కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముగిసిందని.. అసలు ఆట షురూ అయ్యిందని.. ఇకనైనా భారత కంపెనీలు వినోదాన్ని పక్కనపెట్టి వ్యాపార రంగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకటనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
వినోదం నుంచి దృష్టి మళ్లించి భవిష్యత్ సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ కంపెనీలకు ఉదయ్ కొటక్ సూచించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ విస్తరణ కోసం సుమారు 80 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ప్రకటించగా.. ఈ ఏడాది మొత్తం ఏఐపై 180 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఉదయ్ కొటక్ ఓ “వేక్ అప్ కాల్”గా అభివర్ణించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో స్పందించిన ఆయన.. గూగుల్ వంటి సంస్థకు భారీ లాభాలు, భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ భవిష్యత్ టెక్నాలజీల కోసం మరింత పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. గూగుల్ వార్షిక లాభాలు సుమారు 160 బిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత కంపెనీలు తక్షణ లాభాలు, వినోద కేంద్రిత దృష్టి నుంచి బయటకు వచ్చి దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ రంగం కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉడయ్ కొటక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ భారత వ్యాపార రంగం ఇప్పుడు పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం అమెరికాలో పెద్ద స్పోర్ట్స్ లీగ్స్ కొనసాగుతున్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ ఇన్నోవేషన్‌లో వెనుకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. భారతదేశం కూడా వినోదం–వ్యాపారం మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రభావం ఎలాగంటే..
ఈ తరహా భారీ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, చిప్ టెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ లాభాలు ఉన్నప్పటికీ మరింతగా పెట్టుబడులు పెడుతుండటం వల్ల.. కొత్త AI మోడళ్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. అలాగే గ్లోబల్ టెక్ పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. దీని ప్రభావంగా సాఫ్ట్‌వేర్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.కానీ అదే సమయంలో సంప్రదాయ ఐటీ సేవలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచ వ్యాపార రంగంలో ఇక “కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదా పోటీలో వెనుకబడిపోవాలి” అనే పరిస్థితి మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది.


