breaking news
Mahindra Bank
-
ఐపీఎల్ ముగిసింది.. ఇక అసలు ఆట షురూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముగిసిందని.. అసలు ఆట షురూ అయ్యిందని.. ఇకనైనా భారత కంపెనీలు వినోదాన్ని పక్కనపెట్టి వ్యాపార రంగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకటనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వినోదం నుంచి దృష్టి మళ్లించి భవిష్యత్ సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ కంపెనీలకు ఉదయ్ కొటక్ సూచించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ విస్తరణ కోసం సుమారు 80 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ప్రకటించగా.. ఈ ఏడాది మొత్తం ఏఐపై 180 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఉదయ్ కొటక్ ఓ “వేక్ అప్ కాల్”గా అభివర్ణించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో స్పందించిన ఆయన.. గూగుల్ వంటి సంస్థకు భారీ లాభాలు, భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ భవిష్యత్ టెక్నాలజీల కోసం మరింత పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. గూగుల్ వార్షిక లాభాలు సుమారు 160 బిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత కంపెనీలు తక్షణ లాభాలు, వినోద కేంద్రిత దృష్టి నుంచి బయటకు వచ్చి దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ రంగం కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉడయ్ కొటక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ భారత వ్యాపార రంగం ఇప్పుడు పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం అమెరికాలో పెద్ద స్పోర్ట్స్ లీగ్స్ కొనసాగుతున్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ ఇన్నోవేషన్‌లో వెనుకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. భారతదేశం కూడా వినోదం–వ్యాపారం మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రభావం ఎలాగంటే.. ఈ తరహా భారీ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, చిప్ టెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ లాభాలు ఉన్నప్పటికీ మరింతగా పెట్టుబడులు పెడుతుండటం వల్ల.. కొత్త AI మోడళ్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. అలాగే గ్లోబల్ టెక్ పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. దీని ప్రభావంగా సాఫ్ట్వేర్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.కానీ అదే సమయంలో సంప్రదాయ ఐటీ సేవలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచ వ్యాపార రంగంలో ఇక “కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదా పోటీలో వెనుకబడిపోవాలి” అనే పరిస్థితి మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. -
డెబిట్ కార్డుతో పుస్తకాలపై డిస్కౌంట్
- రచయిత అమీష్ త్రిపాఠీతో జట్టు - కో-బ్రాండెడ్ కార్డును ఆవిష్కరించిన కోటక్ బ్యాంక్ - కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సేవల్లో మార్పు - బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ల అభిరుచులు వేగంగా మారుతున్నాయని, వారికి తగ్గట్టు బ్యాంకింగ్‌లో తాము పలు మార్పులు తీసుకొస్తున్నామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి చెప్పారు. కస్టమర్లతో మరింత బలమైన అనుబంధం కోసం వారికిష్టమైన పుస్తకాల్ని వారి ఇళ్లకే అందించేందుకు రచయితలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రముఖ రచయిత, ‘శివ ట్రయాలజీ’ సృష్టికర్త అమీష్ త్రిపాఠీ రాసిన తాజా పుస్తకం ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ ముఖచిత్రంగా కో-బ్రాండెడ్ డెబిట్ కార్డును మంగళవారమిక్కడ ఆయన ఆవిష్కరించారు. ఈ కార్డు సాయంతో మిగిలిన బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు అమీష్ త్రిపాఠీ పుస్తకాలపై 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించారు. ‘‘ఈ పుస్తకాన్ని మా బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేయొచ్చు. అమెజాన్‌తో ఒప్పందం ద్వారా సదరు పుస్తకాలను నేరుగా కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేస్తాం’’ అని సుమిత్ బాలి వివరించారు. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని, వారితో బలమైన బంధం కోసం తాము గతంలో పీవీఆర్ కో-బ్రాండెడ్ కార్డులు ప్రవేశపెట్టామని, చెన్నై మారథాన్ కార్డులు కూడా తెచ్చామని, ఇవన్నీ విజయం సాధించటంతో కస్టమర్లు పుస్తకాలంటే ఎక్కువ ఇష్టపడుతున్నారని గ్రహించి తాజా సేవలు ఆరంభించామని చెప్పారు. ఈ పుస్తకాన్ని ట్వీటర్లో కూడా ఆర్డర్ చేయొచ్చన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతూ... బ్రాంచీల వెలుపలే అత్యధిక లావాదేవీలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఫేస్బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియా ద్వారా లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవటానికి తాము ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఐఎన్జీ టేకోవర్ వల్ల తాము దక్షిణాదిలో బాగా బలపడ్డామని, ఈ టేకోవర్ 2015 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం 2015-16 బ్యాలెన్స్ షీట్లో ఉమ్మడి ఫలితాలు ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. తొలి క్వార్టర్ ఫలితాలు కూడా ఉమ్మడిగానే ఉంటాయన్నారు. ఐఎన్జీ కలయికతో తమ ఉద్యోగుల సంఖ్య 40వేలకు చేరుకుందని, బ్యాలెన్స్ షీట్ రూ.2 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. బ్యాంకింగ్ మారుతోంది... రచయిత అమీష్ త్రిపాఠీ మాట్లాడుతూ... తాను రచయితగా మారక ముందు మూడు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేశానని, తాను ఐడీబీఐలో చేసినపుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ విలువ కేవలం రూ.60 వేల కోట్లని చెప్పారు. అయితే 60 వేల కోట్లకు చేరటానికి ఆ బ్యాంకుకు చాలా సమయం పట్టిందని, కానీ కోటక్ అతి తక్కువ కాలంలో 2 లక్షల కోట్లకు చేరిందని తెలియజేశారు. ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ కో-బ్రాండెడ్ కార్డును ఆవిష్కరించాక మాట్లాడుతూ... ఈ సిరీస్‌లో ఇది తొలి పుస్తకమని, మరో 4 పుస్తకాలు రానున్నాయని తెలిపారు. ఈ-బుక్‌ల ప్రవేశంతో మామూలు పుస్తకాలు చదివే అలవాటు తగ్గుతోందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘సంప్రదాయ పుస్తక పఠనం కూడా పెరుగుతోంది. అయితే ఈ-బుక్ రీడింగ్ ఇంకా వేగంగా పెరుగుతోంది. నేను రాసిన శివ ట్రయాలజీ 25 లక్షల కాపీలు అమ్ముడుపోవటమే దీనికి నిదర్శనం’’ అన్నారాయన.


