నైజీరియా, ఇథియోపియా కంటే అధ్వానం
లెక్క తేల్చిన డబ్ల్యూహెచ్‌ఓ, యునిసెఫ్
న్యూఢిల్లీ: 80 ఏళ్ల స్వాతంత్య్ర భారతం... స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతం వ్యయం. అయినా కూడా సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేని దేశాల జాబితాలో తొలిస్థానం! ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ తేల్చిన నిషూ్టర సత్యమిది! బడుల్లో పారిశుద్ధ్య సౌకర్యాల లేమితో ఇబ్బంది పడుతున్న 24.4 కోట్ల మంది పిల్లల్లో ఐదో వంతు.. అంటే సుమారు ఐదు కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారని ‘‘ప్రోగ్రెస్ ఆన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ స్కూల్స్ 2015– 2025’నివేదిక తెలిపింది.
నెజీరియాలో ఈ సంఖ్య 3.4 కోట్లు కాగా, ఇథియోపియాలో 2.6 కోట్లు, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 1.1 కోటి, ఇండొనేసియాలో 80 లక్షలని అని ఈ నివేదిక తెలిపింది. అంతే కాకుండా 2015– 2025 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య సౌకర్యాల్లేని బడులు 14 శాతం వరకూ తగ్గినట్లు తెలిపింది. తాగునీటి సేవలంటే బడిలో పనిచేసే నీటి వనరు ఉండటమని, కనీస పారిశుద్ధ్య సౌకర్యం ఆడ, మగ పిల్లలు వేర్వేరుగా ఉపయోగించుకునేందుకు అవకాశం (మరుగుదొడ్లు, బాత్రూములు) కల్పించాలి.
వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకునేందుకు చేతులు కడుక్కునే ఏర్పాట్లు, సబ్బు, నీరు అందబాటులో ఉండాలని నిర్వచించి ఈ సర్వే జరిపారు. వ్యక్తిగత పరిశుభ్రత విషయానికి వస్తే దేశంలో కనీసం రెండు కోట్ల మంది బడి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలూ అందుబాటులో లేవని ఈ నివేదిక వెల్లడించింది. తాగునీటి విషయంలో భారత్ కొంత మెరుగ్గా ఉందని, ఈ కనీస అవసరం కూడా లేని బడి పిల్లల సంఖ్య కోటీ ఇరవై లక్షలు మాత్రమేనని తెలిపింది. సర్వే కాలంలో ఏటా నాలుగు శాతం చొప్పున పెరుగుదల నమోదైందని వివరించింది.


