LIC నుంచి రెండు కొత్త పాలసీలు.. సరికొత్త బెనిఫిట్లు! | LIC New Life Insurance Plans Bima Platinum Jeevan Raksha 2026 | Sakshi
Sakshi News home page

LIC నుంచి రెండు కొత్త పాలసీలు.. సరికొత్త బెనిఫిట్లు!

Sep 2 2026 8:42 PM | Updated on Sep 2 2026 9:12 PM

LIC New Life Insurance Plans Bima Platinum Jeevan Raksha 2026

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రకటించింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్‌ 770), ఎల్ఐసీ జీవన్‌ రక్ష (ప్లాన్‌ 894) పేరుతో వీటిని సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించారు. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్‌ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.

బీమా ప్లాటినం.. 

బీమా ప్లాటినం (Plan 770)ను పొదుపు, జీవిత రక్షణ, భవిష్యత్‌ ఆదాయం కలిపిన పాలసీగా ఎల్ఐసీ రూపొందించింది. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌ వ్యక్తిగత ప్లాన్‌. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే విధానం ఇందులో ఉంటుంది.

ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియానికి రూ.70 గ్యారెంటీడ్‌ అడిషన్‌ జమ అవుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన ఐదో సంవత్సరం చివర్లో పాలసీదారు జీవించి ఉంటే బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌లో 70 శాతానికి సమానమైన బూస్టర్‌ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌ లభిస్తుంది.

అంతేకాకుండా, పాలసీ పేఔట్‌ పీరియడ్‌లో ప్రతి సంవత్సరం బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌లో 10 శాతం రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌ పొందే అవకాశం ఉంటుంది. పేఔట్‌ పీరియడ్‌ అంటే పాలసీ కాలవ్యవధి నుంచి ప్రీమియం చెల్లించే కాలాన్ని మినహాయించిన తర్వాత మిగిలే కాలం.

రూ.3 లక్షల నుంచి కవర్‌

బీమా ప్లాటినంలో కనీస బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ రూ.3 లక్షలు. గరిష్ఠ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్‌ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. బీమా మొత్తాన్ని రూ.10,000 చొప్పున పెంచుకుంటూ ఎంచుకోవచ్చు.

ప్రీమియం చెల్లింపు వ్యవధిని 7, 10, 12, 15 లేదా 18 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్‌ను బట్టి ప్రవేశ వయసు కనీసం 30 రోజులు, గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదనపు రక్షణ కోసం రైడర్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

జీవన్‌ రక్ష.. 

రెండో కొత్త పాలసీ ఎల్ఐసీ జీవన్‌ రక్ష (Plan 894). ఇది బీమా ప్లాటినంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌ ప్యూర్‌ రిస్క్‌ ప్లాన్‌. అంటే పొదుపు లేదా పెట్టుబడి రాబడికంటే, పాలసీ కాలంలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.

పాలసీ నిబంధనలకు లోబడి మరణించిన సందర్భంలో గ్యారెంటీడ్‌, ఫిక్స్‌డ్‌ డెత్‌ బెనిఫిట్‌ చెల్లిస్తుంది. ఇందులో బోనస్‌ లేదా ఎల్ఐసీ మిగులులో వాటా వంటి అదనపు ప్రయోజనాలు ఉండవు.

రూ.5 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు కవర్‌

జీవన్‌ రక్షలో కనీస బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.24 లక్షలు. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య బీమా మొత్తాన్ని రూ.50,000 చొప్పున, రూ.7 లక్షలకు పైగా రూ.1 లక్ష చొప్పున ఎంచుకోవచ్చు.

ఈ పాలసీకి ప్రవేశ వయసు 18 నుంచి 45 సంవత్సరాలు. మెచ్యూరిటీ వయసు పాలసీ నిబంధనల ఆధారంగా 33 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ప్రీమియంను సింగిల్‌, రెగ్యులర్‌ లేదా లిమిటెడ్‌ ప్రీమియం విధానాల్లో చెల్లించవచ్చు. మహిళలకు ప్రత్యేక ప్రీమియం రేట్లు, అధిక బీమా మొత్తంపై రాయితీ, రైడర్‌ సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: ప్రీమియం రిటర్న్‌ ఇండియాఫస్ట్‌ లైఫ్‌ గోల్డ్‌ టర్మ్‌ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement