ఏటీఎంలలో ఫెవిక్విక్‌.. మన డబ్బులు స్వాహా చేస్తున్న ముఠా | Gang Used Fevikwik In ATMs To Cheat People | Sakshi
Sakshi News home page

ఏటీఎంలలో ఫెవిక్విక్‌.. మన డబ్బులు స్వాహా చేస్తున్న ముఠా

Sep 8 2026 4:26 PM | Updated on Sep 8 2026 5:05 PM

Gang Used Fevikwik In ATMs To Cheat People

ముంబై: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లినప్పుడు కార్డును కార్డ్‌ స్లాట్‌లో పెట్టి, భాషను ఎంచుకుని, 4 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్‌), తీసుకోవాల్సిన నగదు మొత్తాన్ని నమోదు చేస్తారు. నగదు తీసుకున్న తర్వాత డెబిట్‌ కార్డును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే అది బయటకు రాకుండా ఇరుక్కుపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కొల్సేవాడిలో ఓ ముఠా ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఏటీఎం యంత్రాల కార్డ్‌ స్లాట్‌కు ఫెవిక్విక్‌ను పూసి కార్డులను ఇరుక్కుపోయేలా చేసేది. కల్యాణ్‌లోని కొల్సేవాడి పోలీసులు ఈ ముఠాను అరెస్ట్‌ చేశారు. ఏటీఎం కేంద్రాల వద్ద వేచి ఉండి, వినియోగదారుల కార్డులు స్లాట్‌లో ఇరుక్కుపోయేలా ఫెవిక్విక్‌ పూసినట్లు దర్యాప్తులో తేలింది.

కార్డు ఇరుక్కుపోయి వినియోగదారుడు అయోమయానికి గురైన వెంటనే ముఠాలోని ఓ సభ్యుడు సహాయం చేస్తున్నట్లు అక్కడికి వచ్చేవాడు. ఏటీఎం పిన్‌ను 3 సార్లు నమోదు చేయాలని అతడు వినియోగదారుడిని కోరేవాడు. పిన్‌ నమోదు చేసినా నగదు బయటకు రాకుండా చేసేవారు. అనంతరం ఓ ప్రత్యేక మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని వినియోగదారుడికి చెప్పేవారు. ఆ నంబర్‌ ముఠాలోని మరో సభ్యుడిదే.

తర్వాత వినియోగదారుడిని ఓ నిర్దిష్ట ప్రాంతానికి రావాలని చెప్పేవారు. దర్యాప్తులో భాగంగా వినియోగదారుల నుంచి ఏటీఎం పిన్‌ తెలుసుకున్నట్లు లేదా ఇతర మార్గాల్లో వారి బ్యాంకింగ్‌ వివరాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వివరాలతో బాధితుల ఖాతాల నుంచి నగదు తీసుకున్నట్లు వెల్లడైంది.

కల్యాణ్‌ ఈస్ట్‌లోని కొల్సేవాడి ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రంలో ఓ వ్యక్తిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో రాజేశ్‌ కుమార్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు. విచారణలో ఈ వ్యవహారంలో మరో ముగ్గురు ఉన్నట్లు రాజేశ్‌ పోలీసులకు తెలిపాడు. వారు భివాండీలోని కొంగావ్‌ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించాడు.

ఆ ముగ్గురు నిందితులు పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలులో బిహార్‌కు వెళ్తున్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు వారిని వెంబడించి పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోనే అరెస్ట్‌ చేశారు. ఇదే పద్ధతిలో ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విధానంలో ఇంకా ఎంతమందిని మోసం చేశారో, బాధితుల ఖాతాల నుంచి ఎంత నగదు తీసుకున్నారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: చిన్న విమానం అదృశ్యం.. ఫ్యామిలీ మిస్సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement