బెంగళూరు: హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లికి చెందిన నవ వివాహిత ప్రియాంక (27) అదృశ్యం కేసు విషాదాంతమైంది. 8 రోజుల తరువాత ఆమె మృతదేహం శ్రావణ బెళగొళ దగ్గర హేమావతి కాలువలో తేలింది. వివరాలు.. ఈ నెల 19న రాత్రి సన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లిలో భార్యాభర్తలు రాజశేఖర్, ప్రియాంక ఊరి శివార్లలోని కాలువ దగ్గరకెళ్లారు. అక్కడ గొడవ జరిగిందని, ఆమే కాలువలోకి దూకేసిందని భర్త చెబుతున్నాడు.
అయితే భర్తే ప్రియాంకను నీటిలోకి తోసేసినట్లు ప్రియాంక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఈత వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కాలువలో వెతుకుతూ వెళ్లగా లోతుగా ఉన్నచోట మృతదేహం లభించింది. శ్రావణ బెళగొళ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియాంకకు మొదటే పెళ్లయిందని, అది దాచి తనతో రెండవ పెళ్లి చేశారనే కోపంతో రాజశేఖర్ ఆమెను హత్య చేశాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.


