breaking news
Ongole History
-
పురాతన పురపాలక సంఘం
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది ఒంగోలు పురపాలక సంఘం. ఇది 1876లో ఏర్పడింది. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం 1876 సెప్టెంబర్ 30న ‘మద్రాస్ టౌన్స్ ఇంప్రూవ్ మెంట్ యాక్ట్ ఆఫ్ 1871’ ప్రకారం అఫిషియల్ గజెట్ నోటిఫికేషన్ ద్వారా థర్డ్ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పడగా జిల్లా కేంద్రమయ్యింది. 1972లో జిల్లా పేరును ‘ప్రకాశం’గా మార్చడంతో ప్రకాశం జిల్లా కేంద్రం అయ్యింది.2001లో అన్నవరప్పాడు, మామిడిపాలెం గ్రామాలను కలుపుకొని స్పెషల్‌గ్రేడ్ పురపాలక సంఘం అయ్యింది. అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2012 జనవరి 25న కార్పొరేషన్‌గా అవతరించింది. అప్పుడు సమీప గ్రామాలైన కొప్పోలు, త్రోవగుంట, వెంగముక్కపాలెం, దసరాజుపల్లి, ముక్తినూతలపాడు, పెళ్ళూరు, పేర్నమిట్ట, చెర్వు కొమ్ముపాలెం, అగ్రహారం, గుడిమెల్లపాడు కార్పొ రేషన్‌లో విలీనమయ్యాయి.1867 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు జనాభా 5,832 కాగా, అది 1881కి 10,300కి పెరిగింది. నేటికి అది 2,52,739కి చేరుకుంది. 132.45 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి 1,53,628 మంది అక్షరాస్యులు (83.4 శాతం) ఉన్నారు. ఒంగోలు గిత్తలకు ప్రసిద్ధి. పురపాలక సంఘంగా ఏర్పడిన నాటినుండి ఆనందరావు పంతులు, బి.ఆర్. నారా యణ పంతులు, రావుసాహెబ్ పి.వి. కృష్ణారావు, వరదా శ్రీరాములు నాయుడువంటి సమర్థులు, ప్రజారంజకులైన పాలకులు చక్కని పాలన అందించారు. ఒంగోలు మున్సిపాలిటీకి వరదా శ్రీరాములు నాయుడు ప్రజలచే ఎన్నికైన ప్రథమ చైర్మన్. ఆయన 1934 వరకు కొనసాగారు.1934 అక్టోబరులో ధారా గోపాలశాస్త్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన శాస్త్రిగారు అనేక పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. 1934 నుండి 1952 వరకు అంటే 18 ఏళ్లు ఒంగోలు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి చరిత్ర సృష్టించారు. చైర్మన్ గా ధారా ఉన్న కాలంలోనే భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందింది. వీరి పాలనా కాలంలోనే స్థాపించిన ‘శర్మ కళాశాల’కు పురపాలక సంఘం తరపున 50 వేల రూపాయల విరాళాన్ని ఇవ్వడం ద్వారా ఒంగోలులో విద్యా వికాసానికి శ్రీకారం చుట్టారు. అప్పుడే నాటు బాబురావు పార్క్ ఏర్పాటయ్యింది. ఒంగోలు పట్టణం విద్యుదీకరించబడింది. మద్రాస్ గవర్నర్ ఆర్డర్ హువ్ ఒంగోలు రాగా వారికి పౌర సన్మానాన్ని నిరాకరించి పురపాలక సంఘం దేశభక్తిని ప్రదర్శించింది.2026 సెప్టెంబర్ నాటికి 150 సంవత్సరాలు పూర్తిచేసుకొంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పురపాలక సంఘంగా ఏర్పడి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఒంగోలు దినదినాభివృద్ధి చెందాలని ఆశిద్దాం.– డా. డి. వెంకటేశ్వర రెడ్డి, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఆంధ్ర కేసరీ యూనివర్సిటీ, ఒంగోలు (సెప్టెంబర్ 30 నాటికి ఒంగోలు పురపాలక సంఘానికి 150 ఏళ్లు)ఇదీ చదవండి: నవ్విపోదురు గాక! -
శాసనం చెప్పిన చరిత్ర
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: ఒంగోలు చరిత్ర కు సంబంధించి కొత్త ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. నగరంలోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఒంగోలు రాజుల హయాంలో అప్పటి మంత్రి వంకాయలపాటి వీరన్న నిర్మించారని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒంగోలు కొండపై చోడ గోపీనాథ ఆలయం, వైజిగేశ్వరస్వామి ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం వాహనాల షెడ్డులోని క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి తెలుగు శాసనాన్ని ప్రసన్న చెన్నకేశవస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారులు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కట్టా ప్రసాద్‌బాబు సోమవారం పరిశీలించారు. గజసాహిణి రుద్రమ నాయకుడు చోడ గోపీనాథుని ఆలయానికి వంద కుంటల పొలాన్ని నిత్యదీపారాధన నిమిత్తం దానం చేసినట్లు శాసనంలో ఉంది. ఆ దానానికి దేశిరెడ్డి బ్రహ్మిరెడ్డి, మాచమనాయుడు, పిన్నమరెడ్డి పెరుమాందిరెడ్డి, తదితరులు సాక్షులని శాసనంలో పేర్కొన్నారు. ఒంగోలులోని డీ మార్కండేయ శాస్త్రి గార్డెన్లో ఒక రాతిపై చెక్కి ఉన్న శాసనంలో కరణం బచ్చరాజు నాగరాజు వైజిగేశ్వరస్వామివారి నిత్యపూజల కోసం వంద కుంటల భూమిని దానం చేసినట్లు ఉంది. వైజిగేశ్వరస్వామి ఆలయం ఎక్కడ ఉందో ప్రస్తుతం ఎవరికీ తెలియదు. ఒంగోలులోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాలే పూర్వం చోడ గోపీనాథుడు, వైజిగేశ్వరస్వామి ఆలయాలై ఉండవచ్చని చారిత్రక పరిశోధకుడు, స్థానిక సీఎస్ఆర్ శర్మ కళాశాల చరిత్ర విభాగాధిపతి డాక్టర్ కే శ్రీనివాసులు, శాసన పరిశోధకులు విద్వాన్ జ్యోతిచంద్రమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


