భవన యజమాని అరెస్ట్‌  | Delhi Police arrest Satya Niketan building owner Hariram gupta | Sakshi
Sakshi News home page

భవన యజమాని అరెస్ట్‌ 

Sep 8 2026 5:05 AM | Updated on Sep 8 2026 5:05 AM

Delhi Police arrest Satya Niketan building owner Hariram gupta

ఢిల్లీ ఘటనలో ఏడుకు పెరిగిన మరణాలు 

ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌ 

సౌత్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్, నలుగురు ఇంజనీర్ల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ: విద్యాభ్యాసం, ఉపాధి కోసం వచ్చి పాత హాస్టల్‌ భవనంలో తలదాచుకున్న విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారం చేస్తూ పేకమేడలా ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్‌చేశారు. కూలిన భవన యజమాని అయిన మాజీ భారత వాయుసేన సార్జెంట్, 81 ఏళ్ల హరిరామ్‌ గుప్తా, ఆయన భార్య ఊర్మీళ(75), కుమారుడు మహేశ్‌(52)లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు.

 పారిపోతున్న హరిరామ్‌ను హరియాణా–రాజస్తాన్‌ సరిహద్దుల్లోని భీవాడీలో పోలీసులు పట్టుకున్నారు. భవనం పాడవుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు, పలువురి మరణాలకు కారణమైనందుకు వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పేయింగ్‌ గెస్ట్‌ భవనాన్ని హరిరాం, అతని కుమారుడు నిర్వహిస్తున్నారు. భవనం భార్య పేరిట ఉంది. మరోవైపు భవనం కూలిన ఘటనలో మరణాల సంఖ్య ఏడుకు పెరిగింది.

 27 గంటలపాటు నిరాటంకంగా కొనసాగిన అన్వేషణ, సహాయక చర్యలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఘటన జరిగినప్పటి నుంచి మొత్తంగా 12 మందిని శిథిలాల నుంచి అతికష్టంమీద బయటకు తీశారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం సమీప సత్య నికేతన్‌ ప్రాంతంలో బాయ్స్‌ పేయింగ్‌ గెస్ట్‌ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) సారథ్యంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది.

 ‘‘ఎంసీడీ, ఇతర సంస్థలు చేపట్టిన చర్యల్లో పూర్తి నిర్లక్ష్యవైఖరి కారణంగానే భవనాలు కూలుతున్నాయి. ఇలాంటి దారుణోదంతాలతో తమకు సంబంధం లేదు అని ప్రభుత్వాలు చేతులు దులిపేసుకోవద్దు’’అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కూలిన భవనానికి ఎలాంటి పిల్లర్లు, బీమ్‌లు లేకపోవడం గమనార్హం. మరోవైపు క్షతగాత్రులను ఢిల్లీ ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లో చేర్పించడంతో తమ వారి ఆరోగ్య పరిస్థితి తెల్సుకునేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఆస్పత్రికి తరలివచ్చారు.  

వీడియోకాల్‌ చేసి... ప్రాణాలతో బయటపడి.. 
బిహార్‌కు చెందిన 19 ఏళ్ల ఆదిత్య బీకామ్‌ తొలి ఏడాది చదువుతూ నాలుగు రోజుల క్రితమే ఈ భవనంలో పై అంతస్తులో దిగాడు. భవనం కూలినప్పుడు శిథిలాల్లో చిక్కుకున్నా ఎలాగోలా సోదరి ఫోన్‌చేసి ‘‘నన్ను కాపాడండి. శిథిలాల్లో ఉన్నా. ఫోన్‌ బ్యాటరీ అయిపోతోంది. కాపాడండి’’అని చెప్పగానే ఫోన్‌ కట్‌అయింది. విషయం వెంటనే అక్కడి సహాయక బృందాలకు చెప్పగానే ఎలాగోలా శిథిలాల నుంచి అతడిని కాపాడారు. 

ప్రస్తుతం ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏకంగా నాలుగు గంటల తర్వాత ఆదిత్యను కాపాడటంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీకామ్‌ చదువుతూ ఇదే భవనంలో ఉంటున్న 18 ఏళ్ల తన కుమారుడు అక్షిత్‌ లేడనే వార్త తెలిసి తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘కాలిపై ఉన్న ఒకే ఒక్క పుట్టుమచ్చతో మా వాడిని గుర్తించా. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే ఊరి నుంచి తిరిగొచ్చి దుర్ఘటనలో బలయ్యాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు.  

అధికారుల సస్పెన్షన్‌ 
ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమ వారం ఘటనాస్థలికి సందర్శించారు. అధ్వానంగా ఉన్న భవనం వివరాలను ప్రభుత్వం దృష్టికితేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కొద్దిసేపటికే ఎంసీడీ డిప్యూటీ కమిషనర్‌ రాకేశ్‌ సహా సౌత్‌ జోన్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(భవనాలు), అసిస్టెంట్‌ ఇంజనీర్‌(భవనాలు), జూనియర్‌ ఇంజనీర్‌లను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. నగరంలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాలను సీజ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.  

బీజేపీ ప్రభుత్వాలపై రాహుల్‌ విమర్శలు 
ఢిల్లీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘భవనం కుప్పకూలడం సహా ప్రభుత్వాల వైఫల్యాలపై ఎవరు ఏ ప్రశ్నలడిగినా వాళ్లను కించపరచడమే మోదీ పనిగా పెట్టుకున్నారు. ప్రతిసారీ ప్రజల జీవితాలు, ఆశలు, ఆశయాలు ఇలాంటి భవనాల కింద నలిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే ‘దిమాగీ నక్సల్‌’, ‘నారాజ్‌ ఫూఫా’ అంటూ కొత్త విమర్శలు సంధిస్తారేగానీ వైఫల్యాలకు తమదే బాధ్యత అనే జవాబుదారీతనం మాత్రం మోదీ ప్రదర్శించరు’’అని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement