బిగ్‌బాస్‌ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? | Bigg Boss Telugu Winners Where Are They Now? | Sakshi
Sakshi News home page

BigBoss Telugu: బిగ్‌బాస్‌ తెలుగు విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?

Sep 1 2026 7:27 PM | Updated on Sep 1 2026 8:01 PM

Bigg Boss Telugu Winners Where Are They Now?

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్‌ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్‌ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్‌ నుంచి తొమ్మిదో సీజన్‌ వరకు టైటిల్‌ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్‌బాస్‌ హౌస్‌లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం.
శివ బాలాజీ
‘బిగ్‌బాస్‌ తెలుగు’ తొలి సీజన్‌ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్‌ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్‌ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు.
కౌశల్‌ మండా
రెండో సీజన్‌ విజేత కౌశల్‌ మండా. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్‌ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్‌ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్‌ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్‌ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్‌లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు.

ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్‌’.. ఎవరు ఎక్కడ హోస్ట్‌!

రాహుల్‌ సిప్లిగంజ్‌:
మూడో సీజన్‌ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌. బిగ్‌బాస్‌ టైటిల్‌ తర్వాత ఆయన కెరీర్‌లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్‌ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్‌ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్‌ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు.

అభిజీత్‌ దుద్దాల: నాలుగో సీజన్‌ విజేత అభిజీత్‌ దుద్దాల. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’తో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. బిగ్‌బాస్‌ విజయంతో మరింత పాపులర్‌ అయ్యారు. అనంతరం సినిమాలు, డిజిటల్‌ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. నటుడిగా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.

వీజే సన్నీ: ఐదో సీజన్‌ టైటిల్‌ను వీజే సన్నీ సొంతం చేసుకున్నారు. టెలివిజన్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. బిగ్‌బాస్‌ తర్వాత నటుడిగానూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రాజెక్టులతో కెరీర్‌ను మార్చుకున్నారు. 

ఎల్‌.వీ. రేవంత్‌ : ఆరో సీజన్‌ విజేత ఎల్‌.వీ. రేవంత్‌. అప్పటికే ప్రముఖ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘ఇండియన్‌ ఐడల్‌’ విజేతగానూ నిలిచారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ తర్వాత కూడా సంగీతానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో పలు పాటలు పాడుతూ.. సినిమాలు, మ్యూజికల్‌ ఈవెంట్లతో బిజీగా కొనసాగుతున్నారు.

ఎక్కువమంది చదివింది: ‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’
పల్లవి ప్రశాంత్‌ : ఏడో సీజన్‌లో ‘రైతు బిడ్డ’గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. అయితే విజయం తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. బిగ్‌బాస్‌ ఫినాలే అనంతరం జరిగిన గొడవలు, వాహనాల ధ్వంసానికి సంబంధించి పల్లవి ప్రశాంత్‌, ఆయన సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. అనంతరం పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ లభించింది. బిగ్‌బాస్‌కు ముందు రైతుగా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన ఆయనకు టైటిల్‌ తర్వాత మరింత పాపులారిటీ వచ్చింది.

నిఖిల్‌ మలియక్కల్‌: ఎనిమిదో సీజన్‌ విజేత నిఖిల్‌ మలియక్కల్‌. టెలివిజన్‌ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘గోరింటాకు’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్‌ విజయం ఆయన పాపులారిటీని మరింత పెంచింది. ప్రస్తుతం టెలివిజన్‌తో పాటు డిజిటల్‌ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

కల్యాణ్‌ పడాల: తొమ్మిదో సీజన్‌లో ‘సెలబ్రిటీస్‌ వర్సెస్‌ కామనర్స్‌’ థీమ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన కల్యాణ్‌ పడాల విజేతగా నిలిచారు. దీంతో బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో టైటిల్‌ గెలిచిన తొలి కామనర్‌గా రికార్డు సృష్టించారు. ఫైనల్లో తనూజ పుట్టస్వామిపై విజయం సాధించిన కల్యాణ్‌కు రూ.40 లక్షల నగదు బహుమతితో పాటు ఓ ఎస్‌యూవీ లభించింది. మాజీ భారత సైనికుడైన కల్యాణ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అయితే విజయం తర్వాత ఓటింగ్‌ ప్రక్రియపై సోషల్‌ మీడియాలో జరిగిన చర్చ కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు పదో సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కొత్త విజేత ఎవరవుతారనేది బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్‌ 10’ డేట్‌ వచ్చేసింది.. కంటెస్టెంట్స్‌ వీళ్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement