2030 నాటికి 3 రెట్లు అప్;
345 బిలియన్ డాలర్లకు చేరిక
భారీగా పెరగనున్న డార్క్ స్టోర్స్
రీసెర్చ్ కన్సల్టెన్సీ ఇన్ఫిసమ్ నివేదిక
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో దేశీయంగా ఈ–కామర్స్ రంగం మరింత భారీగా విస్తరించనుంది. 2024లో దాదాపు 125 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2030 నాటికి సుమారు మూడు రెట్లు వృద్ధి చెంది 345 బిలియన్ డాలర్లకు చేరనుంది. రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ ఇన్ఫిసమ్ రూపొందించిన ’స్మార్ట్ గ్రోత్ ఇన్ ఎ ఫాస్ట్ మార్కెట్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2030 వరకు మార్కెట్ ఏటా 18.4 శాతం స్థాయిలో వృద్ధి చెందనుంది.
మరోవైపు, వేగవంతమైన డెలివరీలకు డిమాండ్ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా డార్క్ స్టోర్స్ నెట్‌వర్క్ కూడా మూడు రెట్లు పెరగనుంది. 2025లో 2,525 డార్క్ స్టోర్స్ ఉండగా 2030 నాటికి వీటి సంఖ్య 7,500కి చేరనుంది. అధిక వృద్ధి, నూతన ఆవిష్కరణల దశలోకి భారత ఈ–కామర్స్ రంగం ప్రవేశిస్తోందని నివేదిక వివరించింది. ‘భారత ఈ–కామర్స్ వ్యవస్థలో క్విక్ కామర్స్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2030 నాటికి ఇది 65–70 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. వచ్చే ఐదేళ్లలో కొత్తగా నమోదయ్యే ఈ–రిటైల్ వృద్ధిలో ఈ విభాగం వాటా దాదాపు 45–50 శాతం వరకు ఉంటుంది‘ అని పేర్కొంది.
నివేదికలో ఇతర ముఖ్యాంశాలు..
→ తీవ్రమైన పోటీ ఉన్న క్విక్ కామర్స్ సెగ్మెంట్లో 44 శాతం మార్కెట్ వాటాతో బ్లింకిట్ అగ్రస్థానంలో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 90 కోట్ల పైచిలుకు ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వరుసగా 25 శాతం, 20 శాతం మార్కెట్ వాటాలతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
→ ఈ–కామర్స్ వృద్ధికి జెన్–జెడ్ తరం వినియోగదారులు ప్రధాన చోదకంగా ఉంటున్నారు. ఆన్‌లైన్ షాపర్స్‌లో ఇప్పటికే వీరి వాటా మూడో వంతు ఉంటోంది. మెట్రో ఏరియాల పరిధిని దాటి చిన్న పట్టణాలకు కూడా ఈ–కామర్స్ విస్తరిస్తోంది. ప్రస్తుతం కొత్తగా వచ్చే డైరెక్ట్ టు కన్జూమర్ (డీ2సీ) ఆర్డర్లలో దాదాపు 66 శాతం ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటున్నాయి.
→ ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్‌లో మొత్తం రిటైల్ వ్యయాల్లో ఈ–కామర్స్ వాటా దాదాపు 10–12 శాతానికి చేరనుంది. దాదాపు 42–44 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్స్‌కి సర్వీసులు అందిస్తూ, స్థూల దేశీయోత్పత్తిలో ఈ విభాగం వాటా 2.5 శాతానికి చేరనుంది.
→ టెక్నాలజీపరంగా చూస్తే కన్వర్సేషనల్ కామర్స్, ఏఐ–ఆధారిత షాపింగ్ అసిస్టెంట్స్, వర్చువల్‌గా ట్రై–ఆన్స్ మొదలైన వినూత్న ఆవిష్కరణలతో కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్)తో రిటైల్ ఉత్పాదకత 2030 నాటికి 35–37 శాతం మేర మెరుగుపడనుంది.


