శాసనం చెప్పిన చరిత్ర | Sakshi
Sakshi News home page

శాసనం చెప్పిన చరిత్ర

Published Tue, Oct 29 2013 6:48 AM

Statute to the history of the

ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: ఒంగోలు చరిత్ర కు సంబంధించి కొత్త ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. నగరంలోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఒంగోలు రాజుల హయాంలో అప్పటి మంత్రి వంకాయలపాటి వీరన్న నిర్మించారని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒంగోలు కొండపై చోడ గోపీనాథ ఆలయం, వైజిగేశ్వరస్వామి ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం వాహనాల షెడ్డులోని క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి తెలుగు శాసనాన్ని ప్రసన్న చెన్నకేశవస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారులు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కట్టా ప్రసాద్‌బాబు సోమవారం పరిశీలించారు. గజసాహిణి రుద్రమ నాయకుడు చోడ గోపీనాథుని ఆలయానికి  వంద కుంటల పొలాన్ని నిత్యదీపారాధన నిమిత్తం దానం చేసినట్లు శాసనంలో ఉంది. ఆ దానానికి దేశిరెడ్డి బ్రహ్మిరెడ్డి, మాచమనాయుడు, పిన్నమరెడ్డి పెరుమాందిరెడ్డి, తదితరులు సాక్షులని శాసనంలో పేర్కొన్నారు.

ఒంగోలులోని డీ మార్కండేయ శాస్త్రి గార్డెన్‌లో ఒక రాతిపై చెక్కి ఉన్న శాసనంలో కరణం బచ్చరాజు నాగరాజు వైజిగేశ్వరస్వామివారి నిత్యపూజల కోసం వంద కుంటల భూమిని దానం చేసినట్లు ఉంది. వైజిగేశ్వరస్వామి ఆలయం ఎక్కడ ఉందో ప్రస్తుతం ఎవరికీ తెలియదు. ఒంగోలులోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాలే పూర్వం చోడ గోపీనాథుడు, వైజిగేశ్వరస్వామి ఆలయాలై ఉండవచ్చని చారిత్రక పరిశోధకుడు, స్థానిక సీఎస్‌ఆర్ శర్మ కళాశాల చరిత్ర విభాగాధిపతి డాక్టర్ కే శ్రీనివాసులు, శాసన పరిశోధకులు విద్వాన్ జ్యోతిచంద్రమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement