భర్తను హత్య చేయించిన భార్య
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్ రూరల్: భర్త చనిపోతే ఆయనపై ఉన్న ఇంటి రుణం మాఫీ అవుతుందని, పనిలోపనిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగుతుందని ఓ మహిళ తన ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో భర్తను హత్య చేయించింది. తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించగా పోలీసులు కేసును ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపారు. డీఎస్పీ ఎన్.తిరుపతిరావు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన కౌలురైతు భూక్య వీరన్న సోమవారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లాడు.
మంగళవారం తెల్లవారుజామున బోడమంచ తండా నుంచి బేరువాడ గ్రామానికి వెళ్లే దారిలో అతని మృతదేహం కనిపించింది. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భూక్య వీరన్న భార్య విజయకు అదే తండాకు చెందిన బోడ బాలోజీకి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరన్న ఆర్థిక సమస్యలతో బాధపడుతుండగా బాలోజీ తన వ్యవసాయ భూమి అమ్మి కొన్ని అప్పులు కట్టాడు.
ఇంకా అప్పులు మిగిలి ఉండటంతో బోడ బాలోజీ, అతని స్థలంలో అద్దెకు ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడు, గూడూరు మండలం రాజనపల్లి గ్రామానికి చెందిన ధర్మారపు భరత్‌కు వీరన్న తన ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని తెలియజేశాడు. దీంతో భరత్ ముత్తూట్ సంస్థలో వీరన్నకు ఇంటిపై రుణం ఇప్పించగా అదే సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే రుణం మాఫీ అవుతుందని కూడా చెప్పాడు. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ కలిసి ఎలాగైనా వీరన్నను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించాలని, దీనివల్ల అప్పు మాఫీతోపాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు కూడా తొలగుతుందని భావించారు.
ఈ క్రమంలో ఆర్‌ఎంపీ వైద్యుడు భరత్ సహాయం తీసుకుని సోమవారం రాత్రి వీరన్నను మద్యం సేవిద్దామని చెప్పి బాలోజీ.. తండా బయట ఉన్న పామాయిల్ తోట వద్దకు పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగాక పథకం ప్రకారం బాలోజీ తనవెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో వీరన్న తల వెనుక బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. భరత్ టవల్‌తో ముక్కు, నోరుమూసి చనిపోయాక దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికిగాను బేరువాడ వెళ్లే రోడ్డు పక్కన పొలంలో మృతుడి ద్విచక్ర వాహనంతో సహా పడేశారు.
కేసు విచారణలో భార్య విజయ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా హత్యగా తేలింది. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ, ఆర్‌ఎంపీ భరత్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, రెండవ ఎస్సై నరేశ్, సిబ్బందికి ఎస్పీ డాక్టర్ శబరీశ్ అభినందనలు తెలిపారు.


