాం. రోబోలను రూపొందించాం. కృత్రిమ మేధ (ఏఐ) కూడా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది గొప్ప విషయమే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం?’ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడే విద్యకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఇంజినీర్లు ఒకేసారి ఇతర భాషలను అనువదించే హెడ్‌ఫోన్లను రూపొందిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సాంకేతిక పురోగతి. విదేశీ భాష నేర్చుకోవడం అంటే... ఒక దేశానికి వెళ్లి హోటల్‌లో భోజనం ఆర్డర్ చేయడం కోసమే కాదు. ఒక దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, వారి జీవన విధానం ఏమిటి అన్నది అర్థం చేసు కోవడానికే. ఇతరుల దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్పించేదే నిజమైన విద్య. మీతో విభేదించే వ్యక్తులతో మాట్లాడండి.
అదే అత్యుత్తమ అభ్యాసం. మన అభిప్రాయమే ఉన్నవారితో మాట్లాడితే, మనకు తెలిసినదే మళ్లీ వింటాం. భిన్నంగా ఆలోచించే వ్యక్తులతో మాట్లాడితే, కొత్త ఆలోచనలు పుడతాయి. మన అవగాహన విస్తరిస్తుంది. జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ప్రతిభతో సమాజానికి ఏమి చేయగలం? ప్రపంచాన్ని కొంచెమైనా మంచి దిశగా ఎలా తీసుకెళ్లగలం? అన్నదే అసలు ప్రశ్న. జ్ఞానం వ్యక్తిగత విజయానికి మాత్రమే ఉపయోగపడితే అది అసంపూర్ణం. అదే జ్ఞానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే... అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది.
ప్రజాస్వామ్యం ఎందుకు అవసరం?
జీవితం ‘ద విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమా లాంటిది. ఆ సినిమాలో ఒక తుఫాను తర్వాత డోరోతీ కొత్త ప్రపంచంలోకి చేరుతుంది. కిటికీ తెరిచి బయటకు చూస్తే, అన్నీ రంగుల ప్రపంచంలా కనిపి స్తాయి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు, మనం ఊహించని తుఫాన్లు వస్తాయి. మనల్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు కింద పడేస్తాయి. కానీ ఆ కష్టాల తర్వాత కొత్త అవకాశాలు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ అవకాశాలను గుర్తించ గలిగితే, మన జీవితమే మారిపోతుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి కేవలం అభినందనలు చెప్పి వెళ్లిపోతే నా బాధ్యత పూర్తికాదు. ఎందుకంటే, మీరు గొప్ప అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే... ఎన్నో సవాళ్లతో నిండిన ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక మంచి సమాజం అంటే, బలవంతులు బలహీ నులను అణచివేయకుండా కాపాడే సమాజం. అదే నాగరికతకు పునాది. అలా కాకపోతే... అధికారం ఉన్నవారు తమ శక్తిని దుర్విని యోగం చేస్తారు. బలహీనులు మరింత వెనుకబడిపోతారు. చివరికి... అన్యాయం, అశాంతి, ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యం అవసరం.
మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన అది న్యాయం కాదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు చెప్పింది. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్థ అయినా, ఎలాంటి దేశ మైనా... చట్టాలకు, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తే చివరికి అది తనకే నష్టం కలిగిస్తుంది. అందుకే, చట్టాలు బలహీనులను మాత్రమే కాదు... బలవంతులను కూడా కాపాడతాయి. వాటిని గౌరవించడం అందరి బాధ్యత. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరు వ్యతిరేకించినా... సత్యం పక్షాన నిలబడాలి. అదే విద్య యొక్క అసలు లక్ష్యం.
ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలను, ఇప్పుడు ప్రపంచానికి నేర్పే సమయం వచ్చింది. బలహీనుల పక్షాన నిలబడండి. అధి కారంలో ఉన్నవారిని ప్రశ్నించండి. న్యాయం కోసం గొంతెత్తండి. ఇతరులకు మార్గదర్శకులుగా నిలవండి. ఇదే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది... కేవలం తెలివైన మనుషులు కాదు, విలువలతో జీవించే నాయకులు. సత్యం కోసం నిలబడే పౌరులు. ఇతరులను ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఆ నాయకులు, ఆ గురువులు... మీరే!


