బిహారీ వినూత్న ఉపాయం
పట్నా: తన కొత్త కారును ఎవరూ ఏ రకంగానూ దొంగతనం చేయొద్దని బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మీరాతోలా గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్ సరికొత్త రీతిలో భద్రపరిచారు. సొంతింటి రెండో అంతస్తుపై దానిని పార్క్‌చేశారు. క్రేన్ సాయంతో దానిని అక్కడ దించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘నేను ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నా. ఇటీవలే స్కార్పియో క్లాసిక్ కొత్త మోడల్ కొన్నా.
జాగ్రత్తగా చూసుకోవాలని డ్రైవర్‌కి సూచించా. కానీ పని మీద అతనూ విదేశాలకు వెళ్తున్నాడు. అందుకే ఎవరూ దోచుకెళ్లకుండా రూఫ్‌టాప్ మీద పెట్టించా’’అని యజమాని చెప్పాడు. ఇంటి మీద స్కార్పియోపై సామాజిక మాధ్యమాల్లో తెగ జోకులు పేలుతున్నాయి. బిహారీలు మామూలోళ్లు కాదెహె అని కొందరు వ్యాఖ్యానించారు. సీసీటీవీ ఏర్పాట్లు, కరెంట్ ఖర్చు, చుట్టు పక్కల వాళ్లకు చెప్పడం, తరచూ ఫోన్‌చేసి చెక్ చేయడం ఇవన్నీ ఎందుకని ఒకే క్రేన్‌తో సమస్యకు పరిష్కారం చూపాడు అని మరికొందరు మెచ్చుకున్నారు.
ఒకవేళ ఈ స్కార్పియోకు ఈఎంఐలు కట్టలేక రికవరీ ఏజెంట్లు వచ్చినా దీనిని చూసి మారు మాట్లాడకుండా వెనుతిరుగుతారు అని మరొకరు జోక్‌చేశారు. క్రేన్ డ్రైవర్ తప్పించి ఇంకెవరూ దీనిని దొంగిలించలేరు అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. మామూలు పార్కింగ్ చూశానుగానీ ఇలా హెలికాప్టర్ పార్కింగ్ ఎక్కడా చూడలేదు అని ఇంకొకరు పోస్ట్‌పెట్టారు. ఎన్‌ఆర్‌ఐలు తమ కార్లను ఇలాగే పార్క్‌చేయాలని మరొకరు సలహా ఇచ్చారు. బిహార్‌లో కిడ్నాప్‌లేకాదు ఇలాంటి క్షేమదాయక ఉపాయాలు కూడా ఎక్కువే అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ కారును కొట్టేయాలంటే దొంగ ఏకంగా హెలికాప్టర్‌ను తీసుకొని రావాలని మరొకరు అన్నారు. అయితే ఇంతటి భారీ వాహనాన్ని శ్లాబ్ మీద పెడితే భవన పటిష్టత దెబ్బతింటుందని పలువురు వ్యాఖ్యానించారు.


