200 అడుగుల టవర్ ఎక్కిన భర్త
నాందేడ్: గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్యను ఎలాగైనా తన వద్దకు రప్పించాలంటూ ఒక భర్త వినూత్న రీతిలో డిమాండ్‌చేసి భారీస్థాయిలో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 40 ఏళ్ల షాదుల్ షేక్ సోమవారం ఉదయం లోహా పట్టణంలోని బస్టాండ్ సమీపానికి చేరుకున్నాడు.
రోడ్డు పక్కన ఉన్న 200 అడుగుల ఎత్తయిన మొబైల్ టవర్ చకచకా ఎక్కేసి ఒక భారీ బ్యానర్‌ను ప్రదర్శించడం మొదలెట్టాడు. వినికిడిలోపంతోపాటు మాట్లాడే సామర్థ్యంలేని షేక్.. ‘నా భార్యను పుట్టింటికి తీసుకొచ్చేదాకా కిందకు దిగిరాను’అని దానిపై రాశాడు. ఈ బ్యానర్ ప్రదర్శన చూసి అటుగా వెళ్తు న్న ప్రయాణికులు వాహనాలతో సహా ఆగిపోవడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. చాలా సేపటి త ర్వాత భార్యను ఘటనాస్థలికి తీసుకురావడంతో భార్యను చూసిన ఆనందంలో షేక్ చకచకా కిందకు దిగొచ్చాడు.


