మహాభారతంలో పద్మవ్యూహం అనేది యుద్ధరంగంలో రూపొందించిన అత్యంత సంక్లిష్టమైన వ్యూహాలలో ఒకటి. దానిలోకి ప్రవేశించడం ఒక సవాలు అయితే, సురక్షితంగా బయటకు రావడం మరింత పెద్ద సవాలు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన కథ మనకు ధైర్యాన్ని మాత్రమే కాకుండా, సంపూర్ణ జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన, సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
ఏ కార్యంలోనైనా ప్రవేశించే ముందు, దాని నుంచి బయట పడే మార్గాన్ని కూడా తెలుసు కోవడం అవసరమనే జీవనసూత్రాన్ని ఈ ఘట్టం మనకు గుర్తుచేస్తుంది.
మన జీవితంలో కూడా ఎన్నో ‘పద్మవ్యూహాలు’ ఎదురవుతాయి. ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో ఒత్తిడులు, లక్ష్యసాధనలో అడ్డంకులు– ఇవన్నీ పద్మవ్యూహాలే. ధైర్యం మనల్ని ముందుకు అడుగు వేయిస్తుంది. వ్యూహం సరైన దారిని చూపిస్తుంది. సమయస్ఫూర్తి ప్రమాదం నుంచి బయటపడే మార్గాన్ని సూచిస్తుంది. పద్మవ్యూహంలా మన సమస్యలు కూడా మొదట్లో అర్థంకాని విధంగా కనిపించ వచ్చు. కానీ సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి పరిశీలిస్తే పరిష్కార మార్గాలు క్రమంగా కనిపిస్తాయి.
ముందుగా అసలు సమస్య ఏమిటో గుర్తించాలి. తర్వాత మనకు ఉన్న వనరులను అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి. సరైన సమయాన్ని ఎంచుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.
అభిమన్యుడి కథ... ‘ఎంత ప్రతిభావంతుడైనా ప్రతి పరిస్థితినీ ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు’ అని చెబుతోంది. సరైన సహాయాన్ని సరైన సమయంలో స్వీకరించడం కూడా ఒక జ్ఞానమే. సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా, ఆలోచనకు మార్గం, ధైర్యానికి దిశ, ప్రయత్నానికి వ్యూహం ఉంటే ముందుకు సాగవచ్చు.
– డా. బాలాజీ దీక్షితులు పి.వి.
ఇదీ చదవండి: భిన్నత్వంలో ఏకత్వమే.. శాంతి సౌభాగ్యాలకు బాట!


