breaking news
second floor building
-
అందనంత ఎత్తులో వైద్యం!
సాక్షి, విశాఖపట్నం : కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్) చర్మవ్యాధుల విభాగం రోగులకు అందుబాటులో లేకుండా పోతోంది. ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. వృద్ధులు, వికలాంగులు మెట్ల మార్గం ద్వారా రెండంతస్తులు ఎక్కడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలను తల్లులు ఎత్తుకుని అంత ఎత్తు ఎక్కలేకపోతున్నారు. అక్కడ లిఫ్ట్ కూడా లేదు. లిఫ్ట్ ఏర్పాటు చేసే అవకాశమూ లేదు. అలాగే ర్యాంపు కూడా లేదు. దీంతో ఎక్కడెక్కడ నుంచో ఉచిత వైద్యానికి వచ్చే ఈ పేద రోగులు రెండంతస్తులను పడుతూ లేస్తూ ఎక్కుతున్నారు. ఈ చర్మ వ్యాధుల ఓపీకి రోజుకు 150 నుంచి 200 మంది వరకు సగటున నెలకు ఐదు వేల మంది వస్తుంటారు. వీరిలో పది శాతం మంది వయో వృద్ధులు, చిన్నారులే ఉంటున్నారు. వీరు ఒకసారి ఓపీ చూపించుకున్నాక దిగువన ఉన్న మందుల కౌంటరు వద్దకు మందుల కోసం, ఇతర పరీక్షల కోసం రావలసి వస్తోంది. ఒక్కసారి ఎక్కడానికే నానా బాధలు పడుతున్న వీరు రెండోసారి రెండంతస్తులు ఎక్కి దిగడం వారి వల్ల కావడం లేదు. అలా మెట్లెక్కలేని వారు విధిలేని పరిస్థితుల్లో కేజీహెచ్ ఎదురుగాను, పరిసరాల్లోనూ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ స్తోమతు కూడా లేని వారు ఓపిక కూడగట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కి వైద్యం అందుకుంటున్నారు. విచిత్రమేమిటంటే కేజీహెచ్ పరిసరాల్లో ఉన్న చర్మవ్యాధుల ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో కేజీహెచ్‌లో పనిచేస్తున్న కొంతమంది చర్మవ్యాధి వైద్యులవే కావడం విశేషం. కేజీహెచ్ ఓపీకి వెళ్లలేని వారంతా సమీపంలో ఉన్న చర్మ వ్యాధుల ఆస్పత్రుల్లో వైద్యానికి వెళ్తున్నారు. ఇలా రెండో అంతస్తులో చర్మ వ్యాధుల ఓపీ బ్లాక్ ఉండడం పరోక్షంగా ఆ వైద్యులకు బాగా కలిసొస్తోంది. అందువల్లే ఈ కేజీహెచ్ ఓపీ బ్లాక్ ఎంతగా అందుబాటులో లేకపోతే అంతగా వీరికి లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ వైద్యులకు హృద్రోగం కేజీహెచ్ చర్మ వ్యాధుల విభాగంలో 14 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు, మరో ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ముగ్గురు సీనియర్లలో ఇద్దరు హృద్రోగంతోను, ఒకరు ఆర్థరైటిస్తోనూ బాధపడుతున్నారు. గుండె జబ్బులతో ఉన్న వారు రెండంతస్తుల మెట్లు ఎక్కడం ప్రమాదం కావడంతో వారు దిగువన ఉన్న వార్డుకే పరిమితమవు తున్నారు. ఆర్థరైటిస్ వల్ల మరో మహిళా వైద్యురాలు కూడా ఓపీకి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కొద్దిమందే ఓపీ చూస్తున్నారు. సైకియాట్రీ వార్డుకు మార్చాలి.. ఈ పరిస్థితుల నేపథ్యంలో దిగువన (గ్రౌండ్ ఫ్లోర్లో) నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న సైకియాట్రీ వార్డును చర్మవ్యాధుల ఓపీకి కేటాయించాలని, లేనిపక్షంలో దిగువనే మరో చోట ఇవ్వాలని ఆ విభాగం వైద్యులు చాన్నాళ్లుగా కోరుతున్నారు. అయినప్పటికీ ఆ మార్పు జరగడం లేదు. గత ఏడాది నవంబర్‌లో ఒకసారి, రెండ్రోజుల క్రితం మరొకసారి వీరు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. పరిశీలించి కేటాయిస్తాను.. చర్మవ్యాధుల ఓపీని గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. అయితే ఖాళీగా ఉన్న సైకియాట్రీ వార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినందున ఈ ఓపీకి కేటాయించడానికి వీల్లేదు. చర్మవైద్యుల్లో హృద్రోగంతో ఉన్న వారు ఉన్నారు. వీరి ఇబ్బందులను, రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్ ఫ్లోర్‌ను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నాను. – డా.జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
గుంటూరులోని ఆ ఊరు రూటే సెపరేటు !
-
బిడ్డలకు భారం కాకూడదని..
► ప్రాణ త్యాగానికి పాల్పడిన ఓ మాతృమూర్తి ► పట్టెడన్నం కూడా పెట్టలేమన్న ప్రబుద్ధులు వినుకొండ రూరల్ : కన్న కొడుకులకు భారంగా మారానన్న ఆవేదనతో ఓ మాతృమూర్తి ప్రాణ త్యాగానికి పాల్పడింది. రెండస్థుల మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వినుకొండ 21వ వార్డులోని సట్టు బజారుకు చెందిన షేక్ బషీరూన్ (55) కు ఇద్దరు కొడుకులు. భర్త చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇద్దరు కొడుకుల వద్ద వంతులవారీగా ఉంటూ రోజులు నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో కొడుకులు రెండు రోజులుగా.. నేను చూడనంటే, నేను చూడనంటూ వాదనకు దిగారు. దీంతో ఆ తల్లి హృదయం గాయపడింది. తాను చనిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఒక్క ఉదుటున పరుగు పరుగున వెళ్లి ఎదురుగా ఉన్న రెండస్థుల భవనంపైకి ఎక్కి దూకేసింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్న తల్లికి పట్టెడన్నం కూడా.. నవమాసాలు మోసి ప్రాణాలు ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లికి పెరిగి పెద్దయిన కొడుకులు పట్టెడన్నం కూడా పెట్టకుండా రోజులు, నెలలు అంటూ వంతులు వేసుకోవటం ఆ మాతృమూర్తి మనస్సును కలచివేసింది. ఇంట్లో ఒక్కరికే అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు.. అని చెప్పే తల్లి మాటలు ఒక్కసారి కూడా గుర్తుకు తెచ్చుకోలేని కొడుకులు ఉన్నా లేనట్లేనని చుట్టుపక్కల వారు చీత్కరించుకుంటున్నారు. బషీరూన్కు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు కరిముల్లా వాటర్ సర్వీసింగ్ పని చేస్తుంటాడు. చిన్న కుమారుడు కాలేషా టైలరింగ్ చేస్తుంటాడు. భర్త మృతి చెందటంతో బషీరూన్ పూర్తిగా కొడుకుల సంపాదనపైనే ఆధారపడాల్సిన స్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కొడుకులు ఇద్దరూ తల్లికి అన్నం పెట్టేందుకు వంతులు వేసుకున్నారు. నెలకు ఒకరు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇటీవల ఒప్పందం ప్రకారం కూడా అన్నం పెట్టలేమని తేల్చటంతో విరక్తి చెందిన ఆ మాతృమూర్తి ప్రాణ త్యాగానికి పాల్పడింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.